*ఆపస్థంబుడు అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)*
యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడువంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే. *ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి* గురించి తెలుసుకుందాము.
ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలాసేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు.
కర్త, భోక్తగారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు. వచ్చిన మిగతా సాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు.
బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు. వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు.
కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్కచెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు.
అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు. తనని అలా "ఇంకా పెట్టు ఇంకా పెట్టు" అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయినా *ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే* కర్తకి కోపం వచ్చేసింది.
దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసాడు. "ఇంక తృప్తి అయిందా?" అని అన్నాడు. (*భోక్త భోజనం అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సంప్రదాయం కదా*) అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు
కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. 'ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు' అని కోపం తెచ్చుకున్నాడు.
కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్తగా వచ్చిన బ్రాహ్మణుడిని శపించడానికి చేతిలో జలం తీసుకొని అభిమంత్రించి బ్రాహ్మణుడి తలమీద చల్లాడు.
అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా *ఆగు* అని ఆపేసాడు.
కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని, "*పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు*" అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు - "*నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణులమీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు. నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో*" అన్నారు.
దానికి కర్త 'స్వామీ నా తప్పుని తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ పూర్తికాలేదే, దానికి ఏమి చేసేది? అని అడిగేడు.
*దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత పురుషసూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది* అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.
*జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది. శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది*
*ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు*🙏🏻🕉️👏🇮🇳👏🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి