🙏శాంతి మంత్రార్ధము 🙏
ఓం సహనావవతు
సహనౌభునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః
సాధారణంగా అన్ని భాషలలోనూ ఏక. వచనము బహువచనం మాత్రమే ఉంటాయి.
సంస్కృతంలో ఏక వచనము, ద్వివచనము, బహువచనం అని మూడు వచనములు ఉంటాయి.అదే సంస్కృత భాష ప్రత్యేకత.
ఏక ద్వి బహు
రామః రామౌ రామాః
ఒక రాముడు ఇద్దరు రాములు ఎక్కువ మంది రాములు ఈ "ఓం సహనావవతు" అనే మంత్రము ద్వివచనములో చెప్పబడింది. ద్వివచనము అంటే ఇద్దరికి సంబంధించినది. ఇక్కడ గురు శిష్యుల గురించి చెప్పబడింది.బోధకులు గురువు, గ్రహీత శిష్యుడు. ఇద్దరికి అభివృద్ధి కలుగజేయమని చేసే ప్రార్ధన ఈ మంత్రం. ఈ మంత్రంతోనే ప్రతిరోజు విద్యాభ్యాసము ప్రారంభం అవుతుంది. అంటే గురు శిష్యులు ఇరువురు పఠిస్తారు.. అంత గొప్ప మంత్రం ఇది. మంత్రము యొక్క అద్భుతమైన భావం గ్రహిద్దాము.
భావం ..
ఓం సహనావవతు
సహ + నౌ +అవతు
మన ఉభయులను (గురు శిష్యులను )పరమాత్మ రక్షించు గాక.
సహనౌభునక్తు
సహ +నౌ +భునక్తు
జ్ఞాన సమూపార్జన చేయుచున్న మనల నిద్ధరిని ఆ పరమాత్మ పోషించు గాక.
సహవీర్యం కరవావహై
సహ +వీర్యం + కరవావహై
జ్ఞాన సమూపార్జనమన విషయములో మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక.
తేజస్వి నావధీతమస్తు
తేజస్వి+ నౌ +అధీతం + అస్తు
మన అధ్యయనము తేజోవంతము అగు గాక.
మనచే అధ్యయనం చేయబడిన జ్ఞానము ప్రకాశవంతముగా నిలిచి ఉండాలి
మావిద్విషావహై
మా + విద్విషావహై
అవగాహన లేకపోవడం వల్ల కలిగేది ద్వేషం. అటువంటి ద్వేషరహితులమై మనము ఉందుము గాక.మన విద్య ఫలప్రదము అగు గాక.
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం శాంతి , శాంతి , శాంతి
ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక, శాంతులను మనము పొందుదుము గాక.
శాంతి సర్వత్ర ఉండుగాక. ఈ వైదిక ప్రార్థన ప్రేమ సౌభ్రాతృత్వము, పరస్పరావగాహన ,శాంతి సామరస్యము అను గొప్ప ఆశయములను ప్రకటించును
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి