10, డిసెంబర్ 2020, గురువారం

మౌనభక్తి

 *మౌనభక్తి.*


ఎనభయ్యయిదేళ్ల వయసులో..ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ..

ప్రతి శని వారం నాడు ఉదయానికల్లా మాలకొండ చేరి.. ఆ లక్ష్మీ నారసింహుడిని దర్శించుకొని..అదేరోజు సాయంత్రానికి మొగలిచెర్ల గ్రామంలో సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చి.. పల్లకీ సేవ చూసుకొని, ఆరాత్రికి అక్కడే నిద్ర చేసి, తెల్లవారి ఆదివారం నాడు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించి, సాయంత్రానికి తన ఊరు చేరతాడు సింగయ్య..


దాదాపు 45 సంవత్సరాల క్రిందట, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మాలకొండ లో తపస్సు చేసుకునే రోజుల్లో, దిగంబరిగా ఉన్న ఆ స్వామిని చూసాడు..ఆనాటి నుంచీ స్వామి వారి మీద గురి కుదిరింది..ఆయన సింగయ్యకు చెప్పింది కూడా ఏమీ లేదు..చెయ్యెత్తి ఆశీర్వదించడం తప్ప..


మౌనమే ప్రశ్న..మౌనమే సమాధానం!!


ఆ తరువాతి కాలంలో సింగయ్య మాలకొండ వెళ్లినప్పుడల్లా శ్రీ స్వామివారిని దర్శించుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు..స్వామివారి దర్శనం ప్రతిసారీ దొరికేది కాదు..ఇద్దరిమధ్యా మౌనమే తప్ప మాటలు లేవు..శ్రీ స్వామివారు సింగయ్యను చూసినప్పుడు పలకరింపుగా నవ్వేవారు..అంతే..అదే మహాభాగ్యం గా తోచేది సింగయ్యకు..


ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం మోపాడు గ్రామ నివాసి ఈ తన్నీరు సింగయ్య..భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు..


తన మాటల్లోనే చెప్పాలంటే, "అంతా స్వామి దయవల్ల  లక్షణంగా ఉన్నారు..స్వామివారిని చూసినప్పటి నుంచీ ఆయన్నే నమ్ముకున్నానయ్యా..ఎన్నో సార్లు ఆ మహానుభావుడిని చూసా..ఏనాడూ నాతో ఒక్క మాట మాట్లాడలేదు..కానీ నన్ను చూసి నవ్వేవాడు..ఆ స్వామి నన్ను చల్లంగా చూడబట్టే నాకు ఈరోజు ఏ బాదరబందీలూ లేవు..ఏదో ఆ పిలుపొచ్చేదాకా స్వామి దగ్గరికి వస్తావుంటా.."


అందరినీ చిరునవ్వుతో పలకరించుకుంటూ దేవాలయపు ఆవరణంతా తిరుగుతూ ఉంటాడు..మా అర్చక స్వాములూ ఆయనతో కలివిడిగా ఉంటారు..ఆదివారం మధ్యాహ్నం స్వామి వారి హారతి ముందుగా నా దగ్గరకు వచ్చి, నా చేతిలో ఓ అరటి పండు పెట్టి, నవ్వి వెళ్ళిపోతాడు...కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్యా జరుగుతున్న తప్పనిసరి కార్యక్రమం..


తనకు స్వామి అనుగ్రహం ఉందని గట్టిగా నమ్మినప్పుడు..కాదనడానికి మనమెవరం?


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం... మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం...ప్రకాశం జిల్లా.. పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: