*జిజ్ఞాస*
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
జ్ఞానార్జనపై ఉత్సుకత, అభివృద్ధిపై ఆకాంక్ష, లక్ష్యసాధనపై ఆసక్తి మానవుడి మనోజ్ఞాన నేత్రాల వికాసానికి తోడ్పడి మహోన్నతునిగా నిలబెడుతుంది. వ్యక్తి వికాసానికి , సమాజ పురోగతికి దారులు పరిచే జ్ఞానవృక్షమైన జిజ్ఞాసయే జంతువులకూ మానవులకు తేడాను పెంచుతూ, శక్తిని ప్రదర్శించే కొద్దీ ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.
“శిశువు దశ నుండే కుతూహలాన్ని గుర్తించి ప్రోత్సహించే తీరు, అందించే మార్గదర్శకత్వం బాలల్ని ఉన్నతులుగా నిలబెడుతుందని, మేధోవికాసానికి తోడ్పడుతుందని” శాస్త్రాలు బోధించినట్టు ఎదిగి వెలుగులు పంచిన బాలలున్నారు. తల్లి గర్భంలోనే నారాయణ మంత్రాన్ని గ్రహించి విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, పద్మవ్యూహంపై ఆసక్తి పెంచుకుని వీరుడైన అభిమన్యుడు, గర్భంలో కనిపించిన దైవము లోకమంతా ఉన్నాడాయని పరీక్షించిన పరీక్షిత్తుల చరితల ద్వారా జిజ్ఞాస గొప్పతనాన్ని పురాణాలు వివరించాయి.
‘జిజ్ఞాస మొదలయితే జ్ఞానబీజం మొలకెత్తుతుందని, ఏకాగ్రత కుదిరితే మహావృక్షమౌతుందని” గ్రంథాలు చెప్పినట్టు విశ్వశ్రేయస్సు కాంక్షించిన మునులు, ఋషులు విజ్ఞానాన్ని జగమంతా విస్తరించిన సందర్భాలు పురాణాల్లో దర్శనమిస్తాయి. అగస్త్యుడు లోపాముద్రతో కలసి కైలాసంలో కుమారస్వామిని అభ్యర్ధించి కథలు, గాథలు , తీర్ధ దాన వ్రత మహాత్మ్యాలు తెలుసుకున్నాడని స్కాందపురాణం తెలుపగా, శౌనకాది మహర్షులు నైమిశారణ్యంలో సూతుణ్ణి ఆశ్రయించి విష్ణుకథలు, శివుడి చరిత్రలు, భస్మరుద్రాక్షతల మహిమలు, పురాణాలు, భాగవతం విని, లోకహితం కోరి అందించినట్టు దేవీ భాగవతం తెలిపింది.
“మేధావికుండాల్సిన లక్షణం జిజ్ఞాస, నూతన విషయాలపై ఆసక్తని” పెద్దలన్నట్టు క్రిస్టఫర్ కొలంబస్ కున్న సముద్రయాన ఆసక్తి అమెరికాను ప్రపంచానికి పరిచయం చేయగా, భారతదేశంలోని వ్యాపారాన్ని ఒడిసి పట్టాలన్న పోర్చుగీసుల ఆలోచన వాస్కోడిగామాచే భారతానికి సముద్రమార్గం ఆవిష్కరించింది.
“పక్షిలా ఎగరాలన్న రైటు సోదరుల ఆసక్తి విమాన యానాన్ని పరిచయం చేస్తూ దూరాన్ని దగ్గర చేయగా, గుటెన్ బర్గ్ ఆలోచనల ఫలితంగా చేతివ్రాత ఇబ్బందులు తీరి అచ్చుయంత్రాలపై అందంగా ముద్రించే సౌకర్యం చేరువైంది. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల ప్రయోగం ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి నిరోధించేలా దారులు పరచింది. వైద్య ఆరోగ్య శాస్త్ర పరిశోధనల ఫలితంగా నూతన ఔషధ సృష్టికి, మానవరోగ నిర్మూలనకు మార్గం సుగమమయింది.
“ నీటిమీద నూనెబొట్టు, సత్పాత్రునికి చేసిన దానం, జ్ఞాని చదివిన శాస్త్రం లోకమంతా విస్తరించినట్టుగా జిజ్ఞాసువు జ్ఞానాన్ని విస్తరించు కుంటాడని” చాణక్యనీతి తెలిపినట్టు జ్ఞానవృద్ధికై నిరంతరం శ్రమించినప్పుడే మానవ శ్రేయస్సును కాంక్షించే నూతన ఆవిష్కరణలు జరిగి స్థితిగతులు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక జిజ్ఞాస కూడా పెంచుకుని హృదయ సౌందర్యం మెరుగు పరచుకున్న నాడు జీవితం స్వర్గతుల్యం కాగలదు.
*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు క్రింది లింక్ ద్వారా చేరండి*
https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి