13, డిసెంబర్ 2024, శుక్రవారం

ముఖ్యమైన ద్వారం మనసు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *ఆలోచనాలోచనం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శరీరం ఇల్లనుకుంటే దానికి ముఖ్యమైన ద్వారం మనసు. దాని ద్వారానే తలపులు లోనికి ప్రవేశిస్తాయి.*


*లోచనం అంటే నేత్రం. ఆలోచన అనే కంటితో ఆ తలపులను జాగ్రత్తగా పరిశీలించాలి. అవగాహన లేని ఆలోచనలకు మనసు తలుపులు తెరవకూడదు.*


*మనిషి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ ఆలోచనలే మాటలుగా బహిర్గతమవుతాయి. మాటలు ఇతరులకు ప్రమాదమూ కలిగించవచ్చు. ప్రమోదమూ ఇవ్వవచ్చు. అవే ఆచరణగా, అలవాట్లుగా పరిణామం చెందుతాయి. మనిషి వ్యక్తిత్వానికి ఇవే గీటురాళ్లు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. దుర్మార్గపు ఆలోచనలు మనిషిని అధఃపాతాళానికి అణగతొక్కేస్తాయి. మనసులోకి తరచుగా అర్థంపర్థం లేని ఆలోచనలు ప్రవేశిస్తూంటాయి. ఓ గంట ఆలోచించాక- ఇలాంటి ఆలోచనలతో సమయాన్ని వృథా చేసుకున్నానేంటి? అని పశ్చాత్తాపపడతాడు.*


*అర్థహీనమైన ఆలోచనలతో మానసిక, శారీరక ఆరోగ్యాలు చెడిపోతాయి. సదవకాశాలు చేజారిపోతాయి.*


*మనసు చెప్పినట్లు మనం కాదు, మనం చెప్పినట్లు మనసు వినాలి- అంటాడు గౌతమ బుద్ధుడు.*


*మనసు, ఆలోచన రెండూ అన్యోన్య ఆశ్రితాలు. ఒకదానినొకటి పరీక్షించుకుంటాయి కూడా. గమ్యం చేరడానికి మార్గమేకాదు, మనసూ అవసరమే. ఎక్కడ సంకల్ప శుద్ధి ఉంటుందో, అక్కడ సత్ఫల సిద్ధి కూడా కచ్చితంగా ఉంటుంది.*


*ప్రపంచంలో కష్టమైనవి రెండు- ఒకటి మంచిపేరు తెచ్చుకోవడం, రెండు- ఆ పేరును నిలుపుకోవడం. ఈ రెండూ మన ఆలోచనల మీద, ఆలోచనలు పుట్టే మనసు మీద ఆధారపడ్డాయి. 'అంతరాయాలు సమాజం. అవి కలుగుతున్న కొద్దీ మనం సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ ముందుకెళ్లాలి' అంటారు మదర్ థెరిసా.*


*'మనసులోని ప్రతికూల ఆలోచనలే మన విజయాన్ని అడ్డుకుంటాయి' అన్న అబ్దుల్ కలాం మాటా అక్షరసత్యమే.*


*ఆరడుగుల మనిషి విలువ, గౌరవం నాలుగంగుళ నాలుక మీద ఆధారపడి ఉంటాయి. రావణుడు, దుర్యోధనుడు, దుర్వాసుడు, శిశుపాలుడు, హిరణ్యకశిపుడు, కీచకుడు తమ దురాలోచనలతో పలికిన పలుకులే వారికి ఘోరశాపాలయ్యాయి.*


*హనుమ, విభీషణుడు, ధర్మజుడు, ద్రౌపది, ప్రహ్లాదుడు మొదలైనవారి ఆలోచన, ఆచరణ యుగయుగాలకు ఆదర్శప్రాయం.*


*ఏకాగ్రత, సదాలోచన వల్లనే నైపుణ్యం, సాఫల్యం లభిస్తాయి. పదిసార్లు ఆలోచించి పలికే మాట మల్లెల మూటవుతుంది. తీపితేనెల ఊటవుతుంది.*


*ఇతరుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతలో సగమైనా మనల్ని మెరుగుపరిచే ఆలోచనలపై పెట్టి చూడాలి. 'యుద్ధంలో వెయ్యి మందిని సంహరించేవాడికన్నా, తన మనసును తాను జయించగలిగినవాడే నిజమైన వీరుడు' అంటాడు. అరిస్టాటిల్.*


*ఆలోచన అదుపులో ఉంటే అవనిని బృందావనిగా మార్చవచ్చు. ఆలోచన ధర్మబద్ధమైనదైతే అంతటా ఆనందనందనాలను సృష్టించవచ్చు. ఆలోచన ఆధ్యాత్మికలోచనమైతే అంతటా సుఖశాంతులను చూడవచ్చు.*


*శ్రీ గురుభ్యోనమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

కామెంట్‌లు లేవు: