రామాయణమ్... 103
..
అన్నను ఆవిధంగా చూస్తుంటే దుఃఖము తన్నుకుంటూ వస్తున్నది భరతునకు.కృష్ణాజినము,నారచీరలుధరించి,జటాధారియై ఉన్నరాముడి చుట్టూ గొప్పకాంతివలయం కనపడుతున్నది భరతునకు.
.
సింహము వంటి మూపురము,దీర్ఘమైన బాహువులు,పద్మములవంటి నేత్రములు కలిగి సముద్రపర్యంతమైన భూమికి అధిపతి అయిన రాముడు ధర్మము నాచరిస్తూ స్థిరుడైన బ్రహ్మదేవుడిలాగా వీరాసనం బంధించి దర్భలు పరచిన నేలపై కూర్చున్నాడు.
.
రత్నఖచితసింహాసనం మీద స్వర్ణకిరీటధారియై చుట్టూ మంత్రిసామంతపురోహితులు సేవిస్తుండగా వందిమాగధులు స్తోత్రపాఠాలు చదువుతుండగా సభాభవనమందు కొలువు తీరవలసిన చక్రవర్తి నేడిలా అరణ్యమృగములు చుట్టు కూర్చొని ఉండగా ఇక్కడ ఉన్నారు.అమూల్యమైన చందనచర్చలు చేయు శరీరము నేడిలా మురికిపట్టి ధూళిధూసరితమై ఉన్నదికదా!
.
ఆ స్థితిలో రాముని చూసి ,ఛీ ? నా మూలమున ఈయనకు ఇన్ని అగచాట్లు!.అని వేదనతో భరతుడు దీనుడై ముఖమంతా చెమటలు కారుతుండగా విలపిస్తూ, నోట మాట రాక "ఆర్యా" అని మాత్రమే పలికి మాటలు రాక గొంతుపూడుకొనిపోయి నిస్సహాయంగా దీనంగా రోదించసాగాడు. శత్రుఘ్నుడు కూడా దీనంగా విలపిస్తూ అన్నకాళ్ళపై పడినాడు.
.
రాముడు తమ్ములనిరువురనూ కౌగలించుకొన్నాడు ,లక్ష్మణుడు కూడా అన్నల బాహుబంధనంలో ఒదిగి పోయాడు.అన్నదమ్ములను అలా చూస్తున్న ఋషిగణము,పురజనులు దుఃఖమును ఆపుకోలేక కన్నీరు కార్చారు.
.
భరతా ! దశరధమహారాజు ఏరి? ఎక్కడికి వెళ్ళినారు ? నీవు అరణ్యమునకు ఎందుకు వచ్చినావు? దశరధమహారాజుకు క్షేమమే కదా! జీవించియే యున్నారుకదా ! ఆయన దుఃఖాక్రాంతుడై పరలోకమునకు వెళ్ళలేదు కదా!
.
నీవు నాన్నగారికి శుశ్రూష చేస్తున్నావు కదా!
.
వేదవేత్త ధర్మనిరతుడు అయిన వశిష్ఠులవారిని మునుపటి వలెనే పూజిస్తున్నావు కదా!
.
మాత కౌసల్య,మంచిసంతానముకల సుమిత్ర,పూజ్యురాలు రాణి అయిన కైకేయి సంతోషముగా ఉన్నారు కదా!
.
వినయసంపన్నుడు,అధికశాస్త్రజ్ఞానము కలవాడైన సుయజ్ఞుని సత్కరిస్తున్నావు కదా!
.
నీవు ఎప్పుడు ఏ హోమము చేయవలెనో ,ఏవి జరిగెనో అన్ని విషయాలు పురోహితుడు నీకు ఎరుకపరుస్తున్నాడు కదా!
.
నీవు దేవతలను,తల్లులను,తండ్రులను,గురువులను,
తండ్రితోసమానులైనబంధువులను ,వృద్ధులను,వైద్యులను,బ్రాహ్మణులను గౌరవిస్తున్నావు కదా!
.
నీతో సమానులు,శూరులు,విద్యావంతులు,జితేంద్రియులు,ఉత్తమవంశజులూ,మనస్సులో భావమెరిగి మసలుకో గలిగినవారినే మంత్రులుగా నియమించుకొన్నావుకదా!
.
NB
.
క్షేమసమాచారము లాగ రాముడు అడుగుతున్నవిషయాలు మనకు Administrative skills గురించి ఒక పెద్ద పాఠము.
.
(ఇంకా వుంది)
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి