10, డిసెంబర్ 2020, గురువారం

శ్రీమద్భాగవతము ప్రథమ స్కంధం -6

 దశిక రాము


శ్రీమద్భాగవతము


 ప్రథమ స్కంధం -6


వ్యాసచింత 


అలా అడుగుతున్న శౌనకాది మునీంద్రులతో సూతమహర్షి ఇలా చెప్పసాగాడు”మూడో యుగమైన ద్వాపరం పూర్తి అవుతున్న సమయంలో ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించి వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో, సరస్వతీనదిలో స్నానాది నిత్యకృత్యాలు పూర్తిచేసుకొని శుచియై, సూర్యోదయ సమయంలో ఏకాంతస్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు. భూత భవిష్య ద్వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైన కాల వేగానికి లోకంలో యుగ ధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచ భౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సారహీనులు, ధైర్యరహితులు, మంద బుద్ధులు, అల్పాయుష్కులు, దుర్బలులు అవుతారనీ తన దివ్య దృష్టితో తెలుసుకొన్నాడు. అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలకి మేలు కలిగించాలనే ఆశయంతో హోత, ఉద్గాత, అధ్వర్యుడు. బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులచే అనుష్ఠింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చే వైదికకర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని ఋక్కు, యజస్సు, సామము, అథర్వణము అనే నాలుగు వేదాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు. పైలుడు ఋగ్వేదాన్ని చదవటం మొదలు పెట్టాడు. జైమిని సామవేదం చదువసాగాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు. సుమంతుడు అథర్వ వేదాన్ని ఆరంభించాడు. మా తండ్రిగారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలూ, ఇతిహాసాలూ పఠించటం ప్రారంభించాడు. ఇలా తాము నేర్చుకొన్న వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ ఆ తపోధనులు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యు లందరూ తమ తమ శిష్యులకు అనేక విధాలుగా ఉపదేశించారు. అలా వేదం భూమి మీద అనేక శాఖలతో బ్రాహ్మణ సమాజంలో ప్రకాశించింది.ఈ విధంగా వేదములు విభజింపబడి మందబుద్ధు లైన మానవులచే పఠింపబడుతూ ఉన్నాయి. బ్రహ్మ బంధువులు, స్ర్తీలు, శూద్రులు, వేద శ్రవణానికి సమర్థులు కారు కనుక, సామాన్యు లందరికీ క్షేమం కలగాలని దీనవత్సలుడైన వ్యాసభగవానుడు మహాభారతాన్ని రచించాడు. అయినప్పటికీ విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతుష్టి చెందలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతుష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు.


నారదాగమనంబు 


ఆ సమయంలో తన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణనామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండగా, నోటివెంట వెలుపడే హరినామ సంకీర్తనం అనే అమృతప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతు ఉండగా, బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో మెరుస్తుండగా, ఒంటినిండా ధరించిన తులసిమాలల సుగంధాలు ఆకాశం నిండా వ్యాపిస్తుండగా ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్ఠలు గలవాడు, సకల శాస్ర్తపురాణ విశారదుడు ఐన నారదుడు వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు. అలా వచ్చిన నారదమహర్షి వినయశీలుడూ, వేదాలను విభజించిన ఉల్లాసం కలవాడు, సంసార దుఃఖం లేనివాడూ, మనోవిజ్ఞానం పూర్తిగా కలిగినవాడూ అయిన వ్యాసమునీంద్రుణ్ణి చూసాడు. ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని చూసి, లేచి వ్యాసుమహర్షి యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనారవిందంతో మహతీవిపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు. పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయించిన వాడివి. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించిన వాడివి, యోగులలో అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?” అలా అడిగిన నారదమహర్షితో వ్యాసమహర్షి ఇలా అన్నాడు. నారద మునీంద్రా! నీకు తెలియనిది ఏముంది. బ్రహ్మమానస పుత్రుడవు. శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు. దశదిశలందు తిరిగావు. మహత్తరమైన తత్త్వజ్ఞానంలో అందెవేసిన చేయ్యి అనిపించుకొన్నావు. అంతేకాకుండా. నీవు సూర్యభగవానుడిలా ముల్లోకాలలోను సంచరిస్తూ ఉంటావు. వాయుదేవుడిలాగా సర్వమానవుల మనస్సులలో మెలగుతూ ఉంటావు. సమస్తమూ తెలిసినవాడివి. నారదా! నీకు తెలియని ధర్మం ఏ లోకంలోను లేదు. అనేక విషయాలను అవలోచించినవాడివి. నాకు ప్రాప్తించిన కొరతకి కారణం ఏమిటో అదంతా దయతో నాకు వివరంగా చెప్పు." అని అడిగిన వ్యాసమునీంద్రుడితో నారదుడు ఇలా 

అన్నాడు. ఆర్యులచే పూజితుడా! వ్యాసా! పవిత్రమైన అనేక ధర్మవిశేషాలను నీవు వెల్లడించావు. సరే కానీ, పొరపా టేమిటంటే దానిలో కొంచెం మాత్రమే విష్ణుకథలు చెప్పావు. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణవిశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు, ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ మనస్సుకు ఈ లోటు రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే. పరాశర పుత్రా! వ్యాసా! హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస పంక్తులతో శోభాయమానమైన మానససరోవరం లాగ విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర


విచిత్రా


లైన అర్థాలతో కూడినప్పటికీ దుర్గందాలతో, కాకోలవిషాలతో కూడిన బురదగుంట లాగ ఉంటుంది. అది శోభంకరం కాదు.

తత్త్వవిశారదా! వ్యాస మునీంద్రా! పవిత్రమైన హరి చరిత్రలు కలిగిన కావ్యాలు తప్పులతో కూడుకొన్నప్పటికీ, సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, నామం జపం చేస్తూ, కథలు చెవులారా ఆలకించుట చేస్తూ, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకొంటారు కదా. వ్యాస మునివర్యా! కర్మవాసన లేనిది, ఆధారం లేనిది అయిన జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్షలేని నిష్కామకర్మమయినా భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం కాని, వాక్కు కాని కర్మకాని అవి యెంత గొప్పవైనను భక్తిలేనినాడు నిరర్థకాలే. అందువల్ల వ్యాసమహర్షీ! నీవు మహానుభాపుడవు, సత్యదర్శనుడవు, దిగంత విశ్రాంతమైన కీర్తి కలవాడవు, సత్యనిష్ఠుడవు, నియమ పరాయణుడవు, మానవు లందరికీ భవబంధవిముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా వర్ణించు. వాసుదేవుని వర్ణించని ఘట్టాలన్నిటిలో భావార్థ భేదాలు వెతుక్కుంటూ, ఆయా వివక్షల రూపాలు నామాలు పట్టుకు వేళ్ళాడేవాడి మనసు, ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలా రేవు చేరలేదు. కామ్యకర్మలందు ఆసక్తులైన మూఢమానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీవంటి వానికి తగదు. ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటు పడి పరమార్థాన్ని విస్మరిస్తారు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్తత్త్వాన్ని అందించి వారి వ్యథలు తొలగించు” అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు. “మునీంద్రా వ్యాసా ! కామ్యకర్మ లన్నింటినీ పరిత్యజించి ప్రాజ్ఞుడైనవాడు గోవిందుని గుణగణాలందు అనురక్తుడై, హరి స్వరూపాన్ని తెలిసికోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అజ్ఞుడైనవాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం మొదలైనవి కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానులకి సైతం ఈశ్వరుని లీలావిలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి.

ఎవడైతే తన కులధర్మాలను వదలిపెట్టినా సరే, గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో, అట్టివానికి నష్టమేమీ కలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరుజన్మలో నైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణుసేవకి దూరమైనవాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినప్పటికీ వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు. అందువల్ల సత్యం తెలుసుకున్నవాడు శ్రీహరి చరణ సేవాపరాయణుడు కావటానికి ప్రయత్నం చేయటం మంచిది. కాలానుసారంగా కష్ట సుఖాలు సంప్రాప్తమైనా, శ్రీహరి సేవను విడిచిపెట్టటం తగినపని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావర పర్యంతం పరిభ్రమిస్తున్న జీవులకు పొందశక్యంకాని ఆనందం ఏదైతే ఉందో, అది తప్పకుండా సిద్థిస్తుంది. శ్రీహరి సేవాపరాయణు డైనవాడు నీచజన్మని పొందినప్పటికీ సంసారబంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పరవశుడై హరిచరణస్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు.ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె ఇతరమైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితిసంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియనిది ఏముంది. నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్నించానన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను స్తుతించు మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, ఔదార్యానికీ, అనుష్ఠానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించటమే.

🙏🙏🙏

సేకరణ


*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: