28. " మహాదర్శనము "--ఇరవై ఎనిమిదవ భాగము -- గురుకుల వాసము
28. ఇరవై ఎనిమిదవ భాగము -- గురుకుల వాసము
ఆచార్యుడు కొడుకును ఒక సంవత్సరము ఇంటిలోనే ఉంచుకొని యుండి యజుస్సంహితను అధ్యయనము చేయించినాడు . ఏకసంత గ్రాహియైన శిష్యునికి వేదపాఠమును నేర్పించుట అదేమి కష్టము ? యజుస్సంహితలో గద్య, పద్య మంత్రములు , ఒక్కొక్కచోట బ్రాహ్మణమువలె ఉన్న మంత్రరాశి . అయిననూ కుమారుడు సునాయాసముగా ఒకే సంవత్సరములో సంహిత నంతటినీ నేర్చినాడు .
ప్రతిదినమూ ఆచార్యునికి , ఈ సంహితలో అక్కడక్కడా చేరిపోయి ఉన్న యజ్ఞ మంత్రముల నన్నిటినీ వేరు వేరుగా తీసి ఇచ్చిన , విద్యార్థులకెంత ఉపయోగపడును అనిపించెడిది . ఒక దినము , అధ్యయనము ముగిసినపుడు , తండ్రి , కొడుకుతో , " ఏమిటోనయ్యా , ఈ సంహిత అంతా ఒక కలగూరగంప. యజ్ఞభాగము , బ్రాహ్మణ భాగము , రహస్య భాగము అన్నీ కలసిపోయినాయి . ఎవరైనా ఒక పుణ్యాత్ముడు పుట్టి వీటన్నిటినీ వేరు వేరుగా విభజించి ఉంచితే ఎంతో ప్రయోజనము అయ్యెడిది " అన్నాడు. వెంటనే యాజ్ఞవల్క్యుడు లేచి , గురువైన తండ్రికి నమస్కరించి , " నేను పుట్టినది దానికోసమే . నా ఉద్దేశము సఫలమగునట్లు అనుగ్రహించండి " అన్నాడు .
అదివిని ఆచార్యుడు అవాక్కైనాడు . " కుమారుడు ఇతరులకన్నా తేజస్వి అనునది నిజము , కానీ , తరతరాలుగా వస్తున్న సంహితను సమంజసముగా వర్గీకరణ చేయగలడా ? ఇదేమైనా సామాన్యమైన కార్యమా ? సుమారు ఇరవై ఐదు సంవత్సరాలనుండీ అవ్యాహతముగా , సతతమూ ప్రయత్నము చేయుచున్ననూ నా వంటి వాడికి సాధ్యము కాని కార్యము వీనివలన సాధింపబడునా ? ఈ కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదమగునా ? " అని సందేహములు అలలవలె ఎగయుచున్నవి . అయినా , ’ ఎవరికి తెలుసు ? వీడు అతి పితుడు , అతి పితామహుడు. మా తండ్రిగారికి కూడా ఈ ఆశ ఉండినది , నాకూ ఉంది . మాఇద్దరి ఆశలూ వీని వలన సఫలమగునేమో ? నేనెందుకు అడ్డు కావలెను ? ’ అనుకొంటూ సగము జ్ఞానము , సగము అజ్ఞానపు అవస్థలో , తెలిసీ తెలియకుండా ’ తథాస్తు ’ అన్నాడు . ఎదురుగా చేతులు జోడించి వినయ నమ్రుడైననూ , మహా విద్వాంసుడి తేజస్సుతో వెలుగుచున కుమారుని చూచి , మరలా స్పృహలోకి వచ్చి , ’ కావలసిన కార్యము , అదికూడ మా ఇంట్లో నా కొడుకు వలన అయితే మా వంశపు భాగ్యము ’ అనిపించి ఇంకొకసారి మనఃపూర్వకముగా , ఈ కార్యము జరగవలెను అన్న సదిఛ్చ మనసంతా నిండి పోగా ’ తథాస్తు ’ అన్నాడు .
అయితే , విఘ్నములన్నీ సత్కార్యములకే కదా ! అనిపించి , మరలా ఆ విఘ్నములన్నీ నివారణయై ఇష్టార్థము చేతికిరానీ యని మూడవ సారి ’ తథాస్తు ’ అన్నాడు . కుమారుడు మరలా నమస్కారము చేసి లేచినాడు . ఆచార్యునికి , వెనుకటి అభ్యాస కాలములో ’ సరస్వతీ గణపతుల వ్యూహములు నిరంతరముగా శరీరములో ఆడుచుండవలెను ’ అన్న ఆ మాట గుర్తుకొచ్చి , ఆ కార్యము అయినచో వీని వలననే కావలెను అనిపించెను .
అప్పటి నుండీ అధ్యయనమును ఇంకొక విధముగా చేయించినాడు . సంహిత వల్లెవేయుట ఉండనే ఉంది , అయితే , ముందు ముందు వర్గీకరణము నకు అనుకూలము కావలెనను ఉద్దేశముతో , క్రమాధ్యయనము అయిన తరువాత , ఈ కాండపు , ఈ ప్రపాఠకపు , ఈ అనువాకము చెప్పు అని అడిగేవాడు . మొదట్లో అది కుమారునికి కష్టమైననూ రానురానూ అదే అలవాటై , పాఠము నడచినది .
అయితే ఆచార్యుడు ఒకటి ఆలోచించలేదు . పావురమును ఎగురవేయువారు , అది పైకి పోనీ యని పట్టి ఎగరేస్తారు . కానీ అది మేఘములవరకే ఎగురగల పక్షి . దానికి , వీరి ఎగురవేత వలన ప్రయోజనమేమి ? అదే విధముగా , మనిషి మేధలో వేదము , కావలసిన ఎత్తుకు చేరవలెనంటే దానికి దైవానుగ్రహము కావలెను . అంతేకానీ కేవలము మానవ ప్రయత్నము తో అది సాధ్యము కాదు అనునది అతడి మనసుకు తోచలేదు . మనిషి , పొలమునకు నీరు పెట్టవలెనన్న , కొంత విస్తీర్ణమునకే పెట్టగలడు . ప్రవహింప జేయవలెనంటే , ఇంకొంత ఎక్కువ విస్తీర్ణము నకు పంపించగలడు . అయితే మానవ ప్రయత్నము వాన లాగా నేలను తడపగలదా ?
ఇలాగే సుమారు రెండు వర్షములు గడచినవి. ప్రథమోపాకర్మ జరిగి , ఇంకొక ఉపాకర్మ కూడా నడచినది . ఉపనయనమైన రెండు వర్షముల తరువాత కొడుకును గురుకులమునకు పంపించు ఆలోచన వచ్చినది . తనకు కావలసిన వారందరితో ఆలోచన చేసి కొడుకును వైశంపాయనుని గురుకులమునకు పంపవలెను అన్న సిద్ధాంతమునకు ఆచార్యుడు వచ్చినాడు . తత్ప్రకారముగానే , కులపతుల అనుమతి పొంది , ఒక శుభ దినమును చూచి , ఆచార్యుడు పత్నీ సమేతుడై కుమారుని తీసుకువచ్చి కులపతులకు అప్పజెప్పినాడు .
ఆచార్యుడు కులపతులకు విన్నవించుకున్నాడు , " కులపతులు ఒక దానిని కరుణించవలెను . కుమారుడు ఇంకే విషయములోనూ అవిధేయుడు కాలేదు , అయితే సంగీతము పైన వాడికి వ్యామోహము పెరుగుతున్నది . అదొకటీ తమరు మన్నించవలెను "
కులపతులు నవ్వి అన్నారు , " అదేమీ పెద్ద విషయము కాదు . మేము సంగీతమును వద్దనుటకు కారణము అది అతి త్వరగా కామ ప్రచోదనము చేయును అని . ఎవరెన్ని చెప్పినా , గంధర్వ శాస్త్రమును చూడండి , గంధర్వులకు కామము హెచ్చు . కానివ్వండి , దానిని నాదయోగముగా సరిదిద్దితే సరిపోవును . అప్పుడు బహిర్ముఖ కామనలు తప్పి , కామనలు అంతర్ముఖములగును . అప్పుడు ప్రణవము లక్ష్యమగును . దానివలన కూడా ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమగును . అటులనే చేయుదము . "
" సరే "
ఆలంబిని నమస్కారము చేసి , " నేను చెప్పవలసినది కూడా కొంత ఉన్నది " అన్నది . కులపతులు ఆమె ఏమి చెప్పునన్నదానిని ఊహించుకొని ముసి ముసిగా నవ్వుతూ , " చెప్పండి " అన్నారు . ఆలంబిని , " ఇంతవరకూ కుమారుడు ఇల్లు వదలి బయట ఎక్కడా ఉండి ఉండలేదు . కాబట్టి వాడికి కష్టము కాకుండా కాపాడు భారము తమది . " అన్నది .
వైశంపాయనులు ఉత్తరమును చెప్పుటకు ఉద్యుక్తులై , అలాగే ఆగిపోయి , " యాజ్ఞవల్క్యా , మీ తల్లి చెప్పినది విన్నావా ? ఏమంటావు ? " అన్నారు .
యాజ్ఞవల్క్యుడు , " నది ముందు ముందుకు ప్రవహించియే తీరవలెను . ఇంతవరకూ తల్లిదండ్రుల రక్షణలో , శిక్షణలో ఉండి విద్య నేర్చితిని . ఇప్పుడు తమరి సన్నిధానములో శిక్షణ పొందవలెను అని వచ్చినవాడను . తాను విశాలమూ , లోతూ కావలెనన్న , నది ముందు ముందుకు ప్రవహించవలెను , కదా ? " అన్నాడు .
వైశంపాయనులు ఆ ఉత్తరమును విని ఆమోదిస్తూ తల ఊపి అన్నారు , " ఈ ఉత్తరము చాలు . అయినా మీతృప్తి కోసము చెపుతాను . మా గురుకులములో ఉన్న వారి నందరినీ మా సొంత పిల్లలవలె , వారు మరలా తమ సొంత ఇళ్ళను గుర్తు చేసుకొని వ్యథ పడకుండా చూచుకొనుట మా కర్తవ్యము . మా ఆశ్రమములో నున్నవారు గంగానదికి నేరుగా వెళ్ళిన , అక్కడ పెద్ద చేపలు , మొసళ్ళనూ చూచి భీతి చెందెదరని , గంగా నదీ పైభాగము నుండీ ఒక కాలువను ఇక్కడికి తవ్వించినాము . దానిలో నడుము లోతు కన్నా ఎక్కువ నీరు ఎప్పుడూ ఉండదు . అయితే , ఒక మాట , మీ కుమారుడు చన్నీటి స్నానము చేయవలెను . తన వస్త్రములు తాను ఉతుకుకొనవలెను . ఏమయ్యా యాజ్ఞవల్క్యా ! ఈ కష్టమును సహించగలవా ? "
యాజ్ఞవల్క్యుడు పెద్దవానివలె మాట్లాడుతూ అన్నాడు , " అదేమీ కష్టము కాదు . మా ఇంటి వెనుక తటాకములో దినమూ స్నానము చేయుట నాకు అలవాటు . ఇంతవరకూ అక్కడ స్నానము చేయుచుంటిని , ఇప్పుడు ఈ కాలువలో స్నానము చేసెదను . బట్టలు ఉతుకుటకునూ కష్టము లేదు , అలవాటైనది . "
వైశంపాయనులు ఒప్పుకుంటూ అన్నారు , " ఆచార్యా , తమరి అనుమతి అయితే వీడిని రెండు ప్రశ్నలు అడిగెదను " . ఆచార్యుడు సరేనన్నాడు . కులపతులు అడిగినారు , " ఏమయ్యా , నీకు వేదాంగములలో దేనిపైన ఎక్కువ అభిమానము ? "
యాజ్ఞవల్క్యుడు ఆ ప్రశ్నకు ఏ వికారమూ లేకయే అన్నాడు , " కల్ప జ్యోతిష్యములు నేరుగా యజ్ఞమునకు సంబంధించినవి . నిరుక్తము వేదార్థమును వివరించునది . ఛందస్సు , మంత్రములలోని అక్షరములు సరిగా ఉన్నవో లేవో తెలుసుకొనుటకు సాధనము . శిక్ష , అక్షరోచ్చారణ యొక్క సాధుత్వ , అసాధుత్వములను చెప్పును . వీటన్నిటికన్నా నాకు వ్యాకరణము పైన అభిమానము ఎక్కువ. "
" అదెందుకయ్యా ? "
" చూడండి , దానిలో ప్రకృతి , ప్రత్యయములు , పదములు అని విభాగములున్నవి . ప్రకృతి అనేది శబ్ద ఖండము . దానికి ప్రత్యయము చేరి , కృదంతమో , సదంతమో అయిన పదమును చేయును . ప్రత్యయమును తీసివేస్తే , పదము మరలా ప్రకృతి యగును . అటులనే , పూర్ణమైన ఈ జగత్తు పదము వంటిది . దానిలోనున్న ప్రత్యయమును తీసివేస్తే అది ప్రకృతి యై , ముందువలె పూర్ణమే అగును . ఇలాగు చూపించును యని ’ పూర్ణమదః ...’ మంత్రపు వ్యాఖ్యానము . అందుకే నాకు వ్యాకరణమనిన అభిమానమెక్కువ. "
" ఒకే శబ్దము , పరా -పశ్యంతి - మధ్యమా - వైఖరీ -రూపములలో ప్రకటమగును యని శిక్ష అంటుంది కదా ! దానికి కూడా ఇలాగే వ్యాఖ్యానమెందుకు చేయరాదు ? "
" పరా స్థానము గోచరము కాదు అనునది ఆ శాస్త్రపు సాంప్రదాయము . అయితే ప్రకృతి గోచర మగునట్టిది . దీనిని ప్రయోగ పూర్వకముగా తెలుసుకొన వచ్చును . అందుకే వ్యాకరణమును చూస్తే నాకు అభిమానము . "
వైశంపాయనులు , కుమారుని బుద్ధి వైఖరులను చూచి సంతోషపడి , అభిమానము చూపకుండా జాగ్రత్త పడినారు . వారికి వెనుకటి దంతా గుర్తుకు వచ్చి , ’ ఔను , వీడి వలన లోకోద్ధారమగుటలో అతిశయమేమీ లేదు . వీడు మా శిష్య వర్గమును చేరినది మా అదృష్టము ! " అని సంతోషించి , తమ సంతోషమును ఆచార్య దంపతులకు మరీ దీర్ఘముగానూ , మరీ హ్రస్వముగా కాక ప్రకటించినారు . మరలా కుమారుని పిలచి , " అయ్యా , నీకు సంహితాధ్యయనమైనది . మీ తండ్రి గారి వెంట వెళ్ళి అక్కడక్కడా ప్రయోగమును చూచి తంత్రమును కూడా ఎంతో కొంత సాధించినావు . ఇలాంటపుడు , నీకు ఈ గురుకులము నుండీ కావలసిన ప్రయోజనమేమిటి ? " అని అడిగినారు .
కుమారుడు తల్లిదండ్రుల అనుమతి పొంది , చేతులు జోడించి అన్నాడు , " మాతా పితరుల దయ వలన కంకులనుండీ వడ్లు వచ్చి , ఎండి , బియ్యముగా మారు భాగ్యము కలిగినది. బియ్యము అన్నము కావలెనని తమరి దగ్గరకు వచ్చినాను . అన్నమైన తర్వాత , దానిని ఎలాగు వినియోగ పరచెదరో దానికేమి తెలుసు ? తమరు ఆ అన్నమును సద్వినియోగము చేసెదరనే నమ్మకముతో , తమ పాదమూలమును చేరి కృతార్థుడనగుటకు వచ్చినాను . అలాగు నన్ను కృతార్థుడిని చేయుట అన్నది మీకు చెందిన విషయము . "
వైశంపాయనులు ఆ సమాధానము విని బహు సంతోషపడి వాడిని పిలచి దగ్గర కూర్చోబెట్టుకొని వీపు నిమురుతూ తమ సంతోషమును వ్యక్త పరచినారు , " అలాగే కానీవయ్యా , మన ఇద్దరినీ గురు శిష్యులుగా చేర్చిన దైవము ,నిన్ను కృతార్థుడను చేయనీ . నువ్వు మాత్రా శిష్టుడు , పితా శిష్టుడూ అయిన యోగ్యుని వలె మాట్లాడుచున్నావు . నీకు గుర్వాశిష్టుడు కూడా అగు భాగ్యము రానీ . ఇహములో అనన్య లభ్యమగు కీర్తీ , పరములో ఉత్తమోత్తమమైన సద్గతీ లభించనీ . " అని మనఃపూర్వకముగా ఆశీర్వాదము చేసినారు . కుమారుడు ఆ ఆశీర్వాదము సత్యమవనీ అని ఇంకొకసారి నమస్కరించినాడు .
Janardhana Sharma
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి