29, డిసెంబర్ 2020, మంగళవారం

ఆచారాలను

 సనాతన ధర్మంలోని ఆచారాలను పాటించడం వల్ల లాభమేమిటి?

సనాతనధర్మశాస్త్రాలు మానవుని శ్రేయస్సుకై ప్రధానంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి. (1) జీవన విధానం; (2) జీవిత లక్ష్యం. ఇవి రెండూ అర్థం కాని వారి జన్మ వ్యర్థమే. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పురుషార్థాల ద్వారా పొంద వచ్చని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. 


పురుషార్థాలంటే ఏమిటి? 

ధర్మార్థ కామ మొక్షములే పురుషార్థములు. ఈ లోకంలో ప్రతి వ్యక్తీ సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. ఆ కోరికనే "కామః" అంటుంది శాస్త్రం. అట్టి సుఖాన్నిచ్చే పరికరములను పొందడానికి ధనం అవసరం. కనుక ధనాన్ని "అర్థః" అంటుంది. అయితే ఈ ధనాన్ని 'ధర్మ' మార్గంలో ఆర్జించి తద్వారా జీవితంలో సుఖాన్ని, హాయిని, తృప్తిని పొందే జీవన విధానాన్ని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. 


మనిషి జీవన విధానానికి ధర్మ, అర్థ, కామములు ప్రధానమైన అంశములైతే, మనిషి యొక్క జీవిత లక్ష్యానికి 'మోక్షమే' అత్యంత ప్రధానమైన అంశముగా శాస్త్రాలు పరిగణిస్తున్నాయి. అట్టి జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని పొందాలనుకునే వారికి ఆశ్రమ ధర్మాలను ప్రభోధిస్తున్నాయి. 


ఆశ్రమ ధర్మములంటే ఏమిటి?

ఆశ్రమ ధర్మములంటే జీవన విధానానికి, జీవిత లక్ష్యానికి శాస్త్రం సూచించిన నిర్దిష్టమైన పంథా అని అర్థం. జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తికి ముఖ్యంగా జీవన విధానం పట్ల అవగాహన అవసరం. జీవితాన్ని అర్థం చేసుకోలేనివాడు జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమే. అందుకే మన సనాతన ధర్మ శాస్త్రాలు మానవ జీవితాన్ని (1) బ్రహ్మచర్యాశ్రమం; (2) గృహస్థాశ్రమం; (3) వానప్రస్థాశ్రమం; (4) సన్న్యాసాశ్రమం గా పరిగణిస్తుంది. 


బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏమిటి?

ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి దశ. ఈ దశలోనే ప్రతి వ్యక్తీ తన జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. శిశువుకు మొట్టమొదటి గురువు తల్లి, తదుపరి గురువు తండ్రి. తరువాత 'ఆచార్యుడే గురువు'. అట్టి గురువు వద్ద నియమ నిబంధనలతో తన విద్యార్థి దశ ప్రారంభం అవుతుంది. ఈ దశనే బ్రహ్మచర్యాశ్రమం అంటారు. 


గృహస్థాశ్రమం అంటే ఏమిటి?

బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడాన్ని గృహస్థాశ్రమం అంటారు. ఈ గృహస్తు ఎంతసేపూ ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, సుఖాల వరకే పరిమితం కాకూడదు. మోక్షమనే చివరి పురుషార్థమైన జీవిత లక్ష్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. అర్థ, కామములను ధర్మబద్ధంగా నెరవేర్చుకునే వ్యక్తికి క్రమేపీ మోక్షరూపమైన పరమాత్మను పొందేందుకు అవకాశాన్ని కల్పించేదే గృహస్థాశ్రమం. 


ఈ దశలో స్త్రీ పురుషులు ఇరువురిని హిందూ ధర్మ శాస్త్రాలలో వివరించిన విధంగా పవిత్రమైన వైవాహిక వ్యవస్థతో కలుపుతారు. అనంతరం వారిరువురూ భార్య, భర్త అనే బాధ్యతాయుతమైన పాత్రలతో జీవితంలో ప్రధానమైన ఘట్టం లోకి అడుగిడుతారు. వారికి కేవలం విలాసము, సుఖ భోగాలే లక్ష్యం కాకూడదు. 


విలాసవంతమైన పాలరాతి మేడలలో కుటుంబ సభ్యులు నవగ్రహాల్లాగా తలొక దిక్కుకీ చూస్తూ ఎడమొహం, పెదమొహం తో జీవిస్తుంటే అది గృహస్థాశ్రమం అనబడదు. ఆకలిలేని వాడికి పంచభక్ష్య పరమాన్న భోజనం ఎంత నిరుపయోగమో మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత లోపించిన కుటుంబాలలో ఎన్ని మేడలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అంతే. కుటుంబం లోని వారు కలసి మెలసి అన్యోన్యతతో తమ ధర్మాలను, బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వర్తించే విధానాన్నే గృహస్థాశ్రమం అంటారు.


జై శ్రీమన్నారాయణ 🙏🏻

కామెంట్‌లు లేవు: