77. " మహాదర్శనము " --డెబ్భై యేడవ భాగము --దర్శనము
77 . డెబ్భై యేడవ భాగము-- దర్శనము
భగవతికి ఎదురు కొండపై గోవులు మేస్తున్నది చూచుటకే ఒక సంతోషము. వర్ణ వర్ణముల పశువులు పచ్చటి అడవిలో పచ్చటి చెట్ల మధ్య తిరుగుతున్నది చూస్తే ఆమెకు కలుగు సంతోషము ఇంతింత అని చెప్పుటకు సాధ్యము కాదు. ఆ సంతోషమును ఇంకొకరితో పంచుకోవలెను. అదే మనుష్య స్వభావము. తీపి చేసిన దినము ఒకడే భోజనము చేయకూడదు అన్నారు పెద్దలు. ఒక్కరే రమించుటెలా ? అన్నది శాస్త్రము. శాస్త్రపు మాట , పెద్దల మాట అటుంచితే , స్వభావము అడిగినదానిని లేదనుట ఉందా ? అయితే ఒక విశేషము. సుఖ దుఃఖములు రెండింటినీ పంచుకుంటే , సుఖము రెట్టింపు అవుతుంది, దుఃఖము సగమవుతుంది. బహుశః వాటికి కూడా గుణాకార , భాగహారములు వస్తాయేమో ? ఒకటి గుణాకారమవుతుంది. ఇంకొకటి భాగహారమవుతుంది. దానివలననే నేమో మనుష్యుడు సంఘజీవి ?
భగవతి ఒకదినము తమ సంతోషము పట్టలేక వెళ్ళి మైత్రేయిని పిలుచుకు వచ్చింది. ఆమె అంతవరకూ పశువులను ఆ విధముగా చూచి యుండలేదు. కాత్యాయని యొక్క కన్నులతో ఆ గోధనమును చూచినపుడు , అదికూడా ఆ కొండ నేపథ్యములో , చెట్లమధ్య , పచ్చికబయళ్ళలో అవి తిరుగుతుండగా చూచితే , ఏదో అనిర్వచనీయమైన తృప్తి అయినది. అలాగే ఇంకో ఘడియ చూస్తూ నిలబడింది, " గోవు అంటే సమృద్ధికి సంకేతము. ఆ గోవులు పచ్చచీర కట్టిన వనస్థలిలో తిరుగుచుండుటను చూస్తే మనసుకు ఎంతో హృద్యముగా ఉంది. చూచితివా , ఆ దృశ్యములోని సౌందర్యము ? కనులు మెచ్చుకున్నాయి, మనసు నిండింది , ఏదో శాంతి కలిగింది! చెల్లీ , నీ కోరిక నిజంగా ఎంత అందమైనదో ! " అన్నది.
దాన్నలా పరిభావిస్తుండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. " మేము ఇంతగా సంతోషించునది ఇదంతా మాది అనియేనా ? లేక , అదంతా సమృద్ధి ప్రతీకలైన సౌందర్యపు ముద్దలనియా ? " ఆమె విచారపరురాలైనది. ఔను ! ఒక చిగురుటాకు చేతికి చిక్కితే , దానిని తన మనోభావనతో మరలా పచ్చటి చెట్టులో పెట్టి చూచు జాతి. అయినా ఆ దినము ఆమె ఎందుకో ఆ విషయమును ముందుకు తీసుకుపోలేదు.
కాత్యాయనికి భగవానులను కూడా పిలుచుకు వచ్చి ఆ దృశ్యమును చూపించవలెనని మురిపెము. కానీ , భగవానులు తనమాట పాలించరు అన్న అపనమ్మకము లేకున్ననూ ఎదో సంకోచము. అత్తను పిలుచుకు వచ్చి చూపించినది. ఆమె కూడా మిక్కిలి సంతోషించినది. " మీ ఆశ్రమమునకు వచ్చిన దినము నుండీ ఒక్కొక్క దినము ఒక్కొక్క విచిత్రమును చూపిస్తున్నావు. రెండు దినములలోనే ఆ కొత్త కాలువకు పిలుచుకొని వెళ్ళినావు. కాలువ నీరు వచ్చి పడుతున్న చెరువైతే నిజంగా మనోహరముగా ఉంది. అన్నిటికన్నా , నువ్వు వెళ్ళి నిలుచుంటే ఆ లేగదూడలు నీ చుట్టూ చేరి తోకలనెత్తి దుముకుతూ ఎగురుతూ ఆడే దృశ్యము మాత్రము నిజంగా మనసులను గెలిచేది. కాదే , అదెంత వేగిరముగా నువ్వు వాటిని మచ్చిక చేసుకున్నావు ? అక్కడ కూడా మన ఇంట్లో ఆవులూ దూడలూ ఉన్నాయి , అయితే అవి ఇంతగా మాలిమి కాలేదు. పాలు తాగుతున్ననూ నువ్వు పిలిస్తే పరుగెత్తి వస్తాయో ఏమో ? " అన్నది.
కాత్యాయనికి ఆ స్తుతి విని చాలా సంతోషమైనది. ’ అమ్మా , ఏదైనా చేసి , భగవానులను ఒక దినము పిలుచుకొని వచ్చి ఈ దృశ్యమును చూపించవలెను కదా ? " అన్నది. ఆ మాటలో . ’ ఇది నావల్ల సాధ్యము కాదు , మీరే పూనుకోవలెను’ అన్న భావము నిండి ఉంది. ’ ఏదో ఒకటి చేసి పిలుచుకొని రండి , ’ ఊ ’ అనండి ’ అన్న ప్రార్థన నిండి ఉంది.
ఆలంబిని నవ్వింది. " అది కాదే , నువ్వు చెబితే మీ భగవానులు వినరా ? నేనే చెప్పాల్నా ? అవసరము లేదు , నువ్వు రా అంటే వాడు వస్తాడు. " అంది. కాత్యాయని వినలేదు, " అట్లు కాదమ్మా! వారు కళ్ళు మూసుకుని కూర్చొని అన్నీ చూచినానని సంతోష పడువారు. మనము కళ్ళు తెరచి చూచి సంతోషపడు వారము. అదేమో కళ్ళు మూసి చూచుటకన్నా, కళ్ళు తెరచి చూచుట తక్కువ అని మన భావన. కాబట్టి వారిని పిలిస్తే ఎక్కడ అపరాధమగునో అని దిగులు. మీరైతే అది వేరు. ఎంతైనా మీరు వారి తల్లి. మీ మాట మీరుట ఉండదు. నా కష్టము చూడండి. నేను మెచ్చినదానిని వారు మెచ్చ వలెను. వారు మెచ్చకుంటే నాకు తృప్తి లేదు. అలాగని వారిని నేరుగా పిలుచుటకూ లేదు. అందుకే మిమ్ములను అడుగుతున్నాను. "
ఆలంబిని కొడుకును పిలుచుకు వచ్చుటకు ఒప్పుకున్నది. కాత్యాయని అంది : " అది గనక అయితే ఇంకో రెండు మూడు దినములలో కావలెను. చూడండి , మహారాజుల నెల బ్రహ్మచర్యము ఇంకో రెండు మూడు దినములకు తీరును. ఆ తరువాత ఆ పుణ్యాత్ముడు భగవానులకు విడుపు ఇస్తారో లేదో ? "
" అది కుడా నిజమే! మహారాజులు పయోవ్రతమును పట్టి నెల కావస్తున్నది కదా ? అదేమి కాత్యాయనీ , ఇతరుల విషయములో ఒక సంవత్సరము బ్రహ్మ చర్యము అన్నవారు మహారాజుల విషయములో ఒక నెల అన్నారు ? "
" ఏమిటమ్మా తెలియనట్లే అడుగుతున్నారే ? ఇతరులు అంటే మామగారే కదా ! మామ గారిని అదిమివేసే పనులేమున్నాయి ? పైగా బ్రాహ్మణులు కదా. మహారాజైతే క్షత్రియులు. బ్రాహ్మణుల వలె అన్నీ వదలి కూర్చొనుటకు అవుతుందా ? రాచకార్యముల భారము ఎక్కువ. అందుకే అవధి తగ్గించినారు. దానితో పాటు పయోవ్రతము , ఏకాంతవాసము అదనముగా ఉన్నాయి కదా ? మామగారైతే కుటుంబములో ఒకరై ఉన్నారు. "
" అదీ నిజమే. సరే , మీ భగవానులను ఏ దినము పిలవాలి ?"
" మీకు ఎప్పుడు తోచితే అప్పుడు. "
" ఈ దినము ఇంకా మాధ్యాహ్న స్నానానికే చాలా సమయముంది. ఈ దినమే ఎందుకు కాకూడదు ? "
ఆలంబిని నేరుగా కొడుకును వెతుక్కుంటూ వెళ్ళింది. కాత్యాయని కూడా వెనకే వెళ్ళింది. భగవానులు సుఖాసనములో నడిమింట్లో కూర్చున్నారు. కనులు విశాలముగా తెరచియున్ననూ వాటికి ఏమీ కనపడుట లేదు అని నేరుగా ఉన్న ఆ చూపు తెలుపుతూ వచ్చినవారిని హెచ్చరిస్తున్నట్టుంది.
అత్తాకోడళ్ళు వెళ్ళి ఎదురుగా నిలుచున్నారు. కొంతసేపటికి భగవానులు వారిని చూచి, " పిలవకూడదా అమ్మా ? " అని లేచి నిలుచున్నారు. తల్లి నవ్వుతూ , " నువ్వు యే లోకమునకు వెళ్ళినావో ఏమో అని పిలవలేదు. కాత్యాయని ఏమో చెప్పవలెనని వచ్చినది. " అన్నారు.
భగవానులు నవ్వుతూ , " నేనేమి పులినా , ఎలుగుబంటునా ? తానే వచ్చి చెప్పకూడదేమి ? " అన్నారు.
" ఇంకేమీ లేదు , ఎదురుగా కొండపైన పశువులు మేస్తున్నాయి. నువ్వు వచ్చి చూడవలెనంట! "
" ఇంతేనా ? పద , ఇప్పుడే వెళ్ళి చూచి వద్దాము" అని భగవానులు కదిలినారు. " దేవుడి దయ ! వంటకూడా ముగిసింది " అని కాత్యాయని కూడా వెంట నడచింది.
భగవానులు కొండ పైన మేస్తున్న గోవులను చూచినారు. కొండ పక్కగా పారి వస్తున్న కాలువను చూచినారు. కొండకు ఈ వైపున చేరుకున్న విశాలమైన చెరువును చూచినారు. అన్నీ చూచి , " చూడమ్మా , ఇదంతా ఈమె వలన అయినవి. ఈమె వేయి ఆవులు కావలెనన్నది. అంతేకాక, దానికోసము మనకు కొంచము కూడా శ్రమ కలగరాదు అన్నది. దేవతలు సరేనన్నారు. చూడు. పశువులు వచ్చినాయి , వాటికి కొట్టములయినాయి. తాగుటకు నీరని , కాలువ వచ్చినది. కాలువ నీరు నిలుచుటకు చెరువయినది. ఇది సంసారము. ఊరికే పెరుగుతూ పోవడమే దీని స్వభావము. " అని, " భగవతి వచ్చి ఏమేమి చూడవలెనో చెప్పవలెను. మాకు కన్నులున్ననూ అన్నిటినీ చూడవు. " అన్నారు.
కాత్యాయని భగవానులు గోవులను చూచుటకు వచ్చినారు అన్న సంతోషములో అన్నీ మరచింది. సహజముగానే సరళమైనది. మాటకు మాట జోడించునది కాదు. అందులోనూ సంతోషములో మైమరచిపోయినపుడు ఇక చెప్పవలెనా ?
ఆమె ముందుకు వచ్చి గోవులను చూపించి, చెట్లనూ , పచ్చిక బయళ్ళనూ చూపించి , పచ్చిక దిన్నెలతో నిండిన ఆ వాలు మైదానములో అవన్నీ ఎంత సొగసుగా కనిపిస్తున్నాయో వర్ణించినది. భగవానులు అంతా విని తల ఊపి, " కాత్యాయనీ , ఇవి ఇంత సుందరముగా ఉండుటకు కారణమేమో తెలుసా ? " అని అడిగినారు.
" లేదు "
" నీ అభిమానము. ఆ అభిమానముతో ఇదంతా నాది అని చూస్తున్నావు. ఆ నాది అన్నదానివలన నీ సంతోషము ఇబ్బడిముబ్బడి యగుచున్నది. నాది అనుట వలన సంతోషము రెట్టింపైతే, " నేను " అన్నట్లయితే , గోవులన్నీ , గోవులే కాదు ఈ కొండ అంతా , ఈ నీరంతా , ఈ ఆకాశమంతా , అంతేనేమి , అంతా నేనే అన్నపుడు ఆ సంతోషము ఎంత కావలెను ? "
కాత్యాయని దాని భావమును అనుభవించి ఒక ఘడియ తన్మయురాలైనది. ఆలంబిని కూడా తన్మయురాలైనది. అయితే భావమును అనుభవించి కాదు.
భగవానులు మరలా అడిగినారు." ఆ దినము నువ్వు , జ్ఞాన నగరపు కాలువను ఇక్కడికి తెచ్చినారు , దాని చివర చెరువుంది అన్నది ఇదేనా ? పోనివ్వు , ఈనాడైనా వచ్చి చూచినాను కదా ? "
" అదేమిటి , ఈనాడైనా అంటున్నారు ? మీరు చూచిననూ నెమ్మదే ! చూడకున్ననూ నెమ్మదే ! "
" ఔను , ఔను. చూచిననూ మీరు బ్రహ్మమే ! చూడకున్ననూ మీరు బ్రహ్మమే ! కానీ చూచితే మీరు ముక్తులు. చూడకపోతే మీరు బద్ధులు. అంతే వ్యత్యాసము. ! అది సరే , నువ్వు ’ ఈనాడైనా అంటున్నారు ’ అని అడిగినావు కదా ? మరి , మహారాజు జ్ఞాన నగరమునుండీ తెచ్చిన కాలువ. దాని నీరు నిలుచుటకు కట్టిన చెరువు చూచితిరా అంటే లేదు అనకుండా , ’ ఊ చూచినాను ’ అనవచ్చా ? అందుకే అన్నాను "
భగవానులు దీర్ఘ కాలము ఆ గోసంపత్తును చూస్తూ నిలుచున్నారు. తల్లి , దూడలను కాత్యాయని మాలిమి చేసుకున్నది చెప్పినది. భగవానులు నవ్వి అన్నారు, " అమ్మా! నీ కోడలంటే ఏమనుకున్నావు ? ఆ ఏనుగుల వంటి ఆబోతులునాయే , వాటిని చూచినా లక్షము లేదంట ! వెళ్ళి , వాటి పక్కన నిలబడి, ఒళ్ళు నిమురుతుందంట ! ఈమె పిలిస్తే అవి లేగదూడల కన్నా ఎక్కువగా పరుగెత్తి వస్తాయంట ! "
" అవన్నీ నీకు ఎవరు చెప్పినారు ? "
" ఆ గోపాలకుల ముఖ్యుడున్నాడు కదా , అతడు వచ్చి చెప్పినాడు. "
అలాగే కొంతసేపు ఆ గోవుల సంగతి మాట్లాడుతూ వారంతా వెనుదిరిగినారు.
రాజు బ్రహ్మచర్యము ముగిసింది. దేహము తేలికగా ఉంది. ఏకాంత వాసము వలన ముఖమునకు వర్ఛస్సు వచ్చింది. మనసు చూచిన వైపుకు పరుగెత్తుట తప్పింది. రాజిప్పుడు రాజ భవనములో ఉన్నప్పటికన్నా శాంతుడూ, దాంతుడూ అయినాడు.
భగవానులు రాజును పిలిపించినారు. ఆ దినము ఉపదేశమని అతడికి తెలుసు. రాజును పూర్వాభిముఖముగా కూర్చోబెట్టి , తాము ఉత్తరాభిముఖులై కూర్చొని, భగవానులు తమ కమండలము నుండీ మంత్రజలమును రాజుమీద చల్లినారు. రాజుకు తాను అనునది ఏమున్నదో అదంతా మూటగట్టుకొని మూలాధారమునకు దిగింది. దృష్టి రెప్ప కొట్టుటను మాని భగవానులనే చూస్తున్నది. చేతులు , అరచేతులు వెల్లకిలగా తొడలపైనున్నవి. తలా వీపూ , అంగాంగములు నేరుగా గూటము కొట్టినట్టు కూర్చున్నవి.
భగవానులు ’ ప్రజ్ఞాన ఘనః ప్రత్యగర్థో బ్రహ్మేవాహమస్మి ’ అను మంత్రోపదేశము చేసినారు. మంత్రపు అక్షరములు ఒక్కొక్కటీ ఒక్కొక్క అఖాతమంతటి గంభీరములై చెవులనుండీ దేహము లోపలికి దిగి వాసమేర్పరచు కొన్నట్టాయెను.
భగవానులు, " ఈ మంత్రమును కనులు మూసి నూటెనిమిది సార్లు జపము చేసి ఏమవుతుందో చెప్పండి " అని తమ పాటికి తాము కూర్చున్నారు.
రాజు మంత్రమును జపించుట ఆరంభించినారు. మేరు ప్రదక్షిణ ( మధ్యమానామికాంగుళుల మధ్య కణుపులకు మేరువని పేరు ) చేసి లెక్కవేస్తున్నది తప్పిపోయింది. నోటితో మంత్రాక్షరములను చెప్పుచున్నది తప్పిపోయింది. లోపలంతా మంత్ర జపము నడుస్తున్నది.
అంగాంగములలోనూ ఏదో తేజస్సు పరచుకున్నట్టు భాసమగుచున్నది. ఆ పరచుకున్నదానిని తేజస్సు అనుటకన్నా ఇంకేదో అనుట సరియైనది. తేజస్సంటే చక్షుగోచరమైన రూపమున్నది అన్నట్లగును. అది రూపము కాదు, నాలుకతో రుచి చూచు రసము కాదు. శ్రోత్ర గ్రాహ్యమైన శబ్దము కాదు. ఘ్రాణము నుండీ గ్రహించు గంధము కాదు , త్వక్కునుండీ తెలియు స్పర్శ కాదు. అయినా బాగా తెలుస్తున్నది. అదేదో ప్రత్యేకమైనది. అయితే , వేడి కాదు , చలువ కాదు , అంతటిది. దానిని రాజు అంతవరకూ చూడలేదు. చూడలేదని , తాను దానిని గుర్తించలేను అని లేదనునట్లు కూడా లేదు.
అంతటి దొకటి ఆతని అంగాంగములను వ్యాపించినది, మెల్లగా వెనుతిరిగి వచ్చినట్టుంది. అంగాంగము లొకటొకటీ అది లేనిదే నిలువలేక తత్తర పడుతున్నవి. అలాగని పడిపోవునట్లు లేదు. చెదలు తిని మట్టిగా చేసిననూ నిలిచున్న వెదురు తడక వలె తన భావమును తాను మోసుకొని నిలచినట్లున్నది. ఆ ’ ఏదో ’ ఒక చైతన్యమందామా అంటే అది ఎద గూడు పక్క ఒకటై కలసినట్లుంది. ఘనమగుచున్నది. దాని కవచము జారి పడుతున్నది. కవచము జారగా అది సజాతీయమైన ఇంకొక పిండముతో చేరినట్లయినది. స్త్రీ పురుషులు ఒకరినొకరు దృఢముగా ఆలింగనము చేసుకొన్నట్లయింది. ఇంకేమీ స్మరణకు లేదు. విస్మరణమా ? అదీ కాదు. అహంభావపు కొన ఒకటి , అస్మితా భావపు కొన యొకటి. ఆ రెండూ సూక్ష్మములు. సూక్ష్మాత్ సూక్ష్మములు. అవి రెండూ కలసి పోయినాయి.
మంత్రము ఇంకా పలుకుతున్నది. ఉత్తర క్షణములోనే చిన్న పిండము మరలా విడివడి ప్రత్యేకమైనది. కవచము ఎక్కడినుండో వచ్చి మరలా దానిని కప్పినది. ఇప్పుడు కవచము ముందటి వలె తమోమయమై లేదు. తేజోమయమైనట్టుంది. అదంతా మరలా హృదయము దగ్గరకు వచ్చి చేరుతున్నది. అక్కడ తేజో మండలమయినది. దానిలో ఏమేమో చేరినట్లుంది. రాను రానూ చిన్నదవుతున్నది. అది నేరుగా మధ్యలోనున్న దారిలో వెళ్ళ వలెను అంటుంది. ఎవరో , ’ అక్కడికి పోవచ్చులే , ఇంకా కాలముంది ’ అంటున్నారు.
" నేను అక్కడికే పోవలెను "
" లేదు , నువ్వు మమ్మల్ని మించుటకు లేదు. మేము లాగిన వైపుకు నువ్వు తిరగవలెను. "
" అయితే నువ్వెవరు ? "
" మేము నీ విద్యా కర్మ వాసనలము. నువ్వు యెత్తినది ఇదొకటే జన్మము కాదు. నీకెన్నో జన్మలయినాయి. ఆయా జన్మలలో నువ్వు సంపాదించిన విద్యా, నువ్వు ఆచరించిన కర్మ, నువ్వు సంగ్రహించిన వాసనలు-ఇవే మేము. "
" అయితే నేనెవరు ? "
" అది మేము చూడలేము. పితృ లోకములో అది తెలియును. అప్పుడు నీకు నామ రూపాత్మకమైన దేహము వచ్చును. ఋషులు నువ్వు చేయు కర్మకు కావలసిన జ్ఞానమును ఇస్తారు. నీ భోగమునకు అవసరమగు ఐశ్వర్యమును దేవతలు ఇస్తారు. నువ్వూ ఒక ప్రాణివై జన్మిస్తావు. "
" అలాగయితే నాదంటూ ఏమీ లేదా ? "
" ఉపచరితముగా ( ఉపాసించబడినది ) కావలసినంత ఉన్నది. వాస్తవముగా ఏమీ లేదు. "
" మీరు, అంటే విద్యా కర్మ వాసనలు నావి కావా ? "
" మేము కాలము వచ్చినపుడు వదలి వెళ్ళెదము. "
"వదలి వెళ్ళుట అంటేనేమి ?"
" మేము జ్ఞానములో పరిసమాప్త మయ్యెదము."
" అది ఎప్పుడు ? "
" భగవానులంతటి వారి దయ కలిగినపుడు"
అంతవరకూ ఆ చైతన్య కణము ఏదో వాయు సాగరములో తేలుతున్నది, అప్పుడు హఠాత్తుగా కిందకు పట్టి లాగినట్లాయెను. కణము పెద్దదయింది. దానికి అంగాంగములు పుట్టినవి. మొదటి వలె జనక మహారాజు అయినది. రథములో కూర్చున్నాడు. తన విద్యా కర్మ వాసనలు ఒక్కటి కూడా వెంట లేవు.
రాజా జనకుడు రథములో వీధిలో వెళుచున్నాడు. రథాశ్వములు వేగముగా ముందుకు దూకుతున్నవి. తానూ , తన రథమూ నీటి లోపల, నీటి మధ్యలో వెళుతున్ననూ , తనకు ఊపిరాడుటకు ఆ నీరు అడ్డంకి కాలేదు. రథము నీటిని దాటి వస్తున్నది. ఇంకెక్కడికి లాగుకొని వెళ్ళెడిదో ? జనకుడు ఎగురుతాడు. మెలకువ అవుతుంది , మంత్రము పలుకుతున్నది.
" సరే , మంత్రము నూటెనిమిది సార్లు అయినది, రాజా వారు లేవవచ్చును. "
రాజు కనులు తెరచినాడు. తాను కళ్ళు మూసుకున్నపుడు చుట్టూ ఏమేమి ఉండినదో , అదంతా అక్కడక్కడే ఉంది. భగవానులు తన పక్కన అదే దర్భాసనము పైన అక్కడే అదే దృఢాసనములో కూర్చున్నారు. తానూ పద్మాసనములో తొడల పైన చేతులుంచుకొని కూర్చున్నాడు. అయితే ఒక వ్యత్యాసమైనది.
నీరు ఇంకిపోయి , బలిసిన టెంకాయలో కొబ్బెర గిటక గా మారి , పైనున్న పెంకు అనెడి కవచమును వదలినది అన్నది తెలియునట్లే , తాను ఈ దేహము కాదు , వేరే అన్న అవగాహన వచ్చినది.
భగవానులు ఏమీ తెలియనట్లు , ’ ఏమైనది ? ’ అంటారు. రాజు జరిగినదంతా చెపుతాడు. అలాగ చెప్పునపుడూ , తాను వేరే , చెపుతున్నవారు ఇంకెవరో అనిపించుతున్నది. భగవానులు అంతా విని, ’ ఇదంతా ఏమో అర్థమయినదా ? ’ అంత్టారు.
రాజు నమ్రుడై చిన్న గొంతుతో , ’ లేదు ’ అంటాడు. " ఒక జన్మాంతరమగుట . ఈ జీవుడు ఈ దేహమును వదలి వెళ్ళునపుడు, కరణాదులలో నున్న చైతన్యమునంతా ప్రాణ దేవుడు లాగేసుకుంటాడు. ఆ ప్రాణుడు మనసుతో కలిసిపోతాడు. విద్యా కర్మ వాసనలు వెంట వచ్చి హృదయము నుండీ నేరుగా బ్రహ్మ రంధ్రమునకు వెళ్ళు మార్గమును వదలి ఇంకెక్కడి నుండో జీవమును మోసుకొని పోతాడు. అది ఈ దేహమును వదలుట. దానిని చూడండి అలాగే జీవుడు సుషుప్తావస్థకు వస్తాడు. అప్పుడు తనకు కావలసినాదంతా సృష్ఠించుకొని విహారము చేసి జాగృత్తుకు వస్తాడు. ఇదంతా మీరు చూచినారు. చూచిన తరువాత అడుగ వలెను. విన్న దానిని నెమరువేసుకుంటూ ఉండవలెను. చివరికి అదే తాను కావలెను. మంచిది , ఈనాటికి ఇంత చాలు. ఇంకా రెండు నెలలు ఉంటారు కదా , అప్పుడు అడుగుట మొదలైనవన్నీ కానివ్వండి, ఇక లేద్దాము" అని మొదటివలె మంత్ర జలమును ప్రోక్షించినారు. చెరువు కట్ట తెగినపుడు నీరు బయటికి దూకునట్లు , మొదటి స్థితిగతులన్నీ వచ్చి నిండి , జరిగినదంతా విస్మృతి అయినట్లాయెను.
Janardhana Sharma
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి