జై శ్రీ రామ్
పూజ ఎందుకు చేయాలి? లాభం?
పై ప్రశ్న చిన్న పిల్లలు అడిగారు అంటే అర్ధం ఉంది, కానీ నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా, ప్రపంచ వ్యామోహము లో మునిగి, అరిషడ్వర్గాలలో తేలుతూ కూడా, ఇదే ప్రశ్న అడుగుతునారు. మనము వెంటనే, పూజ చేయక పోతే, కళ్ళు పోతాయి లేదా సంపదలు పోతాయి, లేదా చేస్తే సంపదలు వస్తాయి అంటాం. ఎందుకంటే, మనకు కూడా, పూర్తి అవగాహన ఉండదు, పూజ ఎందుకు అని. మనము పెట్టె ప్రసాదము దేవుడు ఆరగిస్తున్నారా? ఆరగిస్తే, ఇక నైవద్యం పెడతామా, ఆయన కడుపు నిండాలంటే, ఎన్ని గుండిగల ప్రసాదం పెట్టాలి, తిరుపతి వెంకన్న దగ్గర పెట్టిన విధముగా? అందుకే ఆయన తెలికగా తెలివిగా, బీదవారు కూడా పెట్టగలిగే విధముగా, కాణీ ఖర్చు లేకుండా, మన మనసు నైవేద్యంగా పెట్టాలి అని, ఎప్పుడో చెప్పారు. దేవుడు నిరాకారుడు నిరంజనుడు, ఈ ప్రపంచమంతా వ్యాపించిన వాడు నడిపిస్తున్నవాడు, నీలో నాలో ఉన్నాడు చైతన్యములా. ఆ చైతన్యము పోతే, మనిషి శవము తో సమానము. కాకపోతే, అది అర్ధం కావడానికి ఆచరణలో సాధన చేడానికి, మనసు నిలవాలి సహకరించాలి. దానికే పూజ మొదటి మెట్టు, మన కోసం.
కొడుకు ఉన్నాడా ఇంట్లో !!!.. ఉన్నాడు... చాలు ... పెద్ద ఊరట. ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ...’’ ..వెళ్ళవలసిందే. తప్పదు... వాడుంటే చాలు.. తనూభవుడు... ఒక ఊరట. ‘‘ఆత్మావై పుత్రనామాసి...’’ (ఓ పుత్రా! నేనే నువ్వు) ఈశ్వరుడు ఎంత ఊరట కల్పించాడో చూడండి!!! మరిదంతా ఎలా ప్రభవిస్తున్నది...అంటే వివాహం వల్ల. ఈ సంపదకంతటికీ పునాది గృహస్థాశ్రమం... ఇక్కడే నువ్వు తండ్రి రుణం నుంచి విముక్తడవవుతున్నావు. తండ్రి నీకు ఎలా జన్మనిచ్చాడో నీవు కూడా వేరొక జీవునకు శరీరాన్ని కల్పించావు. అలా కల్పించి సంతానం ద్వారా ఊరట పొందావు. పితృరుణాన్ని తీర్చుకున్నావు. అది ధర్మపత్ని సహకారం లేకుండా తీరేది కానే కాదు. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం.
తరువాత.. వైరాగ్య సుఖం... అదెట్లా రావాలి! రామకృష్ణ పరమహంస– ‘బొట్టుబొట్టుగా రాదు, వైరాగ్యం వస్తే వరదలా వస్తుంది’..అంటారు. వైరాగ్యంలోకి వెళ్ళినవాడు నిరంతరం పరబ్రహ్మను గురించి తనలో తాను రమిస్తుంటాడు. మళ్ళీ మునుపటి జీవితంలోకి రాడు.. ‘‘యోగరతో వాభోగరతోవా/సం^గరతో వా సంగవిహీనః /యస్య బ్రహ్మని రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ...’’.. దీనికంతటికీ కారణం గృహస్థాశ్రమం. ఆపైన దేవతల రుణం. ఇంద్రియాలన్నింటికీ దేవతలు అధిష్ఠాన శక్తులుగా ఉన్నారు. అందువల్ల వారి రుణం తీర్చుకోవాలి. దానికోసమే ఇంటింటా పూజా విధానం అనేది వచ్చింది. పూజ దేనికి? కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం– కృతజ్ఞత కలిగి ఉండడం.‘‘బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా / నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః’’అంటాడు లక్ష్మణ స్వామి కిష్కింధ కాండలో. ఎవరికయినా నిష్కృతి ఉందేమో కానీ, పొందిన ఉపకారాన్ని మరిచిపోయిన వాడికి మాత్రం నిష్కృతి లేదు.
ఎవరు మనకు ఉపకారం చేశారో వారికి మనం ప్రత్యుపకారం చేయడం చాలా గొప్ప విషయం... అందుకే..ఏష ధర్మః సనాతనః(ఇదీ మన సనాతన ధర్మం) అంటారు రామాయణంలో. బద్దెన గారు కూడా..‘‘ఉపకారికినుపకారము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’’.. అన్నారు కదా! అందుకే మనకు ఉపకారం చేసిన దేవతలకు ప్రత్యుపకారం చేసి దేవతా రుణాన్ని తీర్చుకోవాలి... అలా చేయాలన్నా గృహస్థాశ్రమ స్వీకారం తప్పనిసరి. ఇంద్రియాల ద్వారా దేవతలు మనకు చేసిన ఉపకారం ఏమిటి? ఐదు జ్ఞానేంద్రియాలను శక్తి సమకూర్చి ఇస్తున్నారు. వీటి ద్వారానే కొన్ని కోట్ల సుఖాలను, కొన్ని కోట్ల దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. కన్నును ఆధారం చేసుకుని మనకు ఇస్తున్న సుఖాలకు కృతజ్ఞతగా పాదాల చెంత దీపం పెట్టి నమస్కరిస్తున్నాం. చెవులిచ్చాడు. వేదాలే కాదు, సంగీతమే కాదు, చిన్న పిల్లల వచ్చీరాని మాటలను కూడా విని ఆనందిస్తున్నాం. హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడితో.. ‘అనుదిన సంతోషణములు జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్‘ అంటాడు. ఆ అవకాశం కల్పించినందుకు పూలతో పూజ చేస్తాం. రుచులను ఆస్వాదించడానికి నాలుక ఇచ్చినందుకు మధుర పదార్థాలతో నైవేద్యం పెడుతున్నాం. చర్మస్పర్శ అనుభూతిని ప్రసాదించినందుకు చందన లేపనంతో సేవిస్తున్నాం. ఈ ఐదు ఉపచారాలతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, అంటే మనము మనసు తో చేసే వ్యాయామం, అంటే మానసిక సాధన. మనసును స్థిరపరచుకోవడానికి ఇదొక మార్గము. అందుకే పూజలో భాగం ధ్యానము కూడా మొదట, తర్వాత, ధ్యానం లోనే దేవుని పూజ. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి, మన మెదడుని మనమే సక్రమమైన పద్దతిలో పెట్టుకునే, ఓ ప్రక్రియ. మనసు నియంత్రణ లేని వారు, ఎలా పతనమౌతున్నారో, చూస్తున్నారు కదా? ఆత్మహత్యలు, తాగుడు, జూదము, మత్తు మందు, కోపము, తల్లి దండ్రులను తూలనాడడము వదిలేయడము, ఇంకా ఎన్నో విచిత్రాలు చూస్తున్నాము, చూస్తాము. నూనే లేదా నెయ్యి దీపం వెలుగులు పెట్టడం అన్నది, త్రాటకం అనే ఓ యోగ ప్రక్రియ అంటారు. రోజూ ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే, కంటి జబ్బులను అరికట్టవచ్చు అని, పెద్దలు అంటారు.
ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే లేదా 108 నామాలు చదివితే, నాలిక మొద్దు బారదు, మాట స్పష్టత వస్తుంది. అది నాలికకు ఓ వ్యాయామము అనవచ్చు కదా? అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా, పలకగలిగే శక్తి వస్తుంది, ఉచ్చారణా అలాగే ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే, సభా లేదా పదిమంది లో మాట్లాడే, భయం కూడా పోతుంది, ధైర్యం వస్తుంది. బెరుకుగా, గొంతు ఎత్తి మాట్లాడలేని బయటకు చెప్పలేని వాళ్ళను, పదిమంది లో మాట్లాడలేని వారిని, ఎంతో మందిని చూస్తున్నాము కదా? పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పగలరు, మనల్ని మనము సరిగ్గ మార్చుకునే విధానము అని చెప్పగలరు.
జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి