🌹దేవీ కథలు -16
🕉️🕉️🕉️🕉️🕉️
💥గంగా , లక్ష్మీ , సరస్వతులు
☘☘☘☘☘☘☘☘☘
లక్ష్మీ దేవి , గంగాదేవి, సరస్వతీ దేవి అనే దేవతామూర్తులు ముగ్గురూ పూర్ణాంసతో మహావిష్ణువులో తాదత్మ్యం చెందారు. వారి కళలు మాత్రం భారతభూమిలో నదులుగా అవతరించాయి.
సరస్వతీ దేవి పూర్ణాంశగా కళారూపంలో అవతరించి 'భారతి' అనే పేరు పొందింది. వాక్కులకు అదిష్ఠాన దేవత కనుక అమెకు 'వాణి' అనే పేరు వచ్చింది. పాపాలను దహింపజేయగల పచ్చని కాంతితో అగ్నివలె ప్రకాశిస్తూ పవిత్రమైన నదీరూపాన్ని పొందినపుడు ఆమె 'సరస్వతి'. సరస్వతీ నది అంతర్వాహిని. అంటే పైకి కన్పించకుండా నీటి అడుగున గుప్తంగా దాగి ప్రవహించేది. ప్రయాగ క్షేత్రంలో గంగా యమునా సరస్వతీ నదులు కలుస్తాయి. అది త్రివేణీ సంగమం. త్రివేణి సముద్రంలో కలిసేచోటు కూడా అక్కడే ఉంది. అది త్రివేణీ సాగర సంగమ స్థానం కాని, ప్రయాగలో గంగా యమునా నదులు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఆ రెండిటి మద్య సూక్ష్మరూపిణిగా ఉన్న అంతర్వాహిని సరస్వతీ నది. గంగాజలం తెల్లని కాంతితో చల్లగా ఉంటుంది. యమున నీరు నల్లని కాంతితో గోరువెచ్చగా ఉంటుంది.
గంగానది విష్ణుపాదాల నుండు ఉద్భవించింది. భగీరథుని తపః ప్రభావం చేత భూలోకంలో ప్రవహించింది. సగర పుత్రుల ను ఉద్ధరించ డానికి, గంగను భూమికి రప్పించడానికి సూర్యవంశరాజులు ప్రయత్నించారు. సగర చక్రవర్తి కుమారులు అరవై వేల మంది కపిలమహర్షి శాపం వల్ల దగ్ధులు కాగా, వారిని ఉద్ధరించడానికి సూర్యవంశంలో పుట్టిన అసమంజుడు తీవ్రమైన తపస్సు చేశాడు. తపఃఫలం పొందక మునుపే అతని శరీరం రాలిపోయింది. అతని కుమారుడైన అంశుమంతుడు కూడా చిరకాలం ఘోరతపస్సుచేసి, ఫలం పొందకుండానే తనువును వదిలాడు. అంశుమంతుని కుమారుడైన భగీరథుని గుణవంతుడు, బుద్ధిమంతుడు, భగవద్భక్తుడు. కఠోర తపోదీక్షతో గంగను ప్రసన్నురాలిని చేసుకొన్నాడు. అతని కోరిక మేరకు గంగ భూలోకంలో ప్రవహించిది. గంగానదీ ప్రవాహం వల్ల సగరపుత్రులు సజీవులయ్యారు. ఆ ఆ ప్రదేశం సాగరమై పుణ్యస్థలమైంది.
లక్ష్మీ దేవి భారతీదేవి వాక్యానుసారం పద్మినిగా అవతరించి, నదీ రూపాన్ని దాల్చి , ధర్మధ్వజుని పుత్రికయై తులసీ వృక్షంగా రూపొంది. పాప పరిహారకమై నిలిచింది.
నదీ రూపాలను పొందిన గంగా లక్ష్మీ సరస్వతులు ముగ్గురూ భూలోకంలో ప్రవహిస్చూ , కలియుగంలో ఐదువేల సంవత్సరాల కాలం గతించే వరకు ఉండి, ఆ తరువాత వైకుంఠంలో మహావిష్ణువులో పూర్ణత్వం పొందుతారు. కాశీక్షేత్రం, బృందావన క్షేత్రం కలియుగాంతం వరకు పుణ్యస్థలాలుగా నిలిచి ఉంటాయి. జగన్నాథ క్షేత్రం , సాలగ్రామ శక్తి కలియుగంలో పదివేల సంవత్సరాల వరకు మహీమాన్వితమై నిలిచి ఉంటాయి.
కలిప్రభావం వల్ల లోకమంతా ఆధర్మ ప్రవర్తనతో నిండి సద్గుణాలు, పురాణాలు, వేదవిహిత కర్మలు, దేవతార్చనలు, భగవన్నామ సంకీర్తనలు, సత్య ధర్మాలు, వ్రతోపవాసాలు అన్నీ క్రమంగా భూలోకాన్ని విడిచిపోతాయి. అవన్నీ వైకుంఠం చేరుకుంటాయి. కలియుగాంతం నాటికి భూమిపై జనులు ఆచారహీనులై స్వైరవిహారాలకు పాల్పడతారు. ఎనిమిది సంవత్సరాల వయస్సునాటికే స్త్రీలు సంతానవతులు కావడం, 16|| సం వయస్సుతే వార్ధక్యం ప్రవేశించడం కలిలక్షణాలే.
శ్రీమహావిష్ణువు విష్ణుయశుడు అనే బ్రాహ్మణునకు కుమారుడై చేత ఖడ్గాన్ని ధరించి, అశ్వవాహనుడై 'కల్కి' అనే పేరుతో మూడు రాత్రులలో పాపాత్ములందరిని అంతం చేస్తాడు.ఆరురోజుల పాటు రాత్రింబవళ్లు ఏకథాటిగా కుంభవృష్టి కురిసి అంతా జలమయమైపోతుంది. ద్వాదశాదిత్యులు ఒకే సారిగా దర్శనమిస్తారు. వారితేజస్సు వల్ల భూమిపై అంతా ఎండిపోతుంది.
'కల్కి' ప్రభావంతో కలిపురుషుడు అంతరిస్తాడు. కృతయుగం ప్రారంభమవుతుంది. ధర్మదేవత నాలుగు పాదాలతో నిలబడుతుంది. భూలోకం అంతా ప్రకాశిస్తూంది. ఇలా యుగ పరివర్తనం జరిగే కాలం బ్రహ్మకు 108 సంవత్సరాలు . ఆ తరువాత బ్రహ్మ కూడా లయమైపోతాడు. దానికి 'ప్రాకృత ప్రళయము' అని పేరు. త్రిమూర్తులు, మహర్షులు , జ్ఞానులు, యోగులు చిద్రూపమై తేజస్సులో లయమై పోతారు. ప్రకృతి అంతా చిదగ్నిలో లీనమైపోతుంది. ఈకాలమంతా పరాశక్తికి ఒక్కనిమిషం . అంటే ఆమె కనురెప్పల కదలికలో ఈ సమస్త భువనాలూ పుట్టి నశిస్తూ ఉంటాయి. ఆమె ఒక్కసారి కన్నుతెరిస్తే సృష్టి .ఆమె కనురెప్పమూస్తే ప్రళయం. అందుకే ఆమె విరాడ్రూపాన్ని సందర్శించిన హయగ్రీవుడు 'లలితా సహస్ర నామావళి'గా ఆమె వైభవాన్ని గానం చేస్తూ "ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః" అని కీర్తించాడు.
ఈ విధంగా పరాశక్తి సంకల్ప ప్రభావం వల్ల .యుగాలు , ధర్మాలు, కాలచక్రం, నదులు, పర్వతాలు, బ్రహ్మ, విష్ణువు, రుద్రులు కూడా ప్రాకృతిక ప్రళయములో అంతమవుతూ ,మళ్ళీ కృతయుగారంభంలో ఆవర్భవిస్తూ వుంటారు. ఇదంతా పరాశక్తి లీలావిలాస ప్రభవమే.
🙏ఓం శ్రీ కనకదుర్గా యై నమః🙏
🔯🔯🔯🔯🔯
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి