10, డిసెంబర్ 2020, గురువారం

మహాభారతం

 **దశిక రాము**


       **కవిత్రయ**


  **మహాభారతం**


ఆది పర్వము -8


నాగులకు శాపము :


కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు. కశ్యపుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది. వినత తనకు వారి కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. యాగ ఫలితంగా కద్రువకు వెయ్యి అండాలు వినతకు రెండు అండాలు కలిగాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది వెయ్యి మంది నాగ కుమారులు జన్మించాయి. అందుకు వినత ఉక్రోష పడి తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదమింది. దాని నుండి సగము దేహంతో జన్మించిన అనూరుడు ఎందుకు అమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు. నీ వలన నేను సగం దేహంతో పుట్టాను. ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవు నీ సవతికి దాసివి అగుదువుగాక అని శపించాడు. ఆ తరువాత తాను సూర్యునికి సారధిగా వెళ్ళాడు. అనూరుడు వెళుతూ తన తల్లితో అమ్మా రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు. దాని నుండి పుట్టేవాడు మహా బల సంపన్నుడు. అతడి వలన నీకు దాస్య విముక్తి కాగలదు అని చెప్పి వెళ్ళాడు.


క్షీరసాగర మధనం :


ఇలా ఉండగా దేవ దానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసి మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని మధించడం మొదలు పెట్టారు. ముందుగా పుట్టిన భయంకరమైన హాలాహలం శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు. ఆ తరువాత పుట్టిన ఉచ్చైశ్వం, ఐరావతం ఇంద్రుడు స్వీకరించాడు. కౌస్థుభ మణిని, లక్ష్మీ దేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు. ఆ తరువాత కల్పవృక్షం, కామధేనువు, అప్సర కాంతలు, సుర మొదలైనవి లభించాయి. చివరగా ధన్వంతరి అమృత కలశంతో అవతరించాడు. అమృత కలశాన్ని రాక్షసులు లాక్కుని వెళ్ళారు. అమృతం

కోసం దేవ దానవులు కలహించారు. విష్ణు మూర్తి మోహిని అవతారంలో రాక్షసులను వంచించి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకు మాత్రం పంచసాగాడు. ఇది గ్రహించిన రాహువు, కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు. సూర్య చంద్రులు ఇది గ్రహించి విష్ణు మూర్తికి చెప్పారు. విష్ణు మూర్తి వారి శిరస్సును చక్రా యుధంతో ఖండించాడు. అప్పటికే గొంతు వరకూ దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి మిగిలిన శరీరం పడిపోయింది. అది మొదలు వారు సూర్య చంద్రులపై వైరం పెంచుకున్నారు. వంచించ బడినట్లు గ్రహించిన రాక్షసులు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేసారు. యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు. దేవతలు మంధర పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరారు.


🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: