25, అక్టోబర్ 2020, ఆదివారం

సామెత

 *🤠 నేటి సామెత 🌸*



*"పెద్దవాండ్ల కేమొ పదివేల వరహాలు, పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు" అనే ఈ సామెత ఎలా వచ్చింది? దీని అర్థమేంటి?*


‘ ఆమ్మో , పదివేల వరహాలే ? చాలా’!


అసలు పాట ఏమంటే, “ అయ్యవారికి చాలు అయిదు వరహాలు , పిల్లవాళ్ళకి చాలు పప్పుబెల్లాలు” అని దసరా పండుగ రోజుల్లో గ్రామాలలో ఉపాధ్యాయులు , తమ స్కూల్ పిల్లలతో గ్రామస్తుల ఇళ్లకు వెళ్లి పాడించే పాటలో ఒక భాగం.


ఆ ఉపాధ్యాయులకు ఆ రోజులలో వేతనాలు లేవు. ఆ ఊర్లలో పాఠశాలలు లేవు.పంతులు గారి ఇంటి అరుగుల మీదనే చదువులు. పిల్లల తల్లితండ్రులు ఏమయినా వాళ్ళ ఇళ్లల్లో పండిన కాయగూరలు లాంటివి ఇచ్చేవారేమో. దసరా పండుగ రోజుల్లో పంతుకు గారు తన పిల్లలను వెంటపెట్టుకుని ఆ ఊరిలోని మోతుబరుల ఇళ్లకు వెళ్లి చందాలు అడగడానికి వీలుగా కట్టుకున్న పాట ఇది. మన్మధుడి పుష్పబాణము లాంటి ‘బుక్కాలు’ పట్టుకుని పండుగ కొత్తబట్టలతో పిల్లలు ఉత్సాహంగా పాడుతూవెనకాల వస్తూ ఉంటే , మాస్టారి చేతుల్లో ఎంతోకొంత పెట్టేవారు ఆ గృహస్తులు. ‘ దసరాకి వస్తిమని విసవిసలు పడకు’ అని కూడా ఒక మందలింపు కూడా ఈ పాటలో వినిపిస్తుంది, ఇవ్వడం ఇష్టంలేనివారిని సున్నితంగా ఆక్షేపిస్తూ.పిల్లలందరికీ తినడానికి ఎదోఒకటి చేతిలో పెట్టడం రివాజు. అవే పప్పుబెల్లాలు.


తరువాత రోజుల్లో, పాఠశాలలు, గవర్నమెంటు జీతాలు వచ్చిన కొంత కాలం వరకూ ఈ సంప్రదాయం నడిచినా, తరవాత రోజుల్లో దీని అవసరం క్షీణించి ఇది పాటలవరకు పరిమితమయ్యింది.


మా చిన్నప్పుడు మేము దసరారోజులలో దొరికే బుక్కాలతో ఆడుకున్న జ్ఞాపకాలు ఉన్నాయ్. ఇప్పడు అలా పిల్లలని తిప్పిన మాస్టర్లు ఎవ్వరూ ఉండిఉండకపోవచ్చు కానీ, ఆ మాస్టార్ల వెనుక బుక్కాలు పట్టుకుని తిరిగిన అబ్బాయిలూ, అమ్మాయిలూ ఇపుడు అరవైలు దాటిన వయసులో ఉండే ఉంటారు.

కామెంట్‌లు లేవు: