27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 24

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 24 వ భాగము* 

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


*పద్మపాదుని కథ:*


పద్మపాదుడు గురువు లను రక్షించిన తెఱగు చూచి అద్భుత పడిన శిష్యులు శ్రీ నృసింహ స్వామి పద్మపాదునకు ఎలా ప్రసన్నుడయ్యాడో తెలుపమని కోరగా పద్మపాదుడు వారికి ఈ కథ చెప్పాడు. 


“అహెూబిలమనే పర్వతం మీద మహారణ్యముంది. ఆ అడవిలో చాల కాలం తపస్సు చేస్తున్నాను. అప్పుడు ఒక కిరాతుడు వచ్చి 'ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నా'వని అడిగాడు నన్ను. 'ఈ అడవిలో ఒక విచిత్రమృగ ముంది. ఎప్పటి నుండో వెదుకుతున్నాను. ఇప్పటి దాకా కన్పించ లేదు. అందు చేతనే ఎప్పుడయినా కనిపించకపోదా అనే నమ్మకంతో ఇక్కడే తపస్సు చేస్తున్నాను'.


అప్పుడు కిరాతునికి నాపై జాలి కలిగి నా కోసం ఆ అడవి అంతా వెదకి ఆ మృగాన్ని లతలతో బంధించి నా యెదుట నిలబెట్టాడు. నీకెలా దొరికింది అని  అడిగే లోపలే నేను చూస్తున్నది సాక్షాత్తు శ్రీనరసింహస్వామినే అని తెలిసి సాష్టాంగ వందనం చేశాను ఆ అపురూపమైన అవతారికి. అప్పుడు స్వామికి నమస్కరించి ఇలా అడిగాను: "పరమాత్మా! ఘోరమైన తపస్సు లాచరించే మహర్షులకు కూడ తమ దర్శన భాగ్యం దొరకదే! ఈ కిరాతు నకు ఎలా వశమయ్యా వో సెలవియ్యండి" అందుకు స్వామి మందహాసంతో “సనందనా! మునులు గాని, బ్రహ్మర్షులు గాని ఈ కిరాతుని వలె నా రూపమును నిశ్చలులై ధ్యానం చేసిన వారు లేరు. అందుచేత ఇతని నిర్మలచిత్తానికి మెచ్చి పట్టుబడ్డాను. ఇంక ఇతని గురించిన సంశయము వీడుము” అని చెప్పి అంతర్హితు డయ్యారు.పరమానంద భరితులైన శిష్యగణం ఈ కథకు ఫలశ్రుతి చెప్పమని కోరగా పద్మపాదుడుచెప్పాడు: 


"ఈ నృసింహస్వామి కథ చదివినా, విన్నా, చెప్పినా, వ్రాసినా స్వామివారి అనుగ్రహా నికి పాత్రులగుతారు. అట్టివారికి అసాధ్య మైన రోగములు, బ్రహ్మ రాక్షస, భూతప్రేత, పిశాచ, శాకినీ, ఢాకిన్యా ది సర్వ దుష్ట గ్రహ బాధలు, ప్రయోగాది బాధలు తొలగి, సుపుత్ర ప్రాప్తి పొంది, కోరికలు సిద్ధించును. భక్తి జ్ఞాన వైరాగ్యము లు కలిగి ముక్తిని బడయుదురు.”


శంకరాచార్యులు శిష్యులతో కొన్ని దినములు శ్రీశైలములో గడపి పశ్చిమతీరాన గల గోకర్ణక్షేత్రమునకు బయలు దేరారు.


*గోకర్ణక్షేత్రము:*


గోకర్ణం ఆకారంలో సముద్రుడు భూభాగం లోనికి చొచ్చుకువచ్చి నందు వలన ఈ క్షేత్రానికి ఈ నామం కలిగింది, ఆ పేరు శివుడే పెట్టాడని అంటారు. పండ్రెండు తేజోలింగముల లోని దైన మహాబలేశ్వర లింగం ఇక్కడ ఉన్నది. ఈశ్వరుడు రావణాసు రునికి ఇచ్చిన లింగము లలోని భాగమే ఇది అంటారు. కాశీ క్షేత్రము కన్న ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమని అచ్చోట గల చిహ్నములను బట్టి యందురు. రావణ సంహారా నంతరం శ్రీ రాముడు ఈ క్షేత్రంలో కొన్నినాళ్ళు ఉండి ఆత్మలింగాన్ని అర్చించి నట్లు అందుచేత కొండ దరిని గల స్థలాన్ని 'రామతీర్థము' అని స్థలపురాణము. 


శ్రీశంకరాచార్యులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సంద ర్శించి అందు వేంచేసి ఉన్న పార్వతీ పరమేశ్వ రులను స్తుతించారు. తరువాత హరిహర దివ్యక్షేత్రానికి బయలుదేరారు.


*హరిహర క్షేత్రము:*


ఈ క్షేత్రము చాలా  విశిష్టమైన పుణ్యస్థలం. ఒకప్పుడు ఈ ప్రాంతం లో వీరశైవమని ఒక తెగ, వీరవైష్ణవమని మరొక తెగ - రెండు తెగల 'భక్తులు’ పరస్పరం స్పర్థలతో ఒకరి నొకరు ద్వేషిస్తూ, దూషించుకొంటూ మితిమీరిన వైరాలతో చెలరేగుతూ ఉండే వారు. ఒకరి పొడ ఒకరికి గిట్టేది కాదు. బొట్టూ, కట్టూ వేరు వేరు. దేవుళ్ళు వేరు. ఆచారాలు వేరు. ఆగమాలు వేరు. పద్ధతులు వేరు. పేళ్ళు వేరు. మా దేవుడు అధికుడు, మా దేవుడే అధికుడు అని ఇరు తెగల వారూ తెగని తగని శత్రుత్వాలు పెంచి పోషించుకొనే వారు. ఇది చూచిన పరమాత్మ      దయామయుడై శివుడు, విష్ణువు కలిసి ఉన్న రూపంలో ప్రత్యక్ష మయ్యాడు. ఈ విషయం వేదం లోనే ఉందని అజ్ఞప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినదీ హరిహర నాధ రూపం. స్వామిని దర్శించుకొని అప్పుడు శంకరా చార్యుడు దశావతార స్తోతం చేశారు.


మొదటిగా మత్స్యావతారాన్ని, తరువాత వరుసగా కూర్మావతారాన్ని, వరాహావతారాన్ని, నరసింహావతారాన్ని, వామనావతారాన్ని, పరశురామా వతారాన్ని, రామావతారాన్ని, బలరామ కృష్ణా వతారాలను, బుద్ధావ తారము, కల్క్యవ తారమును సోత్రము చేశారు. ఈ విధంగా శంకరస్వామి శివ కేశవుల అభేదత్వాన్ని నిరూపించినారు. అక్కడినుండి ప్రయాణము మూకాంబికా క్షేత్రమునకు.


మూకాంబికా క్షేత్రము:


క్షేత్రం లోని ఏ క్షేత్రాన్ని దర్శించినా శంకరా చార్యులు మొదటగా ఆ ఆలయం ప్రవేశించి తరువాత మిగతా విషయాలను చూచుకొనే వారు. ఆ ఆచారాన్ని వీడకుండా మూకాంబికా క్షేత్రం వచ్చాక తిన్నగా ఆలయం లోనికి వెడలుచుండగా వారి కొక విషాద దృశ్యం కనిపించింది.


దేవాలయానికి ఎదురుగా చచ్చిన బిడ్డను ఒడిలో ఉంచుకొని తల్లిదండ్రు లు రోదన చేయుచున్న దృశ్య మది. శంకరులు అది చూచి జాలి నొందారు.


"వీరలను రక్షించుటకు ఎవడు సమర్థుడు కాడో వాడున్నూ ఏడ్చిన వాడగుచున్నాడు”అన్న ఆకాశవాణి వినిపిం చింది గట్టిగా. ఆ పలుకులువిన్న శంకరుడు అవి దేవి పలుకులుగా గుర్తించారు.


"పరమేశ్వరీ! దయా మయీ! తమ దయయే ఈలోకాన్ని పాలిస్తు న్నది. ఆ దయయే లోకాన్ని రక్షిస్తోంది. కనుక 'కటాక్షించు' అని శంకరుడు ఆ దేవికి బదులుగా పలికాడు. వెంటనే ఆ బాల శిశువు బ్రతికి లేచి కూర్చు న్నాడు.


తల్లిదండ్రుల ఆనందమునకు అవధి లేదు. ఆ దృశ్యం చూచిన వారందరూ చకితులై శంకరస్వామి ని వేనోళ్ళ కొనియాడి నమస్కరించారు. సాక్షాత్తు శంకరుడే అని భావించారు. శంకరాచార్యుడు ఆలయ ప్రవేశము చేసి, మూకాంబికాదేవిని స్తుతించారు. “అమ్మా! నీ మహిమలు కొని యాడడానికి మాటలు చాలవు. నిన్ను నుతించినా, దర్శించి నా, స్మరించినా మూగవాళ్ళు వాగ్ధార లతో వెలుగొందు తున్నారు. సృష్టి, స్థితి, లయములకు కారకు రాలివి. జగదంబా! బ్రహ్మాది దేవతలు నిన్ను తెలిసికొనజాలరు. పరిపూర్ణంగా నిన్ను తెలిసికొన్నవారు జీవన్ముక్తులే గదా!” అని స్తోత్రం చేశారు. ఈ క్షేత్రంలో కొన్నాళ్లుండి తత్త్వప్రచారం చేస్తూ తరువాత బల్యగ్రహారానికి బయలు దేరారు.


బల్యగ్రహారము:


రెండు వేల బ్రాహ్మణుల కుటుంబములు కలది బల్యగ్రహారము. అందున్నవారికి సత్కర్మలు చేయుటే గాని దుష్కర్మల జోలికి ఎన్నడూపోరు. అకుంఠితదైవభక్తితో, శ్రద్ధతో దీక్షతో ఎల్లపుడూ సత్కర్మా చరణలలోనే కాలం గడిపేవారు ఆ అగ్రహార వాసులు. యధావిధిగా ప్రతి యింట అగ్నిని ఆరాధించే వారే. ఎక్కడ చూచినా వేదఘోష, అట్టి పరమపవిత్రమైన ఆ అగ్రహారంలో మృత్యువు ప్రవేశించ డానికి భయపడి చుట్టూ తిరిగి వెళ్ళి పోవలసిందే! ఆ విప్రులను దర్శించి శంకరులు వారికి తత్త్వబోధ గావించి వారిని సంతుష్టులను చేశారు.


శృంగగిరిలో శారదా పీఠము:


ఇంక మధ్యలో ఎక్కడా ఆగక శంకరాచార్య స్వామి తిన్నగా శృంగ గిరి చేరుకొన్నారు. శృంగగిరి అతి విశిష్ట మైన చరిత్ర కలది. పూర్వము ఋష్యశృంగుడు అనే మహర్షి తపస్సు చేసిన పావన భూమి అది. తుంగభద్రా నదీతీరాన ఉన్నది ఈ గిరి. ఇది పండితులకు తపో ధనులకు నిత్యావాసము. సర్వకాల సర్వావస్థల యందు వేదఘోష వినబడుతూనే ఉంటుంది. ఈ ప్రాంత మందున్న వారు యజ్ఞయాగాది క్రతువు లాచరించిన వారు. వైదిక కర్మనిరతులై శాంతము, దయ, శమము, దమము కలిగి కరుణాంత: కరణలతో అతిథి అభ్యాగతులను ఆదరిస్తూంటారు. వితరణబుద్ధిలో కల్ప తరువు, కామధేనువు ను మించినవారు. దేవతలు కూడ అచ్చోట ప్రీతిగా వసింప నెంచేవారు. శృంగగిరి వాసులు విఘ్నాలు వచ్చియెఱుగరు. ఇటువంటి మేటి సజ్జనులకు నివాసమైన శృంగగిరిలో శంకరా చార్యస్వామి ఎక్కువ కాలము గడుపుతూ ఆ పండితజనులకు ప్రస్థానత్రయ భాష్యమును బోధిస్తూ ఉపనిషత్తుల సారాంశాన్నీ వేదాల సారాంశాన్ని పవిత్రులు, పాత్రులూ అయిన విద్వజ్జన సమాజాన్ని ఆకట్టుకొని అధ్యాపకు లయ్యారు. తృటికాలం లో కుశాగ్రబుద్ధులు శంకరునికి శిష్యులైపోయారు.


శంకరాచార్యులకు ఆ చోట శారదాపీఠంగా నెలకొల్పాలన్న సంకల్పము వచ్చి అనువయిన స్థలాన్ని ఎన్నుకొన్నారు. శుభ ముహూర్తాన శంకు స్థాపన గావించి ఆగమశాస్త్రరీత్యా అన్ని ఏర్పాట్లు చేసి ప్రవీణులయిన శిల్పు లతో మనోహర మైన మఠనిర్మాణం చేయిం చారు. ఇంద్రాది దేవతలు సర్వదా పూజించే శారదాదేవిని అందు ప్రతిష్ఠించారు. వేదవిహితంగా సకలోపచారాలు శాశ్వతంగా జరిగే విధంగా అమలు పరచారు.

శ్రీసురేశ్వరాచార్యులను ఆ పీఠమునకు అధిపతిగా నియ మించారు. నేటికిని ఆ పీఠము అద్వితీయము గా అలరారుచున్నది. చతురామ్నాయ పీఠములలో మిన్నగా ప్రతిభకెక్కి యున్నది.


తోటకాచార్యుడు:


ఆనందగిరి అనే పేరు గల ఒక బ్రహ్మచారి శృంగగిరికి వచ్చి

శ్రీశంకరాచార్యుల పాదపద్మములకు మ్రొక్కి క్రింది విధంగా ప్రార్థించాడు: 


"మహాత్మా! ఏమియు తెలియని వాడిని. చదువుకొన్నవాడిని కాను. మీ శిష్యుడనై మీ సేవ చేసి కోవాలని వచ్చాను. తాము ఎందరినో చదువులేని వారిని జేర దీసి విద్వాంసులను చేశారని విని పేరాసతో వచ్చాను. నాకు మీ సేవాభాగ్యం ఇప్పిం చండి. మీ సేవలు చేసుకుంటూ ధన్యుడి నవుతాను”.


అతడి వైఖరి, మాట పొందిక శ్రీశంకరులకు నచ్చి ఆ బ్రహ్మచారిని శిష్యునిగాతీసుకొన్నారు. ఆనందగిరి శాస్త్రాలు చదువక పోయినా, వేదాధ్యయనం చేయక పోయినా వేదాల్లో చెప్పినట్లే నడచు కొంటున్నాడు. వినయ విధేయతలతో, మృదు మధురమైన మిత భాషణలతో చక్కగా గురుసేవ చేస్తున్నాడు. వేకువనే గురువులు లేవక ముందే లేచి తన కాలకృత్యములు, అనుష్ఠానములు ముగించుకొని సిద్ధంగా ఉంటాడు. గురువులకు ఆసనం అమర్చడం, కాలకృత్యాదులకు అన్నీ సిద్ధం చేయడం, తానే గురువులకు స్నానం చేయించడం, వారికి శుభ్రమైన కాషాయవస్త్రం ఇవ్వడం వంటివి అతని దినకృత్యాలు. గురువులు విడచిన కౌపీనము, శాఠీలను ఉతికి ఆరవేసి భద్రపరచడం ఇవన్నీ తానే ఆనందంగా శ్రద్ధగా చేసే చర్యలు. తిరిగి పాఠము వినే వేళకు తన కార్య క్రమాలు ముగించుకొని వస్తాడు. గురువులను నీడ వలె వెంటాడుతూ, పరుండినపుడు పాదములుఒత్తుతాడు. ఈ విధంగా గురుసేవ లో తనను తానే మరచి ఉండే వాడు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్యచరిత్రము*

*24 వ భాగము సమాప్తము* 

🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑

కామెంట్‌లు లేవు: