13, డిసెంబర్ 2024, శుక్రవారం

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*ఫకీరు మాన్యానికి పయనం..నివాసం.*


*(ముప్పై ఏడవ రోజు)*


శ్రీస్వామివారు తనకు ఈశ్వరాజ్ఞ అందిందనీ..ఇక ఒక్కక్షణం కూడా శ్రీధరరావు గారింట్లో ఉండడం కుదరదనీ..ఆ తెల్లవారుఝామున తేల్చి చెప్పేసారు..ప్రభావతి గారు మనసు నొచ్చుకున్నా..శ్రీ స్వామివారు తాను ఇక జాగు చేయకుండా వెళ్లిపోవాలని నచ్చ చెప్పారు..


"అమ్మా!..నువ్వు బాధపడకు..నీకు బిడ్డ లాటి వాడిని..మీ దంపతులిద్దరూ ఎప్పుడైనా నా వద్దకు రావొచ్చు..తల్లివి నువ్వు..నిన్ను చూడాలనిపిస్తే..నేనూ వస్తాను..ఇప్పుడు మాత్రం వెళ్లి తీరాలి..తప్పదు.." అన్నారు దృఢ స్వరంతో..


శ్రీధరరావు గారు ప్రభావతి గారిని లోపలికి తీసుకెళ్లి.."ప్రభావతీ..ఆయన వెళ్లదలచారు..మనసులో ఏముందో మనకు తెలీదు..వారు కోరిన విధంగానే మనం కూడా సగౌరవంగా పంపుదాము.." అన్నారు..


"అదికాదండీ.. ఆయనేమన్నా చపలచిత్తులా ఏమిటి?..ఈ ఝాములో.."అన్న ప్రభావతి గారి మాట పూర్తికాకముందే..


"బాలోన్మత్తపిశాచ వేషాయ..అని చదువుకున్నాము కదా అవధూతల గురించి..ఇది ఏ దశ తాలూకు ప్రభావమో మనకు తెలీదు..నువ్వు ఆరాటపడి..కన్నీళ్లు పెట్టుకోకు..ఆయన గారు బాధపడతారు.." అన్నారు శ్రీధరరావు గారు..


ఇద్దరూ బైటకు వచ్చారు..శ్రీధరరావు గారు పనివాడిని నిద్రలేపి..గూడు బండి సిద్ధం చేయమన్నారు..పిలిస్తే పలికే మరో ఇద్దరిని కూడా పిలిపించి..బండి సిద్ధం చేయించారు..ఈలోపల ప్రభావతి గారు గబ గబా గేదె పాలు పితికి, కుంపట్లో వాటిని కాచి, స్వామివారికి తెచ్చి ఇచ్చారు..ఆసరికే శ్రీ స్వామివారు..తన సరంజామా (ధావళి, దండ కమండలాలు, జింకచర్మం వగైరాలు) అన్నీ సిద్ధం చేసుకొని వున్నారు..ప్రభావతి గారిచ్చిన పాలు త్రాగి.."నువ్వు ఖేద పడకమ్మా..అంతా శుభమే జరుగుతుంది!.." అన్నారు.."లేదు నాయనా!.." అన్నారు ప్రభావతి గారు..


ఈ తతంగమంతా చూస్తున్న సత్యనారాయణమ్మ గారు లేచి బండి దగ్గరకు వచ్చారు..ఆమెకు కూడా శ్రీ స్వామివారు వెళ్ళొస్తామని చెప్పి.."అమ్మా!..రామనామం మరువకుండా జపించు!.." అని చెప్పి బండి ఎక్కేశారు..బండి కదిలి ఆవరణ దాటే దాకా బరువెక్కిన హృదయాలతో ఆ ముగ్గురూ చూస్తూ ఉండిపోయారు..


ఏదో పెద్ద మేరు పర్వతం కదిలి వెళుతున్నట్లు..ఒక తేజోరూపం దూరంగా పోతున్నట్లు..తాముంటున్న ఇల్లు, తాము కూడా దూదిపింజల్లా తేలికై పోతున్నట్లు అనుభూతి లో మునిగిపోయారా దంపతులు..అప్పటికి సమయం తెల్లవారుఝామున నాలుగు..లోపలికి వెళ్లి పడుకున్నారే గానీ.."ఏమిటిది?..ఎందుకిలా జరిగిందో?.." అనే ఆలోచనే వారిని కలచి వేస్తోంది..


ఉదయం ఎనిమిది గంటలకల్లా మనుషులను పిలిపించి..కొంచెం లావుగా వుండే చిల్ల చెట్టు కొయ్యలు కొట్టించి..సజ్జ చొప్ప ను తెప్పించి.. తాటాకు కూడా తెప్పించి..ఇంకొక బండిలో సర్దించి..ఐదారుగురు మనుషులను ఆ బండి వెంట పంపుతూ..వీలైనంత త్వరగా ఫకీరు మాన్యం లో శ్రీ స్వామివారు కోరుకున్న చోట పాక వేసి, ఆయన్ను అందులో ఉంచే ఏర్పాటు చేయమని చెప్పారు శ్రీధరరావు గారు..సాయంత్రానికి వాళ్ళు పాక్షికంగానే పాక తయారయ్యింది..పనివాళ్ళు తిరిగివచ్చి..రేపటికి పూర్తిస్థాయిలో పాక సిద్ధం అవుతుందనీ..శ్రీ స్వామివారు కూడా ఆ గూడు బండిలో వుంటానన్నారని చెప్పారు..


శ్రీధరరావు దంపతులకు ఆ రాత్రి కూడా నిద్రబట్టలేదు..తెల్లవారి ఆరుగంటలకల్లా ఇద్దరూ నడచి ఫకీరు మాన్యం కు చేరుకున్నారు..అక్కడ..గూడు బండి కఱ్ఱల సహాయంతో నిలబెట్టి వున్నారు..అందులో ఉత్తరాభిముఖంగా (శ్రీ స్వామివారు తపస్సు చేసుకున్న మాలకొండ ఉత్తరం వైపు ఉంది) కూర్చుని ధ్యానముద్ర లో వున్నారు..దాదాపు అరగంట తరువాత ధ్యానం నుంచి లేచి, వీళ్లిదరినీ చూసి..ఆశ్చర్యపోతూ.."మీరెందుకొచ్చారు?.." అన్నారు..


"ఈ ఎముకలు కొరికే చలిలో..మీరెలా ఉన్నారో అని ఆందోళనతో వచ్చాము.." అన్నారు..


"శీతోష్ణ స్థితులను తట్టుకోవడమూ..ఇంద్రియనిగ్రహమూ యోగుల మొదటి సాధన!..ఈ చలి నన్నేమీ చేయదు..మీరు ఆందోళన చెందకండి.." అన్నారు శ్రీ స్వామివారు నవ్వుతూ..


"మధ్యాహ్నం నాటికి పూరిపాక తయారవుతుందనీ..మాలకొండ నుంచి శ్రీ చెక్కా కేశవులు గారిచ్చిన మంచం కూడా తెప్పిస్తామని"  చెప్పి, శ్రీధరరావు దంపతులు ఇంటికి వచ్చేసారు..


ఇంటికి రాగానే..మార్నేని లక్ష్మీ నరసింహం అనే అబ్బాయిని పిలచి..(ఈ లక్ష్మీ నరసింహం శ్రీధరరావు కుమారుల ఈడు వాడు..బాగా చనువు ఉన్న అబ్బాయి..) శ్రీ స్వామివారు తినే ఆహారం (పెసరపప్పు కలిపిన బియ్యం తో వండినది) ఇచ్చి పంపారు..శ్రీ స్వామివారు ఆ ఆహారం తీసుకొని..వీలైతే శ్రీధరరావు గారిని రేపు వచ్చి కలువమని చెప్పి పంపారు..


శ్రీ స్వామివారు యధావిధిగా తన ధ్యానం చేసుకుంటూ..ఆ గూడు బండి లోనే సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు..పాక వేస్తున్న పనివాళ్ళు సైతం విస్తుబోతున్నారు..


సాధకులు.. యోగులు.. అవధూతలు..వీళ్ల తపస్సుకు ప్రకృతి కూడా సహాయం చేస్తోందేమో..లేకుంటే దిగంబరంగా..ఒక నిర్జన ప్రదేశంలో..అత్యంత శీతాకాలంలో కూడా ఏమీ చలనం లేకుండా సమాధి స్థితి లోకి వెళ్లిపోవడం సామాన్యులకు సాధ్యమా..


దత్త పాదములు..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: