29, డిసెంబర్ 2020, మంగళవారం

...నేటి చిట్టికథ

 ✍️...నేటి చిట్టికథ




కథలీపురాన్ని సూరసేనుడు అనే రాజు  పాలిస్తుండేవాడు. తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటూ వారి మన్ననలు పొందాడు


. తన రాజ్యంలో కొందరు ఏపనీ చేయకుండా సోమరులుగా మారి వారి కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారని గూఢచారులతో తెలుసుకున్నాడు.


 ఎలాగైనా సరే వారికి గుణపాఠం చెప్పి సరైన మార్గంలో పెట్టాలనుకున్నాడు.


‘రాజ్యంలో ఏ పనీ చేయకుండా సోమరులుగా ఎవరైనా ఉంటే వారికి రాజుగారు మంచి బహుమతులు ఇస్తారహో..! అలాంటి వారు ఎవరైనా ఉంటే.. రానున్న పౌర్ణమి రోజు రాజుగారి ఆస్థానానికి రావాలహో’ అని చాటింపు వేయించాడు.


ఈ విషయం తెలిసి ప్రజలు.. ‘పనిచేయని వారికి బహుమతులేంటి?’ అని ఆశ్చర్యపోయారు.


 సోమరులు మాత్రం చాలా ఆనందించారు. పౌర్ణమి రాగానే రాజ్యంలో సోమరులందరూ కలిసి రాజుగారి ఆస్థానానికి బయలుదేరారు. 


మార్గం మధ్యలో రహదారిపై అనేక పెద్దపెద్ద రాళ్లు, దుంగలు అడ్డుగా పడి ఉన్నాయి. వారందరూ కలిసి వాటిని అతికష్టమ్మీద తొలగించి చివరికి రాజుగారి ఆస్థానానికి చేరుకున్నారు. 


బాగా పనిచేసి ఉండటం వల్ల దాహం వేయడంతో.. ‘మాకు దాహంగా ఉంది.. తాగేందుకు కొంచెం నీళ్లు ఇప్పించండి’ అంటూ అక్కడ ఉన్న భటుడిని అడిగారు. ఆ భటుడు.. ‘అదిగో అక్కడ ఉన్న బావిలోని నీటిని తోడి ఇక్కడ మొక్కలకు ఎవరైతే పోస్తారో వారికే తాగేందుకు మంచి నీరు.. ఇదే ఇక్కడి పద్ధతి’ అని చెప్పగానే అందరూ అక్కడికి వెళ్లి మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత తమ దాహాన్ని తీర్చుకున్నారు.


T.me/namonarayana


ఇంతలో రాజుగారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అందరూ అక్కడికి చేరుకున్నారు. ‘మహారాజా.. మనరాజ్యంలో అవకాశం ఉన్నా.. ఏ పనీ చేయకుండా సోమరులుగా తిరుగుతున్నవారు వీరు’ అని మంత్రి చెప్పారు


. ‘నేను రమ్మన్నది సోమరులను కదా! వీరిని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. కష్టపడి పనిచేసే వారిలా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏదో పనిచేసి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు’ అని రాజు అన్నాడు. 


వెంటనే సోమరులంతా కలిసి ముక్తకంఠంతో.. ‘మహారాజా! మేం సోమరులం. మాకు మీరు ఇస్తామన్న బహుమతి ఇప్పించండి’ అన్నారు. 


‘మీరు ఎలా సోమరులు అవుతారు? మార్గంమధ్యలో రహదారిపై పడిన బండరాళ్లు, వృక్షాలను తొలగించారు. నీళ్లు తాగడం కోసం మొక్కలకు నీళ్లు పోశారు. సోమరులు ఎవరూ అలా పనిచేయరు. అసలు నిజమైన సోమరి ఎవరు అంటే.. ఈ బహుమతి తీసుకోవడానికి కూడా రాకుండా బద్ధకించేవాడు. కాబట్టి మీరు ఏమాత్రం సోమరులు కాదు. మీరు మానసికంగా అలా భావించుకొని.. ఏ పనీ చేయకుండా మీ వారిని ఇబ్బంది పెడుతూ.. రాజ్యానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు’ అన్నాడు.


‘మహారాజా.. మమ్మల్ని మన్నించండి. మా తప్పేంటో తెలుసుకున్నాం. ఇకనుంచి మాకు చేతనైన ఏ పనైనా చేస్తాం. మమ్మల్ని క్షమించండి’ అని వేడుకున్నారు.


 ‘ఈ రోజు వీళ్లు చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం ఇచ్చి పంపించండి’ అని రాజు మంత్రిని ఆదేశించారు.


 మరుసటి రోజు నుంచి అందరూ తమ సోమరితనం విడిచిపెట్టి కష్టపడి పనిచేశారు.

🍁🍁🍁🍁


చదువు మట్టుపడును; సంస్కృతి చెడిపోవు

సంపదలు తొలంగు; సౌఖ్యముఢుగు;

గౌరవంబు వోవు; గావున సోమరి

తనము కన్న హీన గుణము గలదె?


సోమరితనము వల్ల చదువు అణగారిపోతుంది.సుఖం నశిస్తుంది. సంపదలు తొలగిపోతాయి.సంస్కారం చెడిపోతుంది.గౌరవం ఉండదు.అందుచేత సోమరితనం చాలా చెడ్డ అలవాటు....



🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: