25, అక్టోబర్ 2020, ఆదివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

పులిచర్మం..చెక్కపలక..


"శ్రీ స్వామివారు తపోసాధన చేసుకునే రోజుల్లో కొన్నాళ్ల పాటు పులిచర్మం మీద కూర్చుని ధ్యానం, సాధన చేశారట గదా?..ఆ పులిచర్మం తెప్పించటం కోసం మీ అమ్మగారు పడిన తాపత్రయం..మీ బంధువుల లో ఒకరి వద్ద నుంచి బలవంతంగా తీసుకొని రావడం..శ్రీ స్వామివారు దానిని సున్నితంగా తిరస్కరించడం..తిరిగి వెనక్కు పంపడం..ఆరోజే శ్రీ చక్కా కేశవులు గారు విజయవాడ నుంచి మరో పులిచర్మాన్ని పంపడం..ఈ విషయాలన్నీ మీరు ప్రచురించిన శ్రీ స్వామివారి చరిత్ర లో చదివానండీ..ఒక్కసారి ఆ పులిచర్మాన్ని మా కళ్ళతో చూడనిస్తారా?..దర్శనం చేసుకుంటాము..శ్రీ స్వామివారి పవిత్ర స్పర్శ తో పునీతం అయింది కదా?..అటువంటి దానిని చూసినా..ముట్టుకున్నా.. పుణ్యం వస్తుంది.." అంటూ గుంటూరు నుంచి వచ్చిన రాఘవరావు గారు అడిగారు..


ఇలా అడగడటం మాకు కొత్తగా అనిపించదు..శ్రీ స్వామివారి చరిత్ర చదివిన తరువాత మొగలిచెర్ల లో శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని మొదటిసారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారిలో కొంతమంది శ్రీ స్వామివారు వాడిన వస్తువులను కూడా చూడటానికి ఆసక్తి కనబరుస్తారు.. ఆ వస్తువులకు నమస్కారం చేసుకుంటారు..మేము కూడా అభ్యంతరం చెప్పము.. ఎంతో దూరం నుంచి వచ్చిన ఆ భక్తులకు ఆ వస్తువులను చూడగానే వారి కళ్ళల్లో కనబడే ఒక విధమైన ఆనందం ఎంతో విలువైనది..


రాఘవరావు గారికి పులిచర్మం భద్రపరచిన చెక్క పెట్టె వద్దకు తీసుకెళ్ళాను..మూడువైపులా చెక్కతో..పైభాగాన పారదర్శకంగా వుండే గాజు పలకతో తయారు చేసిన ఆ చెక్కా పెట్టె లోనే ఆ పులిచర్మాన్ని భద్రపరచాము..రాఘవరావు గారు సుమారు ఒక పది నిముషాలు అక్కడే నిలబడ్డారు..బాగా నిశితంగా చూసారు..ఆ చెక్కపెట్టె మీద తన చేతులు ఆనించి..కళ్లకద్దుకున్నారు..ఇవతలికి వచ్చేసారు..ఆయన ముఖంలో చాలా తృప్తి కనిపించింది.."ధన్యవాదములండీ.." అన్నారు..


"మీ లాగానే చాలా మంది పులిచర్మం చూడటానికి ఆసక్తి చూపిస్తారు కానీ..శ్రీ స్వామివారు తాను తపస్సు చేసుకోవడానికి నేలమాళిగ లోకి వెళ్ళినప్పుడు..ఆ నేలమాళిగను మూసివేసుకోవడానికి ఒక పలకను చెక్కతో తయారు చేయించుకున్నారు..ఆ చెక్కపలకను ఆయన ఎంతో జాగ్రత్తగా ఉంచుకునేవారు..ఆ పలకను కూడా మేము అతి భద్రంగా ఉంచాము..చాలామంది ఆ పలకను చూడటానికి ఆసక్తి చూపించరు.. కారణం తెలియదు..నిజానికి శ్రీ స్వామివారు ఈ మందిరం నిర్మించుకున్న నాటి నుండీ.. వారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందే రోజు వరకూ తన తపస్సును ఆ నేలమాళిగ లోనే కొనసాగించారు..అన్ని రోజులూ విధిగా ఈ పలకను మూతగా ఉపయోగించేవారు..ఇది కూడా శ్రీ స్వామివారి స్పర్శ తో పునీతం ఆయనదే!..ఇది కూడ పవిత్రమైనదే!.." అన్నాను..


"నిజమా?..నేను శ్రీ స్వామివారి చరిత్ర పూర్తిగా చదివాను కానీ..పులిచర్మం మీద కలిగిన ఆసక్తి..ఈ పలక మీద కలగలేదండీ..ఎక్కడ ఉంచారు?..చూపిస్తారా?.." అన్నారు రాఘవరావు గారు..పులిచర్మం ఉన్న చోటుకి కొద్దిగా ఇవతల వైపు మరో పెట్టెలో భద్రపరచిన ఆ చెక్కపలకను చూపించాము..భక్తిగా నమస్కారం చేసుకున్నారు..ఈసారి ఆయన కళ్ళల్లో మునుపటి కంటే ఎక్కువ ఆనందం కనిపించింది..ఉద్వేగం తట్టుకోలేక పోయారు..నీళ్లు నిండిన కళ్ళను తుడుచుకున్నారు..


"ఒక సందేహం ప్రసాద్ గారూ..మీరెందుకు ఏ వస్తువునూ ముట్టుకోవద్దని ఖచ్ఛితంగా చెపుతారు?..శ్రీ స్వామివారు వాడిన ఆ వస్తువులను ముట్టుకుంటే మాకు మరింత తృప్తిగా ఉంటుంది కదా?.." అని అడిగారు..


"ఆ వస్తువులన్నీ అత్యంత పవిత్రమైనవి గా భావిస్తాము..అందరూ మీలాగా శుచీ, శుభ్రత, సంస్కారం తో వుండరు..రాబోయే తరాల వాళ్ళు కూడా వీటిని చూసి, తరించాలని ఇలా భద్రపరచాము..అందరు భక్తులూ ఒకే విధంగా వుండరు..కొందరు ముట్టుకునే పేరుతో.. అత్యుత్సాహంతో ..ఆ వస్తువుల ఉనికికే ప్రమాదం కలిగిస్తారు..మేము నియంత్రించే లోపలే నష్టం జరిగిపోతుంది.. ముందు జాగ్రత్తగా..భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని..ఈ ఏర్పాటు చేసాము.." అని చెప్పాను..సాలోచనగా..అర్ధం అయిందన్నట్లు తలా ఊపారు..


శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడు..శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకొని వెనక్కు వెళ్లిపోయే కొంతమంది భక్తులను చూసిన తరువాత..ఇలా శ్రీ స్వామివారు వాడిన వస్తువులను కూడా చూసే అవకాశం మందిరం వద్ద ఉన్నది..అని తెలియచేయడానికే ఈరోజు ఇలా వ్రాయవలసి వచ్చింది..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: