10, డిసెంబర్ 2020, గురువారం

20-వేదములు

 *20-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*11. దశోపనిషత్తులు*

((((((((((🕉))))))))))


*ఆదిశంకరులు పది ఉపనిషత్తులనెన్ను కొని వాటిపై భాష్యం వ్రాశారు. వాటిని దశోపనిషత్తులంటారు.వాటిలోనున్న, అద్వైత సిద్ధాంతాన్ని ఆయన విశదీకరించారు. వారి తర్వాత వచ్చిన రామానుజాచార్యులు, మధ్వాచార్యులు కూడ ఈ పది ఉపనిషత్తుల మీదే భాష్యాలు వ్రాశారు. కాని వీరు తమ సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమూ, ద్వైతమూ ననుసరించి భాష్యాలు వ్రాశారు. పది ఉపనిషత్తుల పేర్లనూ వివరిస్తుంది ఈ శ్లోకం - ''ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ'' ఆదిశంకరులు కూడ భాష్యాన్ని పై క్రమాన్ననుసరించే వ్రాశారు.*



*ఈశావాస్య ఉపనిషత్తు :- ఈశావాస్య ఉపనిషత్తు శుక్లయజుర్వేద సంహితాంతంలో ఉంటుంది. ''ఈశావాస్యం'' అన్న మాటతో ప్రారంభమవటం వల్ల ఆ ఉపనిషత్తుకి ఆ పేరు వచ్చింది. ఈశ్వరుడు జగత్తునంతా వ్యాపించియున్నాడనీ, మనం చేసే పన్నులనన్నిటినీ భగవంతునికే అర్పించి, పరమాత్మ తత్వాన్ని అనుభవసిద్ధం చేసుకోవాలనీ ఆరంభంలోనే చెప్తుంది ఈశావాస్య ఉపనిషత్తు.''ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాంజగత్‌|తేనత్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్దనమ్‌''!!*



*కేనోపనిషత్తు:- దీనినే తలవకార ఉపనిషత్తని కూడా అంటారు. సామవేదంలో జైమిని శాఖలో తలవకార బ్రాహ్మణ ముంటుంది కనుక. ''దొరకని దాని కోసం కేనలో అన్వేషించు'' అని ఒక నానుడి కూడా ఉంది. ఆద్యంతాలు లేని పరమాత్ముని కనుగొనటానికి గర్వోన్నతితో దేవతలు అన్ని చోట్లా వెతికారు.*



*అప్పుడు దివ్యురాలైన అంబిక దేవేంద్రునికి స్వయంగా అనుగ్రహించిన జ్ఞానమే ఈ ఉపనిషత్తులోని విషయం. పరాశక్తి అయిన అంబిక మన శక్తులన్నీ మహాశక్తి నుండి ఉదయించినవేనని చెప్తుంది. ఇతర భాష్యాలలో వలె ప్రతి పదార్థాన్ని యిచ్చి ఆపకుండా ఆదిశంకరులు ప్రతివాక్యానికీ వేరొక భాష్యం వ్రాశారు. ఈ ఉపనిషత్తుని దృష్టిలో ఉంచుకొనే లోకమాత నుద్దేశిస్తూ వారు వ్రాసిన భక్తిగీతం ''సౌందర్యలహరి''లో ఆది శంకరులిట్లా అన్నారు - ''వేద మాతశిరస్సుపై ఉంచిన పవిత్రమైన నీ పాదాలను నా శిరస్సుపైన కూడ ఉంచు తల్లీ''. వేదాంతం వలె ఉపనిషత్తులని కూడ వేద శిరస్సులనీ, శృతి శిరస్సనీ అంటారు. అంటే, వేదాలకు శిరస్సని (శృతులకు శిరస్సని) అర్థం. ఉపనిషత్తులే వేదాలకి చివరిభాగాలు, అవే అన్నిటి కన్నా ముఖ్యమైన భాగాలు కూడా (శిరస్సు వలెనే). లోకమాత పాదాలు వేదాల శిరస్సుపై ఉండటమంటే, ఉపనిషత్తులపై ఉండటమనమాట.*



*జ్ఞానరూపిణిగా లోకమాత కేనోపనిషత్తులోనే సాక్షాత్కరిస్తుంది. లలితా సహస్రనామంలో అంబకి ''సామగానప్రియ'' అన్న నామం కూడా ఉంది. ఆ లోకమాత ఘనతకు సామవేదంలోని ఈ ఉపనిషత్తు ఆవిష్కరిస్తుంది. ''మనకి ఒక పదార్థం కనబడింది'' అన్నప్పుడు ద్వైతభావం బయట పడుతుంది. అంటే చూడబడే పదార్థం (దృక్కు) చూచేది ద్రష్ట. దేహాన్ని వేరే పదార్థం వలె మనం చూడగలుగుతాం. ''నా ఒంట్లో బాగులేద''నో ''బాగుంద''నో అన్నప్పుడు కూడ దేహం ఒక పదార్థమే. అంటే ఈ దేహాన్ని పదార్థంగా చూచేది వేరే ఒకటి ఉన్నదన్న మాట. ఈ చూచేదే ఆత్మ. దీనిని అర్థం చేసుకోలేం, చూడలేం. ఆత్మ ఎప్పటికీ దృక్కుకాలేదు. ఎప్పుడూ ద్రష్టే. దేహాదులను విడచి ఈ ''నేను'' అన్నది తనంతట తానే సంస్థిత మవ గలదు. కాని దాని ఎరుక కలగట మసాధ్యం - ఎరుక కలిగి ఉండటమంటే అదొక పదార్థమవుతుంది కదా.*



*ఆత్మ విషయంలో ఇది అసంగతం. ఆత్మని తెలుసుకోవాలంటే, ఆ తెలుసుకొనే వాడు ఆత్మ కంటె భిన్నమవాలి. ఆత్మ కన్నా భిన్నమైనది మన మెరుగ దగినది ఏమైనా ఉందా? లేదు. అందువల్లనే ''ఆత్మని తెలుసుకోవటం'' ''ఆత్మజ్ఞానం'' వంటి మాటలలో ''తెలుసుకోవటం''మన్నది మనం నిత్యవ్యవహారంలో తెలుసుకొన్నట్టు - విషయమూ, గ్రహింపూ వంటి దేమీలేదు. ఆత్మానుభూతిని పొందటమే నిజమైన జ్ఞానం. అందువల్లనే కేనోపనిషత్తు ''నాకు ఆత్మజ్ఞానం కలిగింది. అనే వానికి ఆ జ్ఞానం లేదు. ఆ స్థితిలో ఉంది వేరే ఎరుకలేని వానికే అది ఉంటుంది. దానిని చూచేవాడు నిజంగా చూడలేడు, చూడలేనివాడు చూడగలడు'' అంటుంది.*


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: