**దశిక రాము**
*శ్రీమద్భాగవతము**
ప్రథమ స్కంధం -5
ఏకవింశత్యవతారములు
అది అన్ని అవతారాలకు మూలవిరాట్టయిన అదినారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాలనుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి.
1) ఆదినారాయణదేవుడు మొదట కౌమార మనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తు బ్రహ్మణ్యుడై చరించాడు.
2) రెండవసారి యజ్ఞవరాహదేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భుమండలాన్ని ఉద్ధరించాడు.
3) మూడవ పర్యాయం నారదు డనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవధర్మాన్ని బోధించాడు.
4) నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతికోసం అపారమైన తపస్సు చేసాడు.
5) ఐదవ అవతారం కపిలావతారం. దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్త్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు.
6) ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైవారికి ఆత్మవిద్య ప్రబోధించాడు.
7) ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి, ఆకూతికి కుమారుడై, యమాది దేవతలతో స్వాయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు.
8) ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు.
9) తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి యై భూదేవిని గోవు గావించి సర్వ ఓషధులను పిదికాడు.
10) పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించిన జలప్రళయంలో నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు.
11) పదకొండవ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునిగిపోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు.
12) పన్నెండవ అవతారంలో ధన్వంతరి యై దేవదానవులు మథిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృతకలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు.
13) పదమూడవ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచి పెట్టాడు.
14) పద్నాలుగవ సారి నరసింహమూర్తిగా అవచతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు.
15) పదిహేనవ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు.
16) పదహారవమారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు.
17) పదిహేడవసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారికోసం వేదశాఖలను విస్తరింపజేశాడు.
18) పద్ధెనిమిదవ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు.
19) పందొమ్మిదవ అవతారంలో బలరాముడుగా,
20) ఇరవయ్యో అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు.
21) ఇరవై ఒకటవసారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి ఓడిస్తాడు.
22) ఇరవై రెండవ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్నించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు.
ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలవలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి; అలాగే శ్రీమన్నారాయణుని లోనుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి; రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే; పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా. ప్రతి యుగంలో రాక్షసుల చేష్ఠలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో, భగవంతుడైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు.అత్యంత రహస్య గాథలైన వాసుదేవుని అవతార గాథలు, ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో, అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు.వినండి, ప్రాకృత రూప రహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు ఐన జీవునికి మహదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూలశరీరం ఏర్పడింది; గగన మందు మేఘసమూహాన్ని ఆరోపించినట్లూ, గాలి యందు పైకి లేచిన దుమ్ముదుమారాన్ని ఆరోపించినట్లూ అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మ యందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు; జీవునికి కనిపించే ఈ స్థూలరూపం కంటే కనిపించనిది, వినిపించనిది ఐన జీవాత్మ యొక్క ఉత్ర్కాంతి గమనాగమనాల వల్ల మళ్లీ మళ్లీ జన్నిస్తున్నట్లు అనిపిస్తుంది; స్వస్వరూపజ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మరూపాలు రెండు తొలగిపోతాయని, మాయవల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించి నప్పుడు జీవునికి బ్రహ్మసందర్శనానకి అధికారం లభిస్తుంది; సమ్యక్ జ్ఞానమే దర్శనం; సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి, తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మరూపాలను దగ్ధం చేసి, కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది, పరమా
నందంతో విరాజిల్లుతాడని తత్త్వవేత్తలు వివరిస్తారు” అని సూతుడు మళ్లీ చెప్పసాగాడు.
చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలూ ఆయనని అంటవు. సమస్తజీవుల చిత్తములలోను ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి. ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనేలేవు. ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానావిధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళా హృదయం లేని అజ్ఞుడు, నాట్యంలోని అందచందాలను అర్థంచేసికొని ఆనందించి అభినందించ లేనట్లే, వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్క శాస్ర్త పాండిత్యం ఎంత ఉన్నా, భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సుచేత గానీ వాక్కుల చేతగానీ ఇంత అని గ్రహింపలేడు.మర్మము అన్నది కొంచం కూడ లేకుండ, ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ, నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు, బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలావిశేషాలను తెలుసుకొంటాడు” ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు. “ఓ బ్రహ్మణ్యులారా ! మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు.
శుకుడుభాగవతంబు
జెప్పుట
పుణ్యకీర్తనుడైన విశ్వేశ్వరుని చరిత్రం శ్రీమద్భాగవతం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనది. సర్వ పురాణాలలోను మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోకకల్యాణం కోసం భగవంతుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగ పూర్వకంగా రచించాడు. అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీశుకునిచేత చదివింపచేసాడు. సమస్తవేదాల, ఇతిహాసాల సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ శుకయోగీంద్రుడు గంగానది మధ్యలో మునిగణ సహితుడై, అత్యంత విరక్తుడై, ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్మహారాజు అడుగగా చెప్పాడు. ధర్మము, జ్ఞానములతోపాటు శ్రీకృష్ణుభగవానుడు తన లోకమైన వైకుంఠానికి వెళ్లి పోయిన తరువాత లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే చిమ్మచీకటిలో గ్రుడ్డివారు అయిపోయి దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడీ మహాపురాణం పద్మాలకు ఇష్ఠుడైన సూర్యుడిలా వెలుగులు పంచుతోంది. ఆనాడు మునుల ముందు మహాతేజస్వియై శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీశుకయోగివల్ల నేను నేర్చుకొన్న విధంగా, నా మనస్సుకు స్ఫురించినంతవరకు మీకు వినిపిస్తాను” అన్నాడు సూతుడు. అప్పుడు ఆయనను ముని శ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అడిగాడు. సూతమహామునీ! ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ఎవరు అడిగారు? ఆ వ్యాసభగవానుడు దేనికోసం వేద, ఇతిహాసాదుల సారం అంతా ఎంతో పరిశోధించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు? ఆయన కుమారుడైన శుకుబ్రహ్మ ఎటువంటి ప్రీతితో, ఏ విధంగా పరీక్షిన్మహారాజుకి భాగవతకథ వినిపించాడో? అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు. సుధీమణి! సూతా! వ్యాసుభగవానుని పుత్రుడైన శుకుడు మహా గొప్పయోగి, విరాగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఆయన నిగూఢ వర్తన కలవాడు. మూఢునిలా లోకానికి కనిపిస్తాడు, భేదాలు ఖేదాలు అంటని నిత్యానందుడు. అంతేకాకుండా సుధీమణి! సూతా! వ్యాసుభగవానుని పుత్రుడైన శుకుడు మహా గొప్పయోగి, విరాగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఆయన నిగూఢ వర్తన కలవాడు. మూఢునిలా లోకానికి కనిపిస్తాడు, భేదాలు ఖేదాలు అంటని నిత్యానందుడు. అంతేకాకుండా.
అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు, దిగంబరుడు, నవయువకుడు ఐన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా, వస్త్రధారి వృద్ధుడు ఐన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకొన్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి, వ్యాసుడు అందుకు కారణ మేమిటని అడిగాడు; అప్పుడు వారు”నీ కుమారుడికి స్త్రీపురుషబేధభావము లేదు; అంతేకాక ఆయన నిర్వికల్పుడు; మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు; నీకు, ఆయనకు ఎంతో భేదం ఉంది” అని అన్నారట; అటువంటి శుకబ్రహ్మ కురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించారు; హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు; పిచ్చివాడిలా, మూగవాడిలా, జడుడునిలా ఉండే ఆ మహర్షి, రాజర్షియైన పరీక్షిన్మహారాజుల మధ్య సంభాషణ ఏ విధంగా కుదిరింది; శ్రీమహాభాగవత సంహితను చెప్పడానికి ఎంతో కాలంపడుతుంది; దానిని శుకబ్రహ్మ వచించంటం ఎలా జరిగింది; అంతేగాక మహావిరాగి యైన ఆ శుకయ
ోగి గృహస్థుల ఇండ్లలో గోవు పాలు తీసేటంత సేపు మాత్రమే నిలుస్తాడని, ఆయన గో దోహన మాత్ర సమయం నిలిచిన చోట్లు అన్నీ పుణ్యతీర్థాలౌతాయని పెద్దలు అంటారు; అట్టి మహానుభావుడు అన్నాళ్ళు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్షిన్నరేంద్రుడి జన్మ ప్రకారం ఏమిటి, ఏమేమేం చేసాడు? దయతో ఈ విశేషాలన్నీ వివరంగా తెలుపుము. ఆ పరీక్షిన్మహారాజు సామాన్యుడు కాడు; తన పరాక్రమంతో పాండవుల వంశం, బలం, గౌరవప్రతిష్ఠలు వర్థిల్లునట్లు ప్రవర్తించిన వాడు; పరరాజ్యపాలకులు అందరు బంగారురాసులు తీసికొచ్చి ఆయన కాళ్ల ముందు క్రుమ్మరించి ఆయన పాదపద్మాలను సేవించారు; ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయశూరుడై, ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేవావ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు; ఆయన తాత యైన అర్జునుడు మహారథుడైన భీష్ముని రక్షణలో ఉన్న కురుసేనావాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు; అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైన పరీక్షిత్తు మహారాజు విడువరాని రాజ్యలక్ష్మిని విడిచి, గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది. అత్యుత్తమ కీర్తి ప్రతిష్ఠలు కల మానవోత్తములు నవ్వులాటకైనా ఆత్మ సుఖాన్ని అంతరాత్మలోనైనా అభిలషించరు; అట్టి వారు ఎల్లప్పుడూ లోకంలో అందరికీ అర్థసంపద, ఐశ్వర్యం, సౌఖ్యం, శ్రేయస్సూ చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు; పరోపకార పారీణమైన తన దేహాన్ని ఆ ప్రభువరేణ్యుడు ఆవిధంగా ప్రాయోపవేశం చేసి ఎందుకు పరిత్యజించాడో? ఓ మహానుభావా! సూతా! నీవు సమస్త గ్రంథాల సారం తెలిసినవాడివి; భాషణలు అన్నీ బాగా తెలిసినవాడివి; అనేక విధాల కథలను చక్కగా చెప్పటంలో మిక్కిలి నేర్పరివి; ఇప్పుడు మేము అడిగిన విషయాలన్ని, ఆ మూలాగ్రంగా మాకు సవివరంగా వివరించు.”
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి