10, డిసెంబర్ 2020, గురువారం

జ్ఞానమంజరి

 *🧘23 -అద్వైత జ్ఞానమంజరి🧘‍♂

🕉🌞🌎🌙🌟🚩


అందరూ భగవంతుని అంశలే. మాయకు లోబడి, అజ్ఞానవసులై తన నిజస్వరూపాన్ని, ఆత్మశక్తిని మర్చిపోతున్నారు  మానవులు. అందుకే ఆత్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు ముందుగా పార్థునికి జ్ఞానాన్ని ప్రసాదించి, అతనిని తనంతవానిగా చేసి, అఖండవిజయాన్ని చేకూర్చాడు. తనకి, సాధకునికి తేడా లేదని "ఏకత్వాన్ని" నిరూపించాడు. ఏకత్వమే యోగము. యోగేశ్వరుడే శ్రీకృష్ణుడు.



తనలో నెలకొన్న పరమాత్మను గ్రహించడానికి, ప్రతి వ్యక్తి తన జీవనయానంలో చేయవలసిన సాధనను “భగవద్గీత”గా బోధించాడు గీతాచార్యుడు. అందుకే భగవద్గీతను  "జీవనగీత" అని పేర్కొనడం జరిగింది.


                                    "జీవనగీత" (నిత్యజీవితంలో భగవద్గీత) - 1వ భాగము.


ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా నున్న నా కొడుకులూ, పాండురాజు కొడుకులు ఏమి చేస్తున్నారు? అని ధృతరాష్ట్రుడు, సంజయుడిని ప్రశ్నించేడు. పాండురాజుని కొడుకులు అని సంబోధించడంలోనే తన కొడుకులపై ధృతరాష్ట్రునికి వున్న మమకారం, ద్వందవైఖరి తేటతెల్లమైంది. పాండురాజు తన సోదరుడే కదా? తన సోదరుని కొడుకులు అనవచ్చు కదా! 



అందుకే ధృతరాష్ట్రుడిని ఒక గుడ్డివానిగా, అధర్మవర్తనులైన కొడుకుల పట్ల మమకారిగా, అజ్ఞానిగా చూపడం జరిగింది. మరి అటువంటి అజ్ఞానికి, శ్రీకృష్ణుడు తన విశ్వరూపం ఎందుకు చూపించాడు?



భవారణ్య ప్రవిష్టస్య ద్విజ్మోహ భ్రాంతచేతసః | యేన సందర్శితః పన్థా తస్మై శ్రీగురవే నమః ||



సంసారారణ్యమున ప్రవేశించి దిక్కు తెలియక భ్రాంతితో గూడియున్నట్టి జీవునకు ఎవడు మార్గమును చూపునో అట్టి గురువునకు నమస్కారము. 



అన్నీ వుండికూడా పుత్రులయెడ మమకారంతో ధర్మాన్ని విడచి, మంచిచెడులు విస్మరించి, అజ్ఞానిగా ప్రవర్తించాడు ధృతరాష్ట్రుడు. సత్యాన్ని గుర్తుచేయడం కోసం అతనికి తన విశ్వరూపం చూపించాడు. అఙ్ఞానిని, జ్ఞానిగా మార్చడానికి తనవంతు కృషిచేశాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు. గురువు సహాయము చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. గుర్తించే అర్హత సాధకునికి వుండాలి. 



అక్కడ కురుక్షేత్రంలో మానవులందరి ప్రతినిధి (Representative)గా అర్జునుడు వ్యవహరించాడు. మార్గదర్శి(Guide)గా శ్రీకృష్ణుడు నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి గీతను ఉపదేశించింది మందిరంలోనో, ఆశ్రమములోనో కాదు యుద్ధక్షేత్రంలో. అందునూ కురుక్షేత్ర సంగ్రామ సమయంలో, ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధంగా నున్నప్పుడు.



జీవితమే ఒక యుద్ధము. శరీరమే కురు క్షేత్రం. ఇంద్రియవాంఛలే శత్రువులు. వీటివలన నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న మొహాన్ని, భయాన్ని, అశక్తిని ఏకరవు పెట్టాడు పార్ధుడు. మానవుల విషాదాన్ని మొత్తం ప్రశ్నలతో సంధించాడు సవ్యసాచి. యుద్ధము చేయనని నీరసంతో కూర్చుండిపోయాడు.



అన్నింటినీ మౌనంగా విన్నాడు జగద్గురువు. కురుక్షేత్రమనే శరీరంలో అంతర్గతంగా వున్న శత్రువులను జయించలేక అసమర్థునిగా చతికిలబడటం చూసి, తనలో తాను నవ్వుకొని, మానవ శరీరాన్ని ధర్మక్షేత్రంగా ఎలా మలుచుకో వచ్చునో అర్జునునికి చెప్పదలిచాడు శ్రీకృష్ణుడు. 



పార్థునిలో నున్న సామర్ధ్యం కృష్ణునికి తెలుసు. ద్రోణాచార్య, కృపాచార్యుల నుండి అతడు ఏమి నేర్చుకున్నాడో గోపాలునికి తెలుసు. పార్థునికి వాళ్ళు కేవలం ప్రాపంచిక విద్యలను మాత్రమే నేర్పారు. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలాగ, ఏమి చెయ్యాలో బోధించారు. కానీ వారు "నేను చేయగలను" అనే మనోధైర్యాన్ని శిష్యునికి కలిగించలేదు. ఆ శక్తిని ప్రసాదించే సామర్ధ్యం ఒక్క సద్గురువుకి  ఉంటుంది. 



మానవులందరి ప్రతినిధియైన పార్ధునికి "మనోధైర్యాన్ని" కలిగించి, వాస్తవాన్ని తెలియజెప్పి, అంతిమ లక్ష్యాన్ని ఎలా సాధించాలో చెప్పాలని నడుంబిగించారు  జగద్గురువు.


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: