13, డిసెంబర్ 2024, శుక్రవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*224 వ రోజు*

*కర్ణుడు భీష్ముడు*

తరువాత కర్ణుడు లేచి " మిత్రమా! నాకు గురువుగారి శాపం కారణంగా అస్త్రశస్త్రాలు గుర్తుకు రావు అని లోకులు అంటారు. కాని ఆ మహానుభావుడు నాకు వాటి స్పురణ ప్రసాదించాడు. కావున నాకు అస్త్ర సంపద ఉన్నది నిశ్చయము. దేవతలకు కూడా నన్ను గెలవడం కష్టం అర్జునుడు ఎంత నేను పాండవులను గెలుచుట తధ్యం " అన్నాడు. భీష్ముడు లేచి " కర్ణా! యముని ప్రేరణతో మాట్లాడుతున్న నిన్ను వారించడం మా తరమా? పాండవులు యుద్ధంలో రాలి పోతారా? అనవసరంగా నోరు నొప్పి పుట్టేలా వాగకు. దేవేంద్రుడు ఇచ్చిన శక్తితో అర్జునుని చంపగలనని అనుకుంటున్నావు. శ్రీకృష్ణుని చేతిలో అది ముక్కలు కాక తప్పదు. అర్జునుని కొరకు నీ వద్ద ఉన్న సమస్త అస్త్రాలను శ్రీకృష్ణుడు నాశనం చేస్తాడు. ధృతరాష్టా! దాయాదులు కలిసి ఉంటే క్షేమంగా ఉంటారు లేకున్న సమస్తం కోల్పోతారు. కనుక సంధి చేసుకో " అన్నాడు. భీష్ముడు " సుయోధనా సంధి చేసుకుని ధర్మరాజుతో చేరు భీష్ముడు మన హితం కోరుతాడు. అతడి మాటను మన్నించు " అన్నాడు. సుయోధనుడు ఆ మాటలను లక్ష్యపెట్ట లేదు. ఆ మాటలకు కోపించి " సుయోధనా! మాట్లాడ వెందుకు అర్జునుడు గోగ్రహణంలో ఒకసారి ఒంటరిగానే విజృంభించి నపుడు నీ సైన్యం పారిపోలేదా? కర్ణుడు నీ చెంత ఉండి ఏమి చేసాడు. కాని ఇప్పుడు అలా కాదు. శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు విజృంభిస్తే ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. కర్ణా యుద్ధంలో మరణించి వీరుడవు అనిపించు కుంటావు. సుయోధనుని మరణానికి కారకుడవు అవుతావు " అన్నాడు. కర్ణుడు విరక్తిగా "సుయోధనా! భీష్ముని మాటలు నా మనసుని కలచి వేస్తున్నాయి. ఈ భీష్ముడు చచ్చే వరకు నేను యుద్ధభూమిలో అడుగు పెట్టను. ఆతరువాత నేను నా ప్రతాపం చూపిస్తాను" అని అస్త్ర సన్యాసం చేసిన కర్ణుడు ఇక అక్కడ ఉండలేక సభ వదిలి వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ " అయ్యో సుయోధనా! ఇంతటి మహా వీరుడు అలిగితే ఎలాగా! కుమారా నీవు ఈ కర్ణును అండ చూసుకుని యుద్ధానికి దిగుతావు. అప్పుడు మా ప్రతాపములో వ్యత్యాసం చూడు. సుయోధనా! నేను, బాహ్లికుడు, ద్రోణుడు కలసి శత్రు నాశనం చేస్తాము " అన్నాడు. సుయోధనుడు కర్ణుడు పోయాడన్న బాధ భరించ లేక " తెలిసో తెలియకో అందరూ పాండవులు గెలుస్తారని అంటున్నారు. మొదట నిన్ను, ద్రోణుని, బాహ్లికుని నమ్మాను. కాని ఇప్పుడు చెప్తున్నాను. కర్ణుడు, దుశ్శాసనుడు నా వెంట ఉంటే విజయం నాదే నాకు వేరొకరితో పనిలేదు " అన్నాడు. సుయోధనుని మాటలకు కలత చెందిన ధృతరాష్ట్రుడు " విదురా! నా కుమారుడు కర్ణునితో కలసి మృత్యుపాశంలో ఇరుక్కున్నాడు. ఈ సమయంలో ఏమి చేయాలి చెప్పు " అన్నాడు. విదురుడు " మహారాజా! మన వాళ్ళు దుర్బలులై ఒకరిలో ఒకరు కలహించుకోవడం మనకు మరింత ప్రతికూలం అర్జునునకు అనుకూలం. మాటలు కట్టిపెట్టి పాండవులను పిలిచి సంధి చేయించు " అన్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుని చూసి " సంజయా ! మరలి వచ్చు నపుడు అర్జునుడు నీతో ఏమన్నాడో చెప్పు " అని అడిగాడు. సంజయుడు " దేవా! అర్జునుడు నాతో " ధర్మరాజు న్యాయంగా మాకు రావలసిన రాజ్య భాగం అడుగుతున్నాడు. దర్పంతో ఇవ్వకుంటే మాచేత వారు యుద్ధభూమిలో చావక మానరు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: