10, డిసెంబర్ 2020, గురువారం

ఆది పర్వము -7

 **దశిక రాము**


ఆది పర్వము -7


రురుడు ప్రమద్వరల వృత్తాంతం :


చ్యవనునికి శర్యాతి కుమార్తె నుకన్యకు వివాహమైంది. వారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడు. ప్రమతికి క్షీరసాగర సమయంలో అమృత కలశంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరసతో వివాహం అయింది. ప్రమతికి ఘృతాచికి పుట్టిన కుమారుడు రురుడు. రురుడు స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. విశ్వావసు అనే గంధర్వ రాజుకు మేనకకు పుట్టిన కుమార్తె ప్రమద్వర. ఒక రోజు ప్రమద్వర పాముకాటుతో మరణించింది. ప్రమద్వర మరణానికి ఆశ్రమవాసులు దుఃఖించసాగారు. అది విన్న రురుడు రోదిస్తూ

 అరణ్యంలోకి పరిగెడు తాడు.


ప్రమద్వరను బ్రతికించుట :


రురుడు శోకిస్తూ ప్రద్వరను బ్రతికించమని దేవతలను ఓ దేవతలారా ! ఓ బ్రాహ్మణులారా ! నేను దేవ యజ్ఞములు, వేదాధ్యయనం, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే, నేను ఘోరమైన తపసు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయ వలన విషం నుండి విముక్తి కాగలదు అని ప్రార్ధించాడు. తిరిగి మంత్ర తంత్రములు తెలిసిన వారు విషతత్వ శాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ప్రమద్వర విషమును హరిస్తే అతడికి నా తపః ఫలమును, అధ్యయన ఫలమును ధారపోస్తాను. అని రోదించాడు. అప్పడు ఆకాశం నుండి ఒక దేవత బ్రాహ్మణోత్తమా !ప్రమద్వర కాలవశమున మరణించింది. ఆయషూ తీరింది కనుక దానిని ఆపడం ఎవరి తరం కాదు. అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఎవరైనా తమ ఆయుష్షులో సగం ఇస్తే ఆమె ముందరి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను అని పలికాడు. రురుడు అందుకు అంగీకరించి తన ఆయుర్ధాయంలో సగం ఇచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు.


సర్పముల మీద రురుడి పగ:


కానీ రురుడికి పాముల మీద కోపం పోలేదు. కర్రతో కనిపించిన పాములను చంపడం మొదలు పెట్టాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ కనిపించిన పాములను చంపుతూ ఉండసాగాడు. అలా చంపుతూ ఒక రోజు డుండుభం అనే ఒక పామును చంపడానికి కర్రను పైకి ఎత్తాడు. ఆ పాము భయపడి తేజోవంతుడివి అయిన బ్రాహ్మణుడివి అయినా నీవు ఇలా పాములను చంపడానికి కారణం ఏమిటి అని అడిగాడు. రురుడు నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే ఆమెను ప్రేమించాను. నేను ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. అందు వలన నేను పాములను చంపుతున్నాను. నిన్ను కూడా చంపుతాను అని చెప్పి కర్రను పైకెత్తాడు. వెంటనే ఆ పాము ఒక మునిగా మారి రురుడి ముందు నిలిచింది.


ఖగముని వృత్తాంతం:


రురుడు డుండుభం అనే పాముని చంపబోతుండగా ఆ పాము ఒక మునిగా మారాడు. రురుడు ఆ పాముని ఇదేమిటి పాముగా ఉన్న నీవు మనిషిగా మారడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ పాము నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా సహచరుడు ఖగముడు. ఒక రోజు నా సహచరుడు ఖగముడు అగ్ని కార్యం చేస్తున్నాడు. ఆసమయంలో నేను అతడి మీద పరిహాసంగా గడ్డితో చేసిన పాముని వేసాను. అతడు నాపై కోపించి నన్ను విషం లేని పాముగా పడి ఉండమని శపించాడు. నేను అతడిని పరిహాసానికి చేసిన పనికి నన్ను ఇలా శపిస్తావా ! నన్ను క్షమించ లేవా అని ప్రార్ధించాను. నా ప్రార్ధన మన్నించి ఖగముడు మిత్రమా ! నా మాట జరిగి తీరుతుంది. అయినా నీవు పాముగా పడి ఉన్న తరుణంలో రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు. అతడిని చూడగానే నీకు నీ రూపం వస్తుంది. అని చెప్పాడు. అయ్యా మీరు బ్రాహ్మణులు. దయాగుణం కలవారు. పూర్వం నీ తండ్రి శిష్యుడైన ఆస్తికుడు కద్రువ శాప కారణంగా సర్పయాగంలో ఆహుతి అవుతున్న పాములను కాపాడాడు. నీవు కూడా పాములను చంపడం ఆప లేవా ! అన్నాడు. రురుడు పాములను చంపడం ఆపివేసాడు. ఈ కథను వింటున్న మునులు తల్లి కొడుకులకు శాపం ఇవ్వడం ఏమిటి. మాకు సవిస్తరంగా చెప్పండి అని కోరారు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: