*22 - భజగోవిందం / మోహముద్గర*
💙💙💙💙💙💙💙💙💙💙💙💙
*భజగోవిందం శ్లోకం:-20*
*భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా|*
*సకృదపి యేన మురారి సమర్చాక్రియతే తస్యయమేన నచర్చాభజ ॥ 20.*
*ప్రతి॥* యేన = ఎవనిచేత; భగవద్గీతా = భగవద్గీత; కించిత్ = కొంచెమైనను; అధీతా = అధ్యయనము చేయబడినదో; గంగాజల లవ కణికా = గంగా జలములో లేశమాత్రము; పీతా = త్రాగబడినదో; సకృదపి = కొంచె మైనను; మురారి = ముర అనే రాక్షసునికి శత్రువయిన శ్రీకృష్ణుడు; సమర్చా = అర్పించబడినాడో; తస్య = అతడికి; యమేనా = యమునితో; చర్చ = వివాదము; న క్రియతే = ఉండదు.
*వివరణ:-*
ఎవరయితే భగవద్గీతను కొంచె మయినా మనసులో ఇముడ్చుకొ న్నారో, గంగా జలములో కొంచె మయినా సేవించి పవిత్రత నొందినారో; శ్రీకృష్ణుని కొంచెమే అయినా పూజ చేశారో వారికి యమునితో వివాదం వుండదు.
*వివరణ:-*
ఆధ్యాత్మిక వికాసానికి మూడు దివ్యమైన సాధనలు యిక్కడ సూచింప బడ్డాయి. 1) గీతాధ్యయనం. 2) గంగా స్నానము. 3) మురారి అర్చనం. భగవద్గీత ఉపనిషత్సారము. అందులోని పదునెనిమిది అధ్యాయాలు మనసు కెక్కించు కొంచే అది వివేకపూర్ణమైన క్రమ శిక్షణం అనవచ్చు. తద్వారా తెలుస్తుంది. ఈ జీవితంలోని సార మేమిటి, దాని రహస్యమేమిటి, జీవిత గమ్యస్థాన మేమిటి అని. ఆ గమ్యస్థానాన్ని చేరే ఉపాయ మేమిటి అని కూడ.
సురగంగ ఎక్కడో స్వర్గంలో ప్రవహిస్తూ వుంటూ వుండేది. మనిషి తెలివి తేటలకు అందనంత ఎత్తులో వుంటుంది.రాజు భగీరథుని అసంఖ్యాకమైన ప్రయ త్నాల ద్వారా ఆ యాకాశగంగ మనుష్యుని అనుభవానికి వీలుగా యిక్కడకు తేబడింది. శివుడొక్కడే ఆ గంగాదేవి వేగాన్ని భరించాడు. ఆయన ద్వారానే గంగ తిరిగి మనకి ప్రాప్తిస్తున్నది. గంగ జ్ఞానానికి ప్రతీక. దివంలో వున్న గంగ దివ్యజ్ఞానానికి గుర్తు. ఆ జ్ఞానాన్ని శివుడు ముందర ఆస్వాదించాడు; భగీరథుని ప్రార్థనమీద ఆ జ్ఞానం మనకు ప్రసాదించబడింది. ఇలా ఆ గంగ యొక్క అవతరణం అంచలలో జరిగింది. కాబట్టే ఈ భూమి పగలగొట్టుకొని గంగ వెళ్ళిపోవటమనేది జరుగలేదు.
ఆత్మని గురించిన జ్ఞానమనేది నిరంతరం ప్రవహించే గంగతో పోల్చారు. ఈ జ్ఞాన గంగ పరంపరాగతంగా వచ్చే మత గురువుల ద్వారా యిప్పటి కీ యింకా ప్రవహిస్తూ వుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన గంగలోని జలాన్ని ఆస్వాదించటం అంటే అర్థం అంతర్గత మైన జ్ఞానము యొక్క శాంతిని పూర్ణతను అనుభవించటమే.
ప్రస్తుతపు భారత పుత్రులు "గంగ" అనంగానే హిమాలయాల్లో పుట్టి పారుతున్న గంగా అనుకుంటారు. ఎందుకంటే ఆ గంగ కూడ పవిత్రమైనదని దాని భౌతిక జలాల్లో ప్రత్యేకమైన శక్తివున్నదనీ ఆచారము ననుసరించి, నమ్మిక ననుసరించి అనుకొనబడుతూ వుంది. గనుక వీరు సైన్సు చదివిన వారయితే అది వట్టి మూఢనమ్మక మంటారు. తిరిగి వాళ్ళ హృదయాంతరాలో మాత్రం పై చెప్పిన నమ్మికయితే వుండనే వుంటుంది.
కొందరు నది పవిత్రమైనది అనే వుద్దేశ్యాన్నే తెగడుతారు. నదికి పవిత్రతేమిటి? ఎంత హాస్యా స్పదం? సాంకేతిక జ్ఞానంలేక వీళ్ళెంత అడుగున వున్నారో చూడవచ్చు. జాతీయ జండా ఎందుకు పవిత్రమైంది? మూడు రంగుల గుడ్డ ముక్కలు బండి చక్రమేగదా అనవచ్చునా? దాని పవిత్రత మనమిచ్చే గౌరవములో - భావంలో వున్నది. అలాగే గంగామతల్లి పవిత్రమైంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానమునకయిన ప్రతీక కనుక, గురు పరంపరద్వారా ఆ జ్ఞానం నిరంతరం యిలా ప్రవహిస్తూనే వుంటుంది, కనుక.
సామాన్య మానవుడికి యీ హిమాలయ గంగ, దాని పూజ, దానికయి యాత్ర, మొదలయి నవన్నీ గొప్ప ఊరడింపులాంటివి. విచిత్రమైన కృతకృత్యము వంటిది. మనస్సు పవిత్రం చేసే యాత్రవంటిది. ఉన్నత విజ్ఞానాన్ని ఆరాధించే సాధన విషయంలో సాధకునకు విగ్రహం మీది ఆశకంటే విగ్రహానికి మౌళికమైన ఆశయం యేవిధంగా గొప్పదో అలాగే గంగ మనకు పవిత్రమైంది. అందుకనే లవలేశమైన గంగా జలమంటే అనంతమైన జ్ఞానంలో కొంచమైన జ్ఞానమని యర్థము. ఆ జ్ఞానం ద్వారా దివ్యజీవితాన్ని గడిపే మార్గం తెలుస్తూంది గదా! అదే ఉన్నతికి చేర్చుతుందని ఊహ.
గీతాధ్యయనం ధీ సంబంధమైన ఉత్తేజమిచ్చి జీవిత గమ్యాన్ని అధ్యయనం చేసే సాధకునికి జ్ఞాపకం చేస్తుంటే, గంగలోని కొద్ది బిందువుల నాచమించటం అనేది భక్తి మార్గ సాధకునికి దూరాన వున్న గమ్యాన్ని సంతోష పూర్ణంగా గోచరింపచేస్తుంది. అతడికి యింకరేవు దూరంగా లేదు. లైటు హవుసు యొక్క కాంతి పుంజం కనబడింది ఇంకా సముద్రాంతరం లోనే వున్నాడు గాక తుఫాను వాగులూ వంటి దుఃఖాలుంటాయి గాక అయినా అతడికి నమ్మకం చిక్కుతున్నది రేవు దూరంలేదని ఆ వైపు తను వెళ్ళవచ్చు అని..
ఒక ఓడ రేవునకు చేరటంతోనే, రేవునుంచి మరొక దోవచూపే పడవ ఆ ఓడ దగ్గరకు వెళ్ళి దోవ చూపుతూ రేవులోకి తీసికొని వస్తుంది. అలాగే ఈ భగవద్గీత చదవటంచేతగాని, గంగా జలం త్రాగటంచేతగాని పరమార్థము అనే ఓడ రేవు యొక్క ఆనవాలు కనబడినవాడు తనకోసం ఒకానొక పడవరేవునుంచి వచ్చే దాకా ఆగుతాడు. అలాగే ఆ పడవ ఎవరంటే గురువని చెప్పవచ్చు. గురువు నడిచిన దోవలోనేతనూ నడిచి పరమాం చేరుతాడు అందాకా లంగరు వేసి వుండటం అంటే ధ్యానంలో వుంటాడని అర్థం. ఆ తరువాత మురారిని అర్పిచుతాడంటే గురువుతో రేవు చేరుతాడని అర్థం.
"ముర" అనేది "క 'నకు సరియైనది. ఇది వున్నంతకాలం రేవు చేరట మనేది లేదు. దేహమే నేను అనే బుద్ధి కలిగిన వారు కాని "అహంకారమే’’ తాను అనుకొనే వాడుగాని ఆ రెంటినీ తుడిచి వేసేవరకూ సముద్రంలోనే వుండాలి. అయితే అహంకారం మరెలా పోయేదీ అంటే భగవత్రార్ధనవల్ల మాత్రమే. అహంకారాన్ని నాశనం చేయ గలిగిన "మురారి' ని భజించటం వల్లనే.
అహంకార సంబంధమైన పరిమితులను సమ్మెట కొట్టుట మెలాగంటే మనసు ను ఇతర విషయాలనుంచి నిగ్రహించి సత్యపదార్థము యొక్క జ్ఞాపక మున్నూ, “నేను” అనే వాన్ని స్వభావమున్నూ నిరంతరం మనసులో అనుసంధానం చేయాలి. అప్పుడు లోనున్న జీవానికి బయటనున్న ప్రాణానికి ఏమీ తేడా లేదని తెలుస్తుంది. నిజానికి భగవద్గీతలో చెప్పిన అత్యుత్తమమైన సందేశ ఫలితమిదే గదా!.'
గీతాధ్యయనం, గంగె-జలపానం, మురారి అర్చనం ఈ మూడు చేసిన సాధకు నకుమృత్యుభయం లేదు. మృత్యువు యితడిని ప్రశ్నించేదిలేదు. ఇతడున్నూ మృత్యు వును ప్రశ్నించాల్సిందేమీ వుండదు. అనగా మృత్యువు విషయం అంతా ఇతడికి తెలిసి పోయే వుంటుందని అర్థం. మృత్యువును హిందువులు యముడంటారు. “యమ’’ నియమమే,నియమం: యముడంటే నియంత అని అర్థం అతడు అలా నియమం తప్పక జీవాన్ని చంపి తీసుకపోతాడు. కనుకనే సృష్టి యిలా జరుగుతూ వుంది. సృష్టి అంటే ఒకానొక సత్యపదార్థ భాగాన్ని చంపి అంటే స్థితిని మార్చి మరొకటి చెయ్యడం అన్నమాట, ఇలా ఆలోచిస్తే సృష్టి అంటే అది నిరంతర నాశనం (మార్పు ద్వారా) అని అర్థం.
ఈ మార్పు అనేది మృత్యువు రాజ్యంలోనే కలుగుతోంది. దీనిని అధిష్ఠానం ద్వారా తెలిసి కొంటాము. అనగా-శరీరం మనసు బుద్ధి ద్వారా యోగమార్గాన యీ మూడింటిని దాటిన స్థితికి పోయినప్పుడు యీ మార్పు కనబడదు. మృత్యువు దాటిన వాడవుతాడు. యముడైన వచ్చి పృచ్చించని స్థితికి వెళ్ళుతాడు. సందేహం లేదు.
ఈ శ్లోకం శ్రీ ఆనందగిరి రచియించినట్లు ప్రసిద్ధము.
*సశేషం*
🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి