10, డిసెంబర్ 2020, గురువారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 ప్రథమ స్కంధం -7


నారదుని పూర్వకల్పము 


మహానుభావా! నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటిలో పని చేస్తూ ఉండేది. నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొనిన కొందరు యోగిజనుల సేవనిమిత్తమై వారు నియమించారు. ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి. ఓ పుణ్యాత్ముడా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోటిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధాలూ పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని కొలిచేవాణ్ణి. నే నా యోగిజనులు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి: ఎండని, వానని లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారుమాటడకుండా వారి ఆజ్ఞలు పాలించేవాడిని. ఈ ప్రకారంగా వర్షాకాలం, శరత్కాలం గడచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీ కృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తు హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే ఆ పలుకులు అమృత రసప్రవాహాలై నా వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయా లన్నింటికి స్వస్తి చెప్పి భగవంతుడైన హరిని ఆరాధించటం ఆరంభించాను. అప్పుడు నాకు హరి సేవలో అమితమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి బ్రహ్మ స్వరూపుణ్ణి అయి, యట్టి నా యందు స్థూలం సూక్ష్మం అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితమని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్లటానికి ఉద్యుక్తులైనారు.ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులూ రాకుండా, చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధించి నందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతు లైనారు. ఎంతో సంతోష కారుణ్య వాత్సల్యాలతో అతిరహస్యము, అమోఘము అయిన ఈశ్వరవిజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు.

దేవాదిదేవుడైన వాసుదేవుని మాయాప్రభావాన్ని నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల తెలుసుకున్నాను. తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం ఈశ్వరార్పణం చేసిన కర్మమే. లోకంలో ఏ పదార్థం వల్ల రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితేనే కాని ఆ రోగం శాంతించదు. ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీ కృష్ణ గుణ నామాలను కీర్తించటంలో, సంస్మరించటంలో ఆశ క్తులౌతారు. ఓంకారపూర్వకంగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు నాలుగింటిని భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్దర్శనుడై సమదృష్టి కలవాడౌతాడు.నేనీ విధంగా ప్రవర్తించుటవల్ల విష్ణుభగవానుడు విశిష్టమైన ఈశ్వరజ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నా నడవడి ఆ శ్రీమన్నారాయణునికి తెలుసు. ఓ వ్యాసా! నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు. వ్యాసా! నీవు మునులలో ఎంతో ప్రసిద్ధుడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతనాలకు శాంతి లభించేటట్లు, చక్కగా వాసుదేవుని కీర్తించుము.“ఇలా నారదమహర్షి తన పుట్టు పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించిన, వ్యాసముని నారదుణ్ణి మళ్లీ ఇలా ప్రశ్నించాడు. “ఆయ్యా! నీకు ఆ మహానుభావులైన సాధువులు ఎంతో దయతో ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్లిపోయారు గదా. అటు పిమ్మట నీ బాల్యం ఎలా గడిచింది. పెద్దవాడ వయ్యాక ఎక్కడెక్కడ సంచరించావు. ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వ జన్మస్మృతి ఏ విధంగా కలిగింది. దాసీవుత్రుడవైన నీవు ఏ విధంగా నీ దేహాన్ని త్యజించావు దయచేసి వివరించు.” వ్యాసులవారి ప్రశ్నలకు నారదులవారు ఇలా సమాధానం చెప్పారు”ఆ విధంగా నేను ఆ సాధుపుంగవుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొంది యున్నాను. మా తల్లిది చాలా జాలిగుండె. ఉత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ క్రమం తప్పకుండ చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేది కాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. అయ్యో నా బిడ్డ అలసిపోయాడు. సొలసిపోయాడు, ఆకలి గొన్నాడు. అని అంటూ ప్రతిరోజూ అల్లారుముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్దచేసింది. ఎంతో ప్రేమగా మాటిమాటికీ నా బుగ్గలు ముద్దుపెట్టుకొనేది. నా జట్టు దువ్వేది. నాఒళ్లు నిమిరేది. నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకొనేది. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచి పోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయితే నేను సంసారవ్యామోహంలో చిక్కుబడలేదు. జ్ఞానాన్ని విడువలేదు. అయిదేళ్ళు వచ్చేదాక అలా మౌనిగ ఉన్నాను. అప్పుడు వ్యాసమహర్షీ! ఒకనాడు ఏమి జరిగిందంటే. మా అమ్మ రాత్రివేళ కటిక చీకటిలో ఆవు పాలు పిండటం కోసం ఇల్లు


వదలి బయటికి వెళ్లింది. త్రోవలో ఆమె ఒకపామును త్రొక్కింది. ఆ సర్పం ఆమె పాదాన్ని కరచింది. అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కోరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద పడిపోయిది. అలా మా అమ్మ క్రిందపడి విలవిల తన్నుకొని వివశురాలై ప్రాణాలు వదిలింది. అప్పుడు నేను ఆ విషాదదృశ్యాన్ని చూసి ఏ మాత్రం కలవరపడకుండా, నాచిత్తం శోకాన్నిపొందకుండా, నిబ్బరించుకొని నిలబడ్డాను. ”మంచిది, బంధం తెగిపోయింది" అనుకొన్నాను. ఇక నాకు హరిచరణస్మరణమే అవశ్యకర్తవ్యమని నిర్ణయించుకొన్నాను.అలా అనుకొన్న నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి పల్లెలు, పట్టణాలు, నగరాలు, జనపదాలు, గ్రామాలు, పేటలు, భిల్లవాటికలు దాటుకొంటూ, ఆటవికుల నివాసాలు, పెద్ద కొమ్మల మహావృక్షాలు, బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలు, నానావిధాలైన పక్షుల కలకలారావాలతో రమణీయమై, వికసించిన తామరపూలలోని మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమించే గండుతుమ్మెదలతో నిండిన సరస్సులు దాటుతూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలి దప్పికా ఎక్కువయ్యాయి. ఒక యేటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకొన్నాను.తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, అడవివరాహాలు, ఏనుగులు, దున్నపోతులు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, శార్దూలాలు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, కొండచిలవలు నిండిన భయంకరారణ్యాల గుండా మళ్లీ ప్రయాణించాను.దాట శక్యం కాని నీలితుప్పలు, వెదురు పొదరిండ్లు దగ్గరగా గల ఒక రావిచెట్టు కింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసికొన్ని పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను.


నారదునికి దేవుడుదోచుట 


నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది. నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్లీ ఆ దేవదేవుని దివ్యస్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరుగసాగాను. కాని నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కాని వాడు అయిన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి. నాయనా! ఎందుకలా వృథాగా ఆయాసపడతావు. నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలితకర్ములైన ముని ముఖ్యులే నన్ను చూడ గల్గుతారు. అంతే కాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణ కాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. వత్సా! నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. నన్ను సేవించటం వల్ల నాభక్తి అచిరకాలంలోనే నీమదిలో పదిలమౌతుంది. కుమారా నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మరు జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు. విను చిట్టితండ్రి! ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్లీ జన్మిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వ గుణసంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడవు అవుతావు.”

ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి, సర్వనియంత, వేదమయమూ అయిన ఆ మహాభూతానికి నేను తలవంచి మ్రొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను. మాత్సర్యాన్ని దిగనాడాను. కామాన్ని అణచిపెట్టాను. క్రోధాన్ని వదలిపెట్టాను. లోభాన్ని, మోహాన్ని వదలివేసాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ, పరమపవిత్రాలయిన హరి చరిత్రలను స్మరిస్తూ, నిత్యసంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలపరచుకొన్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమయింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్త్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన, బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేనూ భగవానుని ఉదరంలో ప్రవేశించాను. వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించ తలచెడి బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు, నేను జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై, భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై, పరబ్రహ్మముచేత సృష్టింపబడిన సప్తస్వరాలు తమంతతామే మ్రోగే ఈ మహతి అనే వీణమీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను. నేను విష్ణుమూర్తి లీలలను గానం చేసినప్పుడ;, తీర్థపాదుడు, దేవాదిదేవుడు, వాసుదేవుడు అయిన పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో దర్శనము ఇచ్చేవాడు. ఓ వ్యాస


మహర్షీ! ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే క్రిందుమీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టుకు చేర్చే తెప్ప లాంటిది. 

మునికులభూషణా! యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకొన్నప్పటికీ కామం, రోషం మొదలైన వానిచే అది మాటిమాటికీ రెచ్చిపోతూనే ఉంటుంది. కానీ శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను.“ అని ఈ ప్రకారంగా భగవంతుడు అయిన నారదుడు వ్యాస మునీంద్రునితో పలికి వీడ్కోలందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్లిపోయాడు. అనంతరం సూతమహాముని శౌనకాదులతో ఇలా అన్నాడు. “నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మ్రోయిస్తు, సకల జగత్తులకు వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు, సంచరించే మేటి భక్తుడు. ఆయనకు ఆయనే సాటి.”అంటూ నారదమహర్షిని సూతుడు స్తుతించగా ”నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాసభగవానుడు ఏం చేసాడో చెప్ప” మని శౌనకుడు అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు. ”బ్రహ్మదేవతాత్మికమైన సరస్వతీనది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోటానికి అనుకూలమై అనేక రేగుచెట్లతో నిండి శమ్యాప్రాసమనే ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్లి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు. ఈశ్వరుని మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని చూశాడు. మాయా మోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా మయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై, తానే కర్తను భోక్తను అనే అనర్థభావనలు చేస్తాడని, ఈ అనర్థాన్ని ఉపశమింప చేయటానికి విష్ణుభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు. ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసారబంధాలు సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో, అట్టి లోకకల్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు.ఈ విధంగా మహాభాగవత మనే సంహితను కల్పించి ముముక్షువైన శ్రీశుకునిచే చదివించాడు” అని సూతుడు చెప్పగానే శౌనకముని విని ”మోక్ష మందు మాత్రమే అపేక్ష కలిగి, సమస్త మందు ఉపేక్ష కల శుకయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకోసం అధ్యయనం చేసాడు” అని ప్రశ్నించగా సూతమహర్షి ఇలా అన్నాడు.శ్రీహరి గుణకీర్తన ముందు ఆసక్తుడూ, ఉత్తమ విష్ణుభక్తుడూ అయిన శుకమహర్షి ముల్లోకాలకూ కల్యాణప్రదమైన భాగవతము అనే వేదమును విశ్వశ్రేయస్సును ఆకాక్షించి అధ్యయనం చేసాడు. జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా దొరుకుతుంది."

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: