10, డిసెంబర్ 2020, గురువారం

_*శ్రీ శివ మహాపురాణం

 _*శ్రీ శివ మహాపురాణం - 26 వ అధ్యాయం*_



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*సృష్ట్యు పాఖ్యానే ముని ప్రశ్న వర్ణనము*



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



ఇపుడు రెండవది యగు రుద్ర సంహిత ఆరంభింపబడుచున్నది. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులకు ఏకైక కారణము. గౌరీ దేవికి భర్త, తత్త్వముల నెరింగిన వాడు. అనంతమగు కీర్తి గలవాడు, మాయకు ఆశ్రయమైన వాడు, మాయచే ప్రభావితుడు కాని వాడు, మనస్సుచే ఊహింపశక్యము గాని రూపము గలవాడు, జ్ఞాన స్వరూపుడు, నిర్దోషుడునగు శివునకు నమస్కరించెదను . ప్రకృతి కంటె అతీతుడు, ఆది లేని వాడు, శాంతస్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడునగు శివునకు నమస్కరించుచున్నాను. ఆయన ఈ జగత్తు నంతనూ తన మాయచే సృష్టించి,జగత్తునకు లోపల, బయట ఆకాశమువలె వ్యాపించి యున్నాడు . శివుడీ జగత్తును తన స్వరూపము నుండియే సృజించి సర్వమును వ్యాపించి యున్నవాడై, తన గూఢ రూపమునందు ప్రతిష్ఠితుడై యున్నాడు. అయస్కాంత సన్నిధిలో లోహశకములు వలె, ఈ భువనములు నిత్యము ఆయన చుట్టూ తిరుగాడుచున్నవి. అట్టి శివుని నమస్కరించుచున్నాను .


*వ్యాసుడిట్లు పలికెను -*


జగత్తునకు తండ్రియగు శివుని, తల్లియగు పార్వతిని, వారి కుమారుడగు గణపతిని సమస్కరించి, ఈ గాథను వర్ణించుచున్నాము . ఒకప్పుడు నైమిషారణ్యము నందు నివసించే శౌనకుడు మొదలగు మునులందరు గొప్ప భక్తితో సూతుని ప్రశ్నించిరి .


*ఋషులు ఇట్లు పలికిరి -*


మంగళ కరము, సాధ్యసాధన ఖండ యను పేరు గలది, సుందరమైనది, భక్తులకు అనుగ్రహ కారమునగు విద్యేశ్వర సంహితా ప్రసంగమును వినియుంటిమి . ఓ సూతా!మహాత్మా!చిరకాలము సుఖివై జీవించుము. వత్సా! నీవు మాకు శంకరుని దివ్య గాథను వినిపించుచున్నావు గదా! ఓ పుణ్యాత్మా! నీ ముఖ పద్మము నుండి ప్రసరించు జ్ఞానామృతమును మేము పానము చేసినాము. కాని మాకు తృప్తి కలుగుట లేదు. మేము నిన్ను ఒక విషయమును ప్రశ్నించగోరుచున్నాము . నీవు వ్యాసుని అనుగ్రహముచే సర్వజ్ఞుడవు, కృతార్థుడవు అయినావు. భూత , వర్తమాన , భవిష్యత్‌ కాలములలో నీకు తెలియనిది లేదు .


నీవు గొప్ప భక్తిచే గురువు యొక్క పరమకృపను పొంది, సర్వమును వివరముగా తెలుసుకొంటివి. నీ జన్మ సార్థకమైనది . ఓ గొప్ప జ్ఞానీ! ఇపుడు సర్వశ్రేష్ఠమగు శివుని స్వరూపమును, శివ పార్వతుల దివ్య చరిత్రలను సంపూర్ణుగా చెప్పుము . మహేశ్వరుడు నిర్గుణుడైననూ, లోకములో సగుణుడుగ నున్నాడు. ఇది యెట్లు? విచారించినచో, మాకెవ్వరికీ శివుని తత్త్వము తెలియదు . శంభుడు సృష్టికి పూర్వము స్వరూపములో నుండుట యెట్టిది? స్థితి కాలములో ఆ ప్రభువు క్రీడించు విధమెట్టిది ?


ఆ మహేశ్వరుడు లయకాలమునందెట్లుండును ? లోకములకు శుభమును కలుగజేయు ఆ శంకరుడు ప్రసన్నుడగు విధమెయ్యది? . ఆ మహేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులకు మరియు ఇతర భక్తులకు ఇచ్చే మహా ఫలము ఏది ? ఈ విషయములనన్నిటినీ మాకు చెప్పుము . భగవానుడు వెనువెంటనే ప్రసన్నుడగునని వింటిమి. దయామయుడగు ఆ మహాదేవుడు భక్తుల కష్టమును చూడజాలడు . బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురు దేవతలు శివుని దేహము నుండి జన్మించిరి. వారిలో మహేశుడు శివుని పూర్ణాంశము కలవాడు గనుక, సాక్షాత్తుగా శివస్వరూపుడే .


హే ప్రభూ! ఆ శివుని ఆవిర్భావమును, చరిత్రలను, ఉమ యెక్క ఆవిర్భావమును, మరియు వారి వివాహమును వివరముగా చెప్పుము . ఓ అనఘా! శివుని గృహస్ధాశ్రమ గాధలను, ఇతర లీలలను వివరముగా చెప్పుము. ఇదంతయూ మాత్రమే గాక, ఇంకను చెప్పదగిన విశేషములను కూడ చెప్పవలెను .


*వ్యాసుడిట్లు పలికెను -*


ఈ విధముగా ఆ ముని వరులచే ప్రార్థింపబడిన సూతుడు శంభుని పాదపద్మములను స్మరించి వారికి ఇట్లు బదులిడెను .


*సూతుడిట్లు పలికెను -*


ఓ మునిశ్రేష్ఠులారా! మీరు చక్కగా ప్రశ్నించితిరి. మీ మనస్సులలో సదాశివుని గాథయందు నిష్ఠ కలిగినది. మీరు ధన్యులు . సదాశివుని కథలను గురించి ప్రశ్న గంగా జలమువలె స్త్రీలను , పురుషులను, చెప్పు వానిని, మరియు వినువానిని పవిత్రము చేయును . ఓ ద్విజులారా! శంభుని గుణముల ప్రసంగము సాత్త్వికులను, రాజసులను, తామసులను కూడా సర్వదా ఆనందింపజేయును. అట్టి ప్రసంగమునందు పశు హింసకునకు తప్ప మరెవ్వరికి విరక్తి కలుగును? 


శంభుని గుణములను నిష్కామ భావనతో గానము చేయు భక్తునకు సంసారమనే రోగము తొలగిపోవును. ఈ గుణగానము మనస్సునకు ఆహ్లాదకరముగను, చెవులకు ఇంపుగను ఉండుటయే గాక, సర్వకార్యములను సిద్ధింపజేయును . మీ ప్రశ్నకు సమాధానముగా నేను శివలీలను నా బుద్ధికి తోచినంతలో శ్రద్ధతో వర్ణించెదను. ఓ ద్విజులారా! మీరు ఆదరముతో వినుడు . ఒకప్పుడు నారదుడు శివస్వరూపుడగు విష్ణువుచే ప్రోత్సహింపబడినవాడై, తండ్రిని ఇదే ప్రశ్నను అడిగినట్లే అడిగెను . శివభక్తుడగు బ్రహ్మ గారు కుమారుని ప్రశ్నను విని, ప్రసన్నమగు మనస్సు గలవాడై, నారదునకు ఆనందము కల్గు విధముగా ప్రీతితో శివుని కీర్తిని గానము చేసెను . సూతుడు పలికిన ఈ మాటలను విని ఆ మునివరులు కుతూహలము గలవారై ఆ సంవాదమును చెప్పుమనని ఆయనను కోరిరి .




*ఋషులు ఇట్లు పలికిరి -*


ఓ సూతా! మహాత్మా! నీవు శైవులలో గొప్పవాడివి. మహాబుద్ధి శాలివి. నీమధురమగు పలుకులను వినుటకై మా మనస్సులు కుతూహలముతో ఉవ్విళ్లూరుచున్నవి . బ్రహ్మకు, నారదునకు రమ్యమగు ఆ గొప్ప సంవాదము ఎప్పుడు జరిగెను? కైలాసగిరివాసుని లీలా సంవాదము సంసారము నుండి విముక్తిని కలిగించును . హేసూతా! శంకరుని కీర్తిని గానము చేయు బ్రహ్మనారద సంవాదమును ప్రీతితో మా ప్రశ్నలకను రూపముగా మాకు వివరింపుము . పవిత్రాంతః కరణులగు ఆ మహర్షుల పలుకులను విని సూతుడు మిక్కిలి సంతసించినవాడై ఆ సంవాదము యొక్క వివరములను వర్ణించెను .


*శ్రీ శివ మహాపురాణములో రెండవదియుగు రుద్రసంహితయందలి సృష్ట్యుపాఖ్యానమను మొదటి ఖండములో ముని ప్రశ్న వర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది.*




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

కామెంట్‌లు లేవు: