*_వాగ్భూషణం - అవి ఎన్ని రకాలు_*
*వాక్కు భగవంతుడు మానవునుకి ఇచ్చిన అద్భుతమైన వరం.*
*ఆ శక్తిని అంటే వాక్కును సద్వినియోగ పరచుకోవడం లేదా దుర్వినియోగ పరచుకోవడం అనేది మానవునిలోనే ఉంది...*
*మనిషి మాట్లాడే తీరును బట్టి అతని వ్యక్తిత్వం అవగతమవుతుంది, మాట్లాడే మాటను బట్టి అతని సంస్కారం అర్థమవుతుంది.*
*మాటల్లో ఎంత మహత్తు ఉందంటే మనిషి మాట్లాడే విధానం, పద్ధతి వలన, ఉపయోగించే పదాల వలన మిత్రులు ఏర్పడతారు.*
*బంధువర్గం ఏర్పడుతుంది, శత్రువులు కూడా మిత్రులవుతారు.*
*వైరివర్గం బంధుగణం అవుతుంది, అలాగే మిత్రులు శత్రువులవుతారు, బంధువులు విరోధులవుతారు.*
*అంచేత వాక్కు మనిషికి భూషణం కావాలంటే భాషణం లోనే ఉంది అంతా. అయితే ఈ భాషణం ఎలా ఉండాలీ అంటే మితం గానూ, ప్రియం గానూ, మృదువు గానూ, సత్యమైనది గానూ ఉండాలి.*
*మిత భాషణం...*
*మితంగా, అవసరమైనంత వరకే మాట్లాడడం, దీని వలన ఆత్మస్తుతికీ, పర నిందకూ అవకాశం ఉండదు. వాదోపవాదాలకూ, ఘర్షణలకూ తావుండదు. అనవసరమైన సంభాషణలు లేనప్పుడు కాలమూ వ్యర్థమవదు.*
*ప్రియ భాషణం...*
*ఎదుటి వారికి ప్రియం కలిగించేలా మాట్లాడడం, దీని వలన మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం, గౌరవం ఏర్పడతాయి.*
*మృదు భాషణం...*
*మృదువుగా మాట్లాడడం ఒక విధంగా కటువుగా మాట్లాడకపోవడం. కొంత మంది మాట్లాడితే వినాలనిపిస్తుంది.*
*ఇంకా మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. కొంత మంది మాట్లాడితే వినబుద్ధి వేయదు.*
*మాట్లాడడం ఆపేస్తే బాగుండును అనిపిస్తుంది, ఇంకా చెప్పాలంటే ఆపకపోతే తిట్టాలనో, కొట్టాలనో అనిపిస్తుంది. అదే కటు భాషణం.*
*సత్యభాషణం...*
*ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కాని ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది.*
*అందుకే "నిజం నిప్పు లాంటిది" అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు, అలాంటి సందర్భాలలో వారికది ప్రియభాషణం కాకపోవచ్చు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి