25, అక్టోబర్ 2020, ఆదివారం

16-21-గీతా మకరందము

 16-21-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - నరకబాధనుండి తప్పించుకొను ఉపాయమును భగవానుడు సెలవిచ్చుచున్నారు -


త్రివిధం నరక స్యేదం 

ద్వారం నాశనమాత్మనః | 

కామః క్రోధస్తథా లోభః

తస్మా దేతత్రయం త్యజేత్ || 


తాత్పర్యము :- కామము, క్రోధము, లోభము అను ఈమూడును మూడువిధములగు నరకద్వారములు. తనకు (జీవునకు) నాశము గలుగజేయును - కాబట్టి ఈమూడిటిని విడనాడవలెను. (లేక, కామము, క్రోధము, లోభము అను మూడువిధములగు ఈ అసురసంపద నరకమునకు ద్వారములు - అనియు చెప్పవచ్చును).


వ్యాఖ్య:- నరకప్రాప్తికి హేతుభూతమైన దుష్టత్రయము ఈశ్లోకమున తెలియజేయబడినది. ఆ మూడును (కామాదులు) నరకమునకు ద్వారములవంటివేయని చెప్పబడినది. అనగా అవి కలవారికి నరకద్వారము తెఱవబడినట్లేయని అర్థము. ఆ మూడు దుర్గుణములు లేనివారికి ఆ ద్వారములు మూయబడియుండుట వలన, ఇక వారికి నరక ప్రవేశము లేనేలేదని యర్థము. ఇంతదనుక భగవానుడు అనేక అసుర గుణములు చెప్పుచువచ్చెను. అట్టి దుర్గుణములు కలవారు క్రింది క్రింది లోకములకు, నీచనీచజన్మలకు జనుచు నానాదుఃఖపరంపరలను అనుభవించుచుందురనియు తెలిపెను. అయితే ఇక వారిగతి అంతియేనా? వారుద్ధరింపబడుటకిక అవకాశములు లేవా? అని ప్రశ్నించిన, కలవని గీతాచార్యులు చెప్పుచున్నారు. అసురగుణములన్నిటిని మూడుగ విభజించవచ్చును. అవియే (1) కామము (2) క్రోధము (3) లోభము. కాబట్టి ఎవడీ మూడింటిని ప్రయత్నపూర్వకముగ త్యజించివేయునో అతడు నరకముయొక్క బెడదనుండి తప్పించుకొని ఊర్ధ్వగతిని బడయగలడు. ఈసత్యమింకను రాబోవు శ్లోకమున చక్కగ విశదీకరింపబడగలదు. కాబట్టి ఇక పాపాత్ములెవరును తమ యధఃపతనమునుగూర్చి దిగులుపడక, తామెచ్చోటనున్నారో అచటినుండియే భగవానుడు తెలిపిన ఈ కామక్రోధలోభ త్యాగరూపప్రయత్న మాచరించుచు నుండినచో అచిరకాలములోనే వారు నరకవిముక్తులై, దుఃఖవర్జితులై పరమ శ్రేయము నొందగలరు. కావున ప్రతివారును వారివారి హృదయములను చక్కగ పరిశోధించుకొని ఈ కామ, క్రోధ, లోభములను ముగ్గురుదొంగలను కనిపెట్టి వివేకాదుల సహాయమున వారిని దూరముగ తరుమగొట్టవలెను.

ఈశ్లోకమున “త్రివిధమ్" అను పదమును ‘నరకమ్' అనుదానికిగాక, "ఇదమ్” అను పదమునకు విశేషణముగ జెప్పి, (కామ, క్రోధ, లోభములను) మూడువిధములుగనున్న ఆసురీసంపద 'నరకద్వారము’ అనియు అర్థ ము చెప్పవచ్చును.


ప్రశ్న:- నరకమున కెన్ని ద్వారములు? అవియేవి?

ఉత్త6: - మూడు. అవి క్రమముగ (1) కామము (2) క్రోధము (3) లోభము అనునవి.

ప్రశ్న:- ఆ కామాదులవలన జీవునకు కలుగు హాని యేమి?

ఉత్తరము:- అవి యాతనిని నశింపజేయును. (ఆతని వినాశనమునకవి హేతువులైయున్నవి).

ప్రశ్న:- కాబట్టి శ్రేయము నభిలషించువాడేమి చేయవలెను?

ఉత్తరము:- ఆ మూడు దుర్గుణములను త్యజించివేయవలెను.

ప్రశ్న:- ఆసురీసంపదకు సంబంధించిన అనేక దుర్గుణములను భగవానుడు తెలిపెనుగదా! వానినన్నింటిని సంక్షేపించి మూడుగ జెప్పుము?

ఉత్తరము:- (1) కామము (2) క్రోధము (3) లోభము.

కామెంట్‌లు లేవు: