25, అక్టోబర్ 2020, ఆదివారం

అరణ్యపర్వము – 6

 అరణ్యపర్వము – 6

ఊర్వశి శాపం

అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో సూర్య చంద్రులు లేకనే స్వయంప్రకాశంతో వెలిగి పోతున్న అమరావతి నగరాన్ని చూసాడు అర్జునుడు. పురద్వారం వద్ద ఐరావతం అర్జునుడికి స్వాగతం చెప్పింది. అర్జునుడు దేవేంద్రునికి నమస్కరించాడు.

అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఊర్వశి అర్జునుడి ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమెకు నమస్కరించి ” అమ్మా! నా మీద పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా? ” అంటూ మాతృభావంతో ఊర్వశికి నమస్కరించాడు. ” అర్జునా ! నేను నీ పొందు కోసం వచ్చాను. ఇది దేవలోకం నేను దేవ వేశ్యని. మాకు వావివరసలు ఉండవు. నీకు నేను ఏవిధంగా తల్లిని అయ్యాను ” అన్నది. ” మా వంశకర్త పురూరవుని భార్యవు నీవు. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు కనుక నీవు నాకు మాతృ సమానురాలివి. స్వేచ్చా శృంగారం దోషం, పాపం ” అన్నాడు. ఊర్వశి కోపించి ” కోరి వచ్చిన నా కోరిక తీర్చనందుకు భూలోకంలో నపుంసకుడివై ఆడవాళ్ళ మధ్య సంచరించు ” అని శపించి వెళ్ళి పోయింది.

ఇది తెలిసిన ఇంద్రుడు అర్జునుడుతో ” అర్జునా! నీ వంటి ధైర్యవంతుని నేను ఇదివరకు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి. బాధపడకు ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. కాని అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉంవడచ్చు. నీ అజ్నాతవాసం ముగియగానే నీ శాపం తొలగి పోతుంది ” అని ఊరడించాడు. తరువాత అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో ఐదు సంవత్సరాలు గడిచాయి.

ఒకనాడు రోమశుడు అనే మహర్షి దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధ సింహాసానంపై కూర్చున్న అర్జునుని చూసి ” ఎవరీతుడు ? ” అని ఇంద్రుని అడిగాడు. దానికి దేవేంద్రుడు ” మహర్షీ ! ఇతడు పూర్వజన్మలో నరుడు అనే మహర్షి. ఇప్పుడు నా అంశతో కుంతీ గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనిని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడు. నేను కూడా ఇతనికి దివ్యాస్త్రాలెన్నో ఇచ్చాను. ఇతను నివాత కవచులను రాక్షసులను సంహరించగలడు. కాని తమరు భూలోకమునకు పోయి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధ్మరాజుకు చెప్పండి. ధర్మజుని తీర్ధయాత్రలు చేయమని నా తరఫున చెప్పండి. తీర్ధయాత్రల వలన అతడు పాప రహితుడు కాగలడు ” అని రోమశునితో చెప్పాడు.

భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించిన విషయం వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుని పిలిచి ” సంజయా! అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనాన్ని దహించాడు. నాలుగు దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలా? వారు ధర్మవర్తనులు వారిని విజయలక్ష్మి వరిస్తుంది ” అన్నాడు.

సంజయుడు ” సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు వగచి లాభం ఏమి? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. శ్రీకృష్ణుని అనేక మంది రాజులను వెంట పెట్టుకుని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకు పట్టాభి షేకం చేస్తానని అన్నాడట. మిగిలినవారు వారించి అర్జునినికి సారధ్యం వహించమని అన్నారట. శ్రీకృష్ణుని సాయంతో అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాక నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునిని దివ్యాస్త్రాలకు, భీముని గధాఘాతాలకు తట్టుకోగలరా? ” అన్నాడు సంజయుడు.

ధృతరాష్ట్రుడు ” నేనేం చేసేది సంజయా ! నేను ముసలి వాడిని. నాకొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మ, ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుని, శకుని మాటలు నచ్చుతాయి. నేనేంచేయుదును ” అని పరితపించాడు.

ధర్మరాజుకామ్యకవనంలో అర్జునిని కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు ” అన్నయ్యా! నువ్వే కదా అర్జునిని తపసుకు పంపింది. మన బతుకులన్నీ అర్జునిని మీద ఆధారపై ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునిని వెంటనే తీసుకు రమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము. రణరంగంలో నన్ను ,అర్జునిని ఎదిరించే వారు లేరు” అన్నాడు. అందుకు ధర్మరాజు ” భీమసేనా! ఆ విషయం నాకు తెలియును కాని యుద్ధానికి ఇది సమయం కాదు. పదమూడు సంవత్సరాల తరువాత నీవు, అర్జునుడు శత్రువులను జయించండి విజయులు కండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి నేను విరుద్ధంగా ప్రవర్తించను ” అన్నాడు ధర్మరాజు.

కామెంట్‌లు లేవు: