10, డిసెంబర్ 2020, గురువారం

మార్గశిరము- మహిమాన్వితము

 మార్గశిరము- మహిమాన్వితము

**********************

చింతపట్ల.వెంకట రమణాచారి.

మౌనయోగి,

జర్నలిస్ట్,

హైదరాబాద్,9493331195

**************************


 కాలాన్ని కొలిచేందుకు మనం ఎన్నో రకాల కొలమానాల్ని వాడతాము. వీటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి.

 చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని చాంద్రమానంగా  లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ఆయా రాశులలో సూర్యుడు తిరిగే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు తిరిగే కాలము కర్కాటకమాసము అంటారు .

ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు . ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం ప్రారంభమవుతుంది. అనగా, ఇది రాత్రి కాలం . మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం . అనగా, పగలుగా భావన . ఇలా భావిచినప్పుడు, దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది ఐన ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు . . . ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది.

 ధనుర్మాసంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దేవాలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు.

ధనుర్మాసంలో ఉదయ సాయంత్ర సంధ్య సమయాలలో ఇంటిని శుభ్రం చేసుకుని శుచియై దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని భావన.

 సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడమే ధనుర్మాసము. తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు అనగా భోగి పండుగ రోజు వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ మాసం విష్ణుఆలయాలలో తిరుప్పావై పఠనం గోదా కల్యాణాలు నిర్వహిస్తారు.

 శ్రీ వైష్ణవ సంప్రదాయస్తులు మార్గశిర పౌర్ణమి నుండి పాడ్యమి వరకు ధనుర్మాస వ్రతం స్వీకరిస్తారు.

 మార్గళి పేరుతో పిలువబడే ఈ ఉత్సవము నెలరోజులు కొనసాగుతోంది.

 ఈ నెల రోజులు బ్రహ్మ ముహూర్తం లో భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్యప్రబంధ తిరుప్పావై 30 పాశురాలను చదివి పూజలు చేస్తారు.

ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి చెప్పాడని పురాణంలో పేర్కొనబడింది.

నారాయణ సంహిత, బ్రహ్మాండపురాణం, ఆదిత్య పురాణాలలో,  భాగవతంలో కూడా వివరించబడింది


 ధనుర్మాసంలో శ్రీకృష్ణుని పూజలో ప్రతిరోజూ తులసి మాల వేసి పూజించడం వలన కన్యలకు కోరుకున్న వరుడు దొరికి వివాహం అవుతుంది.

 విష్ణుచిత్తుడు ఒక వైష్ణవ భక్తుడు తన మనసంతా శ్రీరంగనాథుని ఆరాధన కొరకు వినియోగించిన వాడు.  అతనికి తులసి మొక్కల లో దొరికిన అమ్మాయి గోదాదేవి.  తనకు సంతానం లేనందున తన కుమార్తెగా పెంచుకుంటాడు.తండ్రికి పూజలో సహకరిస్తూ తులసి మాలలు పుష్పాల మాలలు అల్లుతుంటుంది.

 గోదాదేవి కూడా రంగనాథుని ఆరాధిస్తూ పూజిస్తూ ప్రతిరోజు రోజుకు ఒకటి చొప్పున 30 పద్యాలను రచిస్తోంది. వాటిని పాశురాలు అంటారు. ముప్పై పాశురాల సంకలనమే తిరుప్పావై గా పేరుగాంచింది. మానవమాత్రులను కాదని రంగనాధునే పెళ్ళాడతనని భీష్మించుకు కూర్చుంటుంది. రంగనాధుని అనుగ్రహంతో తనలో లీనం చేసుకుంటాడు.


 ఈ రచన మీ పత్రిక జనవరి 2021 సంచిక కొరకు మాత్రమే రాసింది. అనుకూలతను బట్టి మీరు ఏదైనా మార్పులు చేసినచేసుకోవచ్చు.కాపీ కాదు అని హామీ ఇస్తున్నాను.

చింతపట్ల.వెంకట రమణాచారి.

మౌనయోగి,

జర్నలిస్ట్,

హైదరాబాద్,9493331195

కామెంట్‌లు లేవు: