27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 23

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 23 వ భాగము* 

 💕💕💕💕💕💕💕💕💕💕💕💕


*దక్షిణ యాత్ర:*


మండనమిశ్రుని, ఆతని భార్య ఉభయభారతిని ఓడించి మండన మిశ్రునికి సన్న్యాసం ఇప్పించిన వార్త దేశం నలుమూలలా వ్యాపిం చింది. 


శంకరాచార్యులను ఎందరెందరో కలిసి జోహారులర్పించి వారికి శిష్యులయ్యారు. శంకరుల లక్ష్య సాధన ఇంతటితో పూర్తి కాలేదు. ఇది మొదలు మాత్రమే. అందుకు శిష్యసమేతంగా మాహిష్మతీపురం నుండి బయలు దేరారు దక్షిణ దిశగా. దారిలో అనేక ప్రాంతాలు దర్శించుచూ, వాటి స్థల మాహాత్మ్యాలను చెప్పుకొంటూ శాస్త్ర చర్చలతో నడుస్తూ, మధ్య మధ్య కనిపించిన పర్వతాలను, సెల యేళ్ళను, అరణ్యాలను చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యాల ను తిలకించుచూ మధ్య మధ్య గ్రామాల లో ఆగి ఆ జనులకు

దర్శనము ఇస్తూ సాగి పోతోంది వారి కాలి నడక ప్రయాణము. 


మొదట తగిలినది మహారాష్ట్రము. ఎందరో మహాభక్తులూ, మహా వ్యక్తులూ ప్రభ వించిన రాష్ట్రమది. మహా యతీశ్వరుడు వచ్చాడని తెలిసి శంకరుని కలిసి వారికి శిష్యులయిన వారు ఎందరో! మహారాష్ట్ర మంతటా పర్యటించాక ముందుకు వెళ్ళారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చారు.


*శ్రీశైలక్షేత్ర దర్శనము:*


అక్కడికి చేరుకొనే ముందు కుతూహ లంతో శిష్యులు అడుగగా శ్రీశైలమాహా త్మ్యము గురించి శంకరులవారు ఇట్లా సెలవిచ్చారు: 


“ద్వాదశ మహా లింగములు ప్రసిద్ధి కెక్కి యున్నవి. అందు బహు ప్రఖ్యాతి గాంచిన త్రిలింగముల లోను శ్రీశైలమందున్న దొకటి. క్షేత్రమందున్న దేవుడు శ్రీమల్లికార్జునస్వామి. శ్రీ భ్రమరాంబికఅమ్మవారు. ఈ క్షేత్రమహిమ వర్ణించుటకు అపూర్వమై వినుటకు తనివి తీరనిది. 'శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే' అని పురాణ వాక్కు. అంటే శ్రీశైలశిఖరం చూచినంత మాత్రాన జన్మ రాహిత్యం లభిస్తుందని. మన దేశం లోని పుణ్యక్షేత్రాలలో సాధారణంగా దేవునికో దేవికో లేదా క్షేత్రానికోమహిమ లుంటాయి. రెండింటికి మహిమలు గలవి అక్కడక్కడ కలవు గాని మూడింటికి మహత్తు గల పుణ్య క్షేత్రము ఇదొక్కటే. ఈ క్షేత్రము ముప్పది ఆమడల పొడవు, వెడల్పుకలిగి నాలుగుద్వారము లున్నవి. తూర్పున ఉన్న ద్వారము త్రిపురాంత కము, దక్షిణమున నున్నది సిద్ధవటము, పశ్చిమాన అలంపురం, ఉత్తర దిక్కున ఉమా మహేశ్వరము అనే ద్వారము. 


ఒకానొకప్పుడు ఈ క్షేత్రములో మూడువేల ఎనిమిది వందల నివాస మందిరములు, విశాలమైన వీధులు కలిగి ఉండెడిదని ఇటీవల ఆధారములతో తెలిసిన విషయము. క్షేత్రములోని రాళ్ళు, మట్టి, చెట్లు, దుంపలు, తీగలు, ఓషధులు, నీరు, గాలి మున్నగు సకల జడపదార్థములు మహా మహిమ కలిగి యున్నవి. సిద్ధులు, యోగులు మొదలగు వారు ఆకాశగమనము, స్వేచ్ఛా గమనము, అదృశ్యగమనము, భూగర్భదృశ్యము వంటి అద్భుతముల నెన్నో సాధించు చుంటారు. తప మాచరించుటకు బహు యోగ్యమైనతావిది. జ్యోతిర్లింగము నాశ్రయించు కొన్న శక్తి ఉండవలెను కదా! అష్టాదశ మహాశక్తులలో ప్రధానమైన భ్రమరాంబికాశక్తి ఇచటనే వెలసినది" అని ఆ పవిత్ర క్షేత్ర మహిమను వెల్లడించారు.


“గురుదేవా! ఈ క్షేత్రమునకు శ్రీశైలమనే పేరు ఎలా వచ్చింది?” శిష్యులు అడిగారు. శంకరులు ఇట్లా వివరిం చారు: 


“పూర్వకాలమందు వసుమతి అను పేరు కల ముని కన్య పరాత్పరుని గూర్చి తపస్సు చేసి తన పేరు స్థిరంగా ఉండవలెనని, తన పేరుకు బదులుగా శివుడు వేంచేసి యున్న శైలమునకు మొదట 'శ్రీ' చేర్చమని ప్రార్థించి నది. ఇదికృతయుగము నాటి కథ. మరియొక గాథ - కొన్ని యుగాల క్రితం శిలాదుడనే మహర్షికి పర్వతుడనే పుత్రుడు, శ్రీదేవి అనే కుమార్తె ఉన్నారు. ఈ యిరువురూ ఈశ్వరుని గూర్చి తపస్సుచేయగా పరమేశ్వరుడు ప్రత్యక్ష మై వరం కోరుకొమ్మ న్నాడు. పర్వతుడు తానొక పర్వతాకారములో నుండగా ఆ పర్వతంపై లింగాకార ముగా పరమేశ్వరుడుం డాలనీ అర్థించాడు. ఆ పర్వతం పేరులో ముందు 'శ్రీ' చేర్చమని అర్థించింది శ్రీదేవి.


భూమి పుట్టినప్పుడే ఈ క్షేత్రంలో మల్లికార్జునుడు వెలసెనని భక్తుల విశ్వాసం. హిరణ్యకశిపుడు, శ్రీరామచంద్రుడు, పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని అర్చించినట్లు పురాణ గాథ. వ్యాసభగవాను డు, ఘంటాకర్ణ శివా చార్యుడు ఇచ్చటనే తపమాచరించినట్లు ప్రతీతి.” స్నానం చేసినంత మాత్రాన సర్వపాపాలు హరించి శాంతిని చేకూర్చే పాతాళగంగలో శిష్యుల తోసహా స్నానాలాచ రించి మల్లికార్జున స్వామి ఆలయం లోనికి ప్రవేశించారు. అప్పుడు శంకరాచార్యుడు ఈ విధంగా స్తోత్రం చేశారు స్వామిని:


*సన్ధ్యారంభ విజృంభితం శ్రుతి శిరస్థానాన్తరాధిష్టితం*

*సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనా శోభితం*

*భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం*

*సేవే శ్రీగిరి మల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ |*


*భృంగీచ్ఛానటనోత్కట: కరి మద గ్రాహీ స్ఫురన్మాధవా*

*హ్లాదో నాద యుతో మహా సితవపు: పంచేషుణాచాదృత:*

*సత్పక్ష స్సుమనో వనేషు సపున స్పాక్షాన్మదీయే మనో*

*రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుః |*


ఈ క్షేత్రంలో కొన్ని నాళ్ళు ఉన్నారు శంకరాచార్యులు.


ఆగమశాస్త్రానుసారము భ్రమరాంబికా దేవిని మహాశక్తిగా స్థాపన చేశారు. ప్రతిదినము పాతాళ గంగా తీరానికి పోయి గంగలో స్నానం చేసి, జప తపాదులు ముగించుకొని తత్తీరమందే శిష్యులకు పాఠాలు చెప్పేవారు.


చుట్టు ప్రక్కల గల పండితులు వచ్చి అప్పుడప్పుడు శంకరుని అద్వైత మార్గాన్ని బోధింప జేసుకొని వెళ్ళేవారు. పాశుపతాది మతస్థులువచ్చి అద్వైతమతాన్ని అంగీకరించక వాదాలకు దిగే వారు. అట్టివారితో పద్మపాదాది శిష్యులే ఎదుర్కొని ఓడించి పంపించే వారు. ఇలాంటి వారిలో తార్కికులు, సాంఖ్యులు, వీరశైవులు, వీరవైష్ణవులు, నాస్తికులు, న్యాయవాదులు, మీమాంసాదర్శకులు, జైనులు ఉన్నారు. వారందరు తుదకు శంకరతత్త్వం ముందు నిలబడలేక నిర్జితులై వెడలే వారు.


*కాపాలికుల కుట్ర:*


శంకరుని ప్రతిభా పాటవాలు, తేజో వైభవాలు అనన్య సామాన్యమైన శాస్త్ర వైదుష్యం అపార జ్ఞాన సంపద చూచిన ఇతర మతవాదు లందరూ ఆధాటికి నిలువలేక పాదా క్రాంతు లైన వారే. కాని కొందరు వివేకహీనులు కూడా ఉన్నారు ఆ పరిస్థితిని సహించక దురభిప్రాయంతో అప మార్గంలో అద్వైత వ్యాప్తిని అడ్డుకోకపోతే తమ మనుగడకే ముప్పు వస్తుందని. అందులో కాపాలికులు అనబడేవారు ప్రముఖులు. ఒక కాపాలికుని పంపిం చారు శంకరుని వద్దకు. అతడు అవధూతవేషం లో శంకరుని చేరాడు. వారు పాతాళ గంగా తీరంలో ఒంటరిగా ఉన్న సమయం చూచి. అతి వినయ విధేయతలు ఉట్టిపడు తుండగా బహు నమ్రభావంతో నిలబడి ఈ విధమైన వింత కోరికను వెలిబుచ్చాడు:


"స్వామీ! పరమపావన మూర్తీ! కృపాసాగరా! తమ దర్శనం కోసం నేను ఎప్పటి నుండియో ఎదురు చూస్తున్నాను. నేటికి సిద్ధించింది నా పుణ్యఫలంగా. మీరు సర్వశాస్త్రవిద్యా విజ్ఞాన స్వరూపులు. అపార కరుణా సముద్రులు. అహంకార మమ కారాలు ఏనాడో మీచే హతమైనవి.సర్వజ్ఞత్వం తో లీలామానుషమైన ఈ శరీరాన్ని ధరించి లోకోపకారం చేస్తున్న వారు. మీ దయ ఉండాలే కాని అసాధ్యములు సాధ్యము కాకపోవు. నాకొక కోరిక ఉన్నది. అది సిద్ధించడానికి మీ సహాయం తప్ప వేరు దారి లేదు. నేను కాలభైరవస్వామి అనుగ్రహం కోసం బహు విధములుగా ప్రయత్నించి విఫలుడ నయ్యాను. ఇప్పుడు ఆ కోరిక మీ కరుణతో సిద్దించవచ్చు. ఘోర తపస్సు చేయగా కాలభైరవుడు ప్రత్యక్ష మై నాతో ఈ విధంగా సెలవిచ్చాడు: 'నీ కోరిక సఫలం అవ్వాలంటే ఒక సార్వభౌముని శిరమును గాని, ఒక

యతీంద్రుని శిరస్సు గాని అగ్నిలో హెూమం చేయి' అని చెప్పి అంతర్ధాన మయ్యాడు. మహాత్మా! నాకు భూమండలంలో సార్వభౌముడన దగిన వాడు కాన రాడయ్యె. ఇక యతీంద్రుని కొరకే నా అన్వేషణ. కాని ఏ యతి నాకు శిరో దానం ఇవ్వడానికి సిద్ధ పడతాడు? అలా చేయడానికి తగిన విజ్ఞానపరిణతి, వైరాగ్య పరిపక్వత, మహాదాన సంకల్పం ఎవరికి ఉంటుంది? మీరు ఒకరే నాకు కనబడ్డారు ఇంద్రియముల మీద, దేహం మీద పూర్తిగా స్పృహ విడచిన వారు. మీ ఒక్కరికే నిజంగా అవగతమయింది ఈ జగత్తు అంతా అసత్య మని, సత్యమైనది వేరేదో ఉన్నదని. ఆ ఆత్మజ్ఞాన పరిపూర్ణు లైన మీరు నా ప్రార్థనను మన్నించి నన్ను ధన్యుణ్ణి చేయాలి. గతంలో దధీచి దేవతలకు తన ఎముకలను దానం చేసి అజరామరమైన కీర్తి సంపాదించాడు. అలాగే శిబి తన తొడను కడకు శరీరాన్నే ఇచ్చాడు డేగ ఆకలి తీర్చడానికి. మీ కరుణా కటాక్షం కోసం నిలబడ్డాను” ఆ కపట సన్న్యాసి కోరికకు తలయూపి శంకరుడు ఇలా అన్నాడు: “ఓయి సిద్ధపురుషుడా! ఎప్పటి కయినా విడువ దగినదే ఈ శరీరం. నా తల తీసికొని నీ పని కానిమ్ము. కాని ఒకటి గుర్తుంచుకో. ఇది చాల రహస్యంగా కావలసిన పని. కాబట్టి ఒక రహస్యప్రదేశం చూసుకో. నా శిష్యులు ఎవరి కయినా తెలిస్తే నీ పనికి అంతరాయం కలుగుతుంది" అని శంకరుడు కపాల దానానికి సిద్ధపడ్డాడు. అనుకొన్న రహస్య ప్రదేశంచేరి శంకరాచార్యుడు సుఖాసీనుడై, గెడ్డాన్ని కంఠం కుతుకున ఆన్చి, రెండు చేతులూ, మోకాళ్ళనూ తాకి, నిమీలిత నేత్రుడై, భ్రూమధ్యాన్ని చూస్తూ, సంకల్ప వికల్పములు లేనివాడై ఇంద్రియ వ్యాపారాన్ని అరికట్టి పరమాత్మను తానుగా భావిస్తూ అలా యోగసమాధి లోనికి వెళ్ళాడు. ఇక కాపాలి కుడు తన మనోరథం పూర్తి కానున్నదన్న ఆనందంతో ఒడలంతా ఎముకల బూడిదను పూసుకొని, మత్తుగా మద్యపానం చేసి,ఒకచేత కరవాలం వేరొక చేత త్రిశూలంతో కాలభైరవ వేషధారిగా వచ్చాడా చోటికి. వస్తూనే దూరాన నుండి కనబడినదా కండ్లు మిరుమిట్లు గొలిపే దివ్య దృశ్యం. ఏనాడో సుకృతం చేసికొని ఉండాలి ఆతడు. లేకపోతే ఎలా లభ్య మవుతుంది యోగ సమాధిస్థితుడై ఉన్న పరమేశ్వరుని దర్శనం!


*పద్మపాదుని నృసింహావతరణ:*


కాలకృత్యాలకు వెడలిన శిష్యులు స్నానాలు చేసి, సంధ్య నుపాసించి ధ్యానంలో ఉన్నారు. పద్మపాదుడు కూడా ధ్యాననిమగ్నుడై ఉండగా అతనికి గోచరించింది కరవాల ము ధరించి జగద్గురు వుల శిరమును ఖండించడానికి ఉద్యుక్తుడై ఉన్న కాపాలికుని దృశ్యం. వెంటనే పద్మపాదుడు తన ఇష్టదైవాన్ని తలచుకొన్నాడు. తలచిన మరు క్షణమే పద్మపాదునికి నృసింహ స్వామి రూపు వచ్చింది. కాపాలికుడు గురుదేవుడు ఉన్న రహస్య స్థలంలో అదే క్షణంలో ప్రత్యక్ష మయ్యాడు. అగ్నిజ్వాలలు కక్కు తున్న ముఖంతో, వాడి కోరలతో, చీల్చి చెండాడే కత్తుల వంటి గోళ్ళతో చింత నిప్పు వంటి నాలుకతో భీకర రూపందాల్చి సింహ గర్జనను మించిన గర్జనతో ఒక్క ఉరకలో కాపాలికుని మీదికి లంఘించినాడు పద్మపాదుడు. పృథివి దద్దరిల్లింది. 


సకలభూతములు భీతిల్లాయి. దేవతలు అడలి అవనికి దిగి వచ్చారు. హిరణ్య కశిపుని బారి నుండి ప్రహ్లాదుని కాపాడినట్లు కాపాలికుని సంహరించి శంకరుని రక్షించు కొన్నాడు.


ఇంతలో శంకరుడు యోగ సమాధి నుండి వెలువడి జరిగినది గ్రహించాడు. ఆకాశం విరిగి మీద పడినట్లు అట్టహాసంతో ప్రత్యక్ష మయిన ఆ ఉగ్ర నరసింహ స్వామిని చూచి ఇలా ప్రార్థించాడు:

*“కల్పంతో జృంభమాణ ప్రమథ*

*పరివృఢ ప్రౌఢ లాలాట వహ్ని*

*జ్వాలాలీఢ త్రిలోకే జనిత చటచటధ్వాన ధిక్కార ధుర్యః ॥*


*మధ్యే బ్రహ్మాండభాండోదర కుహర,* 

*మనైకాంత్య దుస్థా మనస్థాం*

*ప్రాప్తస్త్యానో మమాయం*

*దళయతు దురితం*


 శ్రీనృసింహాట్టహాస:


ఉగ్రరూపాన్ని ఉపసంహ రించమని శంకరులు అర్థించగా ఆ రూపం అదృశ్యమై పద్మపాదా చార్యుడు గోచరించాడు. పద్మపాదుడు ఆనందా శ్రువులతో గురువు పాదాలకు అభిషేకం చేశాడు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*

*23 వ భాగము సమాప్తము*

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

కామెంట్‌లు లేవు: