10-42-గీతా మకరందము
విభూతియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అథవా బహునైతేన
కిం జ్ఞాతేన* తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నం
ఏకాంశేన స్థితో జగత్ ||
తా:- అర్జునా! లేక, విస్తారమైన ఈ (విభూతి) జ్ఞానముచే నీ కేమి ప్రయోజనము?! నేనీ జగత్తునంతను ఒక్క అంశముచేత వ్యాపించియున్నాను(అని తెలిసికొనుము).
వ్యాఖ్య:- ఈ ప్రకారముగ భగవద్విభూతిని ఎంత తెలిసికొనినను, ఇంకను తెలిసికొనవలసినది మిగిలియేయుండును గావున, అంతములేని ఈ వర్ణనలవలన నీకేమి ప్రయోజనమని భగవాను డర్జునునకు హితబోధచేయుచున్నారు. అవియన్నియు ఏ ఒక్కపరమాత్మ చైతన్యముచే వ్యాపింపబడియున్నవో, ధరింపబడియున్నవో ఆ ఒక్కదానిని తెలిసికొనినచాలునని వచించుటయగును. ఈ జగత్తంతయు పరమాత్మయొక్క ఒకానొక అంశముచేతనే వ్యాపింపబడియున్నదని చెప్పబడుటచే భగవానుని అనంతశక్తి, విశ్వవ్యాపకత్వము వెల్లడియగుచున్నది. ఈ అనంతకోటి బ్రహ్మాండములన్నియు ఎంతయో విశాలములయినవి. అయినను భగవానుని ఏ ఒక్క అంశముచేతనో అవియన్నియు వ్యాపింపబడియున్నవి. ఇంకను ఎన్ని అంశములో మిగిలియున్నవి.
‘పాదోఽస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి’ అను పురుషసూక్త వచన మీయర్థమునే ప్రస్ఫుటీకరించుచున్నది. దీనినిబట్టి భగవానునిముందు ఈ విశ్వమంతయు ఎంత అల్పమైనదో ద్యోతకమగుచున్నది. మఱియు ఏ మహనీయుని ఒకానొక అంశముచే ఈ జగత్తంతయు పరివ్యాప్తమైయున్నదో అట్టి పరమాత్మయొక్క అఖండ శక్తికి మనుజుడు జోహారులు అర్పింపవలసియున్నాడు. అట్టి సర్వేశ్వరుని వినమ్రచిత్తుడై అనన్యభక్తితో సేవించవలసియున్నాడు. వారి అనంత శక్తిని, విశ్వవ్యాపకత్వమును, విరాడ్రూపమును తలంచుకొని అల్పుడగు జీవుడు తన గర్వమును, అహంకారమును పారద్రోలవలెను. ఆతని ధనముగాని, అధికారముగాని, బలముగాని, శక్తిగాని సర్వేశ్వరుని అనంతతేజముయొద్ద ఏ పాటిది? ఇంతియేకాదు. ఇంకను పైకిపోయి విచారించినచో, ఈ దృశ్యజాతమంతయు మిథ్యయై, కల్పితమై యున్నట్లు తెలియగలదు. సత్యవస్తు వొక్క పరమాత్మయే అయియున్నాడు. అసత్యవస్తు వెంత పెద్దదైనను, గొప్పదైనను దానికి విలువ ఒకింతైననులేదు. స్వప్నప్రపంచ మెంత గొప్పదైనను జాగ్రతునిముందు తీసికట్టేకదా! కాబట్టి ఈ రహస్యములన్నిటిని తెలిసికొని జీవుడు తన అహంభావమును, దర్పమును పారవైచి పరమాత్మను శరణుబొంది కృతార్థుడు కావలెను. ఈ విభూతియోగమువలన నేర్చుకొనుపాఠ మిదియే.
ప్ర:- ఈ జగత్తంతయు దేనిచే వ్యాప్తమైయున్నది?
ఉ:- పరమాత్మ యొక్క ఒకానొక అంశముచే వ్యాప్తమైయున్నది. (భగవత్స్వరూపమునందు ఈ విశ్వమంతయు పరిగణింపబడజాలనంత అల్పమై యున్నదని భావము).
--------------------
*జ్ఞానేన --- పాఠాన్తరము
____
ఓమ్
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే విభూతియోగోనామ
దశమోఽధ్యాయః
ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,
శ్రీకృష్ణార్జున సంవాదమునగు
శ్రీభగవద్గీతలందు విభూతియోగమను
పదియవ అధ్యాయము
ఓమ్ తత్ సత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి