10, డిసెంబర్ 2020, గురువారం

అమ్మమ్మ వాళ్ళ ఇల్లు*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹


🌷 *అమ్మమ్మ వాళ్ళ ఇల్లు* 🌷

         (జగదీశ్ కొచ్చెర్లకోట)

              🌷🌷🌷

“వెళ్ళగానే ఉత్తరం రాయి! మీ అమ్మగార్నడిగానని చెప్పు!" నడుస్తున్న రైల్తోపాటు పరిగెడుతూ నాన్నగారు చెప్పే మాటలు రైలువేగం పెరిగేకొద్దీ అలా అలా దూరమైపోయాయి.


ఏడాదికోసారి సెలవుల్లో పుట్టింటికి పిల్లల్నేసుకుని కోడిపెట్టలా బయల్దేరేది అమ్మ. అయిదుగురిలో నాలుగోవాణ్ణి. సాధారణంగా మెయిలో, ఈస్టో ఎక్కేవాళ్ళం. అక్కడంతా ఈస్ట్‌కోస్టుని ఈస్టంటార్లెండి.


కూర్చునేందుకు చోటు వెంటనే దొరక్కపోయినా తుని, అన్నవరం దాటేటప్పటికి కొంచెం ఖాళీ అయ్యేది. ఇక రాజమండ్రిలో చాలామంది దిగిపోయేవారు.


కూర్చున్న తరవాత కిటికీ దగ్గర కూర్చోడానికి పోటీ వుండేది. కళ్ళలో బొగ్గు నురుసులు పడి కళ్ళు ఎర్రగా అయిపోతాయని చెప్పినా వినేవాళ్ళం కాదు.


ఎక్కిన ప్రతిసారీ జామకాయలు కొనాల్సిందే! రైలు తూర్పుగోదావరిలో ప్రవేశించిందనడానికి ఈ జామకాయలే సాక్ష్యం. 


అప్పటిదాకా నిశ్శబ్దంగా వుండే రైల్లోకి కుంభమేళాల్లో నాగసాధువులా ఎలా, ఎక్కణ్ణించి ప్రవేశించేవాడో తెలీదు..పెద్దబుట్టనిండా బాగా దోరగాపండిన జామకాయలేసుకుని వచ్చేవాడు.


‘జాంకే...జాంకే...జాంకే!'అంటూ పొలికేకలు పెడుతోంటే మాగన్నుగా నిద్దర్లుపోతున్నవాళ్ళు కూడా ఉలిక్కిపడి లేచి కొనుక్కునేవారు. ఇక ఇతర చిరుతిళ్ళు ఎలాగూవుండేవి.


పదిన్నరా పదకొండింటికి గూడెంలో దిగేవాళ్లం. చిన్నొంతెన దిగిన వెంటనే రోడ్డు దాటితే అమ్మమ్మా వాళ్ళిల్లు. గుమ్మంలోనే ఎదురయ్యేది అమ్మమ్మ..


అమ్మను ఏ ఏభయ్యేళ్ల తరవాతో చూస్తున్నంత ఉద్విగ్నతతో చూస్తూ ‘వచ్చావా?' అనేది! ప్రతి వేసవిసెలవులకీ అదే పలకరింపు! 


తెల్లగా, బక్కపలచని శరీరం, 

నిగనిగలాడే నల్లని జుట్టు, 

పాపిట్లో కుంకం, 

నుదుట గుండ్రంగా బొట్టు.. అంత గుండ్రంగా ఎలావస్తుందో నా చిన్నిబుర్రకి అర్ధమయ్యేది కాదసలు! 

ఆపుకుంటున్న ఆనందం, 

ఆపుకోలేని చిరునవ్వు.... 


ఇదే కాన్ఫిగరేషన్ అమ్మమ్మది.


వచ్చిన పావుగంటకే అందరిళ్ళూ తిరిగెయ్యాలని వుండేది మాకు. ఇద్దరు మేనమామలు ఒకే ఇంట్లో వుండేవారు. ఎదురుగా మరో ఇంట్లో ఆయుర్వేదం మావయ్య వుండేవాడు.


అమ్మమ్మకి చుట్టాలంటే ఇష్టం. తాతగారికి చుట్టలంటే ప్రాణం. సొంతంగా పొగాకుతో చుట్టలు చేసుకుని కాలుస్తుండేవారు. ఏదో ముక్తసరిగా మాట్లాడేవారంతే! ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. మొదటి రోజంతా మేం వచ్చామన్న వార్త ఊళ్ళో వున్న మిగిలిన బంధువులకి చేరెయ్యడంతోనే అయిపోయేది. 


ఒకనాడుదయం “మగపిల్లలంతా కాలవకెళుతున్నారు! నువ్వూవెళ్ళరా!" అంటూ బలవంతంగా లేపితే లేచాను. బారెడు పొద్దెక్కిందేమో అనుకున్నా! తీరా చూస్తే ఐదూనలభయ్యే!


పెద్దమావయ్య కొడుకులు నలుగురు, చిన్నమావయ్య కొడుకులు ఇద్దరు, ఆయుర్వేదం మావయ్య ముగ్గురు కొడుకుల్లో ఒకడు.... అందరూ తువ్వాళ్ళు కట్టుకుని చేతుల్లో సబ్బుపెట్టెల్తో నిలబడి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆ గదంతా లక్సు, మైసూర్ శాండల్ వాసన!


“వీడికీత రాదు! జాగర్తగా చూసుకోండి. గట్టుమీద కూర్చోబెట్టి రెండు చెంబుల నీళ్ళు పోసేసి చింతపల్లి వాళ్ళ అబ్బాయితో పంపించెయ్యండి. మీరంతా ఆ మూల్నించి ఈమూలదాకా ఈదుకొచ్చేవరకూ వీడుండడు!" ప్రోగ్రామ్ ఛార్టవుట్ చెయ్యడంలో అమ్మది ప్రత్యేకమైన స్కూలు.


“గట్టుమీద పోసుకునే దానికి కాలవకెందుకురా! పెరట్లో బోదుందిగా! ఆడాళ్ళతో కలిసి అక్కడ పోసుకో ఏం పోసుకుంటావో!" అని నాకేఁవీ అర్ధంకాని విధంగా జోకులేసేసి వెళిపోయారు. వాళ్ళలో ముగ్గురు గజీతగాళ్ళు. చిన్నొంతెన మీదకెక్కి అక్కణ్ణించి కాలవలోకి దూకేవారు. 


వాళ్ళ స్నానాలు అవ్వడమంటూ వుండదు. ఇంటినుంచి నాలాంటి అర్భకుడొకడు మళ్ళీ వెళ్ళి “ఇకచాలు రమ్మంటున్నారు తాతగారు!" అని కురుపు సలిపినట్టు సలుపుతోంటే ఓ గంటా గంటన్నరకి విసుక్కుంటూ బయటకొచ్చేవారు. అలాంటి పన్లకి నన్నే పంపిస్తూ వుండేవారు.


ఇద్దరు మావయ్యల ఇళ్ళ మధ్యలో ఖాళీ జాగా వుండేది. పిల్లలందరికీ అక్కడే వరసగా అన్నాలూ అవీ! కబుర్లతోనే సగం కడుపు నిండిపోయేది. 


తాతగారు పూజ చేసుకుంటోంటే పక్కనే కూర్చునేవాళ్ళం. అమ్మమ్మ చూసి మురిసిపోయేది. పిచ్చమ్మమ్మ! తనకేం తెలుసు మేం ఆయన నైవేద్యం పెట్టే తెల్లబెల్లం కోసం కూర్చున్నామని! మావూళ్ళో అదేంటో బెల్లం నల్లగా ఏడిసేది. ‘రుచి బానేవుంటుందిరా!' అనేవారు నాన్నగారు. అసలు చూట్టానికి బావుండాలిగా తినాలంటే!


కరెంటు పోతే ఆరుబయట మడతమంచాల మీద పెద్దవాళ్ళు పడుకునేవారు. పిల్లలంతా చప్టాలమీదా, చాపలమీదా చేరి పాటలు, మిమిక్రీలు, జోకులు...ఒకటేఁవిటి! 


రైలు దిగ్గానే నేను చేసే మొదటిపని రేడియోలో విజయవాడ వివిధభారతి పెట్టడం. మావూళ్ళో అవేం వచ్చేవికావు. ఎంత సంబరంగా వుండేదో అవన్నీ వింటోంటే! 


మావయ్యా వాళ్ళింట్లో అల్మారా తెరిస్తే ఓరకమైన వింత వాసన వచ్చేది. అందులో కాశ్మీర్ స్నో సీసాలు, క్యూటికురా పౌడర్ డబ్బాలు, రీటా నూనె సీసాలు, భావన అల్లం, భావన జీలకర్ర పొట్లాలు.... వెరసి ఓ మధురమైన పరిమళం. ఇప్పటికీ గుర్తే నాకు.


పెద్దమావయ్య ఓ విజ్ఞానఖని. తెగ చదువుతూ వుండేవాడు. మా బాబాయ్, అంటే పిన్నిభర్త ఎప్పడైనా మావయ్యకి పకోడీలో, పల్లీలో ఇచ్చినా  చేతికిచ్చేవాడు కాయితం తీసేసి.


‘చేతికి పొట్లం ఇస్తే అది చదువుతూ కూర్చుంటాడు తిండం మానేసి' అనేవాడు! ఏ విషయం మీదైనా మాటాడుతుండేవాడు మావయ్య. 


చిన్నమావయ్యకి సంగీతమన్నా, ఇతర కళలన్నా ప్రాణం. రాత్రి పదింటికి మా దగ్గర్నుంచి రేడియో లాక్కునేవాడు, సంగీత కార్యక్రమాలు వినాలని!


ఇక మా బాబాయ్! ఈయన నవ్వులబండి. ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. అందాకా స్తబ్దుగా వున్న వాతావరణం ఒక్కసారిగా ఓపదిమంది నవ్వులతో ఫెళ్ళుమని పేలేది. వెంటనే గుమ్మంలో సూట్ కేసుతో నల్లగా నిగనిగలాడే నవ్వులరేడు మా బాబాయ్ ప్రత్యక్షం!


రిక్షా దిగ్గానే, ఇంకా లోపలికి రాకుండానే వేసిన జోకుతో ఆ అలజడి మొదలయ్యేది. ఆయనుండే మూడురోజులూ మరి నవ్వులవానే! పడక్కుర్చీలో కూర్చుని ప్రపంచాన్నంతట్నీ చుట్టేసేవాడు.


అప్పుడప్పుడు పెద్దపండక్కి కూడా వెళ్లేవాళ్లం. వీధిపేరు సామవేదంవారి వీధి. బావుందికదా? చూడ్డానికి చిన్నొంతెనంతే ఉండేదిగానీ సందడికి మాత్రం పెద్దొంతెనంత!


మట్టిరోడ్డవ్వడం వల్ల అందరిళ్లముందూ ముదురాకుపచ్చని తడి. ఊరంతా తిరిగి ఎంతో ఓపిగ్గా తెచ్చుకున్న పేడతో కళ్లాపి చల్లేవారు. 


‘ఆ చివర బేమ్మర్లింటిముందు ముగ్గుజూసారా? చాలా బోందండే! అంతకంటే పెద్దదేద్దావఁనీ!’ అంటూ ఛాలెంజింగ్ టార్గెట్లు సెట్ చేసుకునేవారు. అయితే అదేమన్నా చిన్న వ్యవహారమా? నడువుఁలు పడిపోయేలా రెండేసిగంటలు వంగుని పెద్దపెద్ద ముగ్గులేసేస్తూ ఉండేవారు. 


డార్క్ బ్యాక్‌గ్రౌండ్ లో తెల్లగా మెరిసిపోతున్న శివుడి కళ్ల ముగ్గు, కొబ్బరిబోండాల ముగ్గు, రథం ముగ్గు చూసి తెగ ముచ్చటేసేసేది. స్వతహాగా చిన్నప్పట్నుంచీ ఆర్టిస్టునవ్వడం వల్ల ఇట్టాంటి ఆకర్షణలవీ ఎక్కువే!


ముగ్గు మధ్యలో మూడంటే మూడు గొబ్బెమ్మలు, ప్రతీ గొబ్బెమ్మ మీదా పల్లకీ ఎక్కినంత సంబరంతో ఎక్కి కూర్చుని గర్వంగా పలకరించే బంతిపూలూ ఓ ముచ్చట. నెలగంట మొదలైనప్పటినుంచీ ముక్కనుమదాకా వాళ్లకదే పని! 


ఊళ్లో కృష్ణచెరువని ఒకటుండేది. నిండుగా నీళ్లు, మధ్యలో వేణువు వాయిస్తున్న కృష్ణుడి విగ్రహం చూసి చాలా ముచ్చటేసేది నాకు. అది దాటిన తరవాత మా పెద్దమ్మా వాళ్లిల్లు. అక్కడికెళ్లిన ప్రతిసారీ ఆ చెరువుని చూడ్డం ఓ తీపిజ్ఞాపకం.


పండగ సినిమాలయితే విజయా టాకీసు, రేలంగి చిత్రమందిర్, రామతులసి థియేటర్లలో కొత్తవేసేవాడు. పిల్లలంతా కలిసి ఒకే సినిమాకి, ఒకే ఆటకెళ్లాలి. అట్నించి వచ్చాక మళ్ళీ ఆ సినిమాని రెండ్రోజులపాటు అదేపనిగా చెప్పుకుంటూ ఉండాలి. అదంతా ఓ ప్రోటోకాల్!


తోడికోడళ్ళు సినిమాలో కన్నాంబ పెద్దకోడలు. పండగలకి ఇంటికొచ్చిన పిల్లలందర్నీ తనచుట్టూ పడుకోబెట్టుకుంటూ ఉంటుంది. సావిత్రొచ్చి కోప్పడుతుంది.


‘అసలే జబ్బుమనిషివి. ఎందుకక్కయ్యా అలా పిల్లలందర్నీ పక్కన పడుకోబెట్టుకుంటావు? వాళ్లు నిన్ను పడుకోనిస్తారా?’ 


‘నే పడుకుంటానో పడుకోనో నీకెందుకు? పొద్దంతా కష్టపడి పన్జేస్తావు. నువ్వెళ్లి నిద్రపో. పిల్లలన్నాక ఓ దగ్గర పడుకోకబోతే ఎలా?’ అంటుంది బుంగమూతి పెట్టుకుని. ఎంత సహజమైన నిజమో కదా?


అచ్చం అలానే మొత్తం పిల్లలందరం కలిసి పదిహేనుకి పైనే తేలేవాళ్లం. అయినా అందరం ఒక దగ్గరే కింద బొంతలవీ వేసుకుని పడుకునేవాళ్లం. అర్ధరాత్రిదాకా కబుర్లూ, నవ్వులూ నడుస్తూ ఉండగా ఏ చిన్నమావయ్యో గట్టిగా ఓ కేక వెయ్యడంతో అవన్నీ ఆగిపోయేవి. ఆ తరవాత చెదురుమదురు సంఘటనలు మొదలయ్యేవి.


ఓ పదినిమిషాల పాటు లోగొంతుతో గుసగుసలు, దుప్పటి ముసుగుల్లో నవ్వలేక చావడాలు, ఓ... కదిలిపోవడాలు, దాంతో పక్కనున్న వదినో, బావో లేచి ఓ రెండు పీకడాలు అయ్యాక అప్పుడు వాతావరణం మొత్తం పూర్తి అదుపులోకి వచ్చేది. మళ్ళీ తెల్లారే ఏ భోగిమంటకో లేపితే లేవడమే! 


ఇన్ని సరదాలు, సందళ్ల మధ్య ఎప్పుడూ కనబడే పెద్ద లోటు... నాన్నగారు ఉండకపోవడం. ఆయన చాలాసార్లు వచ్చేవారే కాదు. 


పిల్లల్నేసుకుని కోడిపెట్టలా అమ్మే బయల్దేరేది. 


వేసవి సెలవులు, సంక్రాంతి సంబరాలు అయిపోవడమంటే ఆనందానికి ఆనకట్ట కట్టేసినట్టే! నూటికి నూరుపాళ్ళూ జుర్రేసుకునేవాళ్ళం ఆ కాలాన్నంతట్నీ!

🌷 *జగదీశ్ కొచ్చెర్లకోట*🌷

కామెంట్‌లు లేవు: