11-01-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
శ్రీ భగవద్గీత
అథ ఏకాదశోఽధ్యాయః
పదునొకండవ అధ్యాయము
విశ్వరూపసందర్శనయోగః
విశ్వరూపసందర్శనయోగము
అర్జున ఉవాచ :-
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంఙ్ఞితం |
యత్త్వ యోక్తం వచస్తేన
మోహోఽయం విగతో మమ ||
తా:- అర్జునుడు చెప్పెను - (శ్రీకృష్ణమూర్తీ !) నన్ననుగ్రహించుటకొఱకై సర్వోత్తమమై, రహస్యమై అధ్యాత్మమను పేరుగలదైనట్టి ఏ వాక్యమును (బోధను) మీరు చెప్పితిరో, దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది.
వ్యాఖ్య:- శ్రీకృష్ణభగవాను డింతవఱకు అర్జునునకు గావించిన ఆధ్యాత్మిక హితబోధచే అర్జునుని మోహము (అజ్ఞానము) తొలగిపోయినది. ఏ అవివేకమువలన మొట్టమొదట ఈ దృశ్యజగత్తు నిత్యమని, ‘ఈ బంధువులు నావారని’ ‘ఈ దేహము నేన’ని అర్జునుడు తలంచుచు తత్ఫలితముగ దుఃఖమునొందుచుండెనో ఆ అవివేకమిపుడు భగవానుని అధ్యాత్మప్రసంగమువలన తొలగిపోయినది. గీతాబోధ యింకను పూర్తి కాలేదు. 10 అధ్యాయములు మాత్ర మైనది. ఇంకను 8 అధ్యాయములు బాకీయున్నవి. అయినను ఇంతమాత్రపు బోధచేతనే అర్జునునకు చిత్తోపరతి, జ్ఞానప్రాప్తి, తత్ఫలితముగ మోహోపశమనము సంభవించినది. ఈ విషయమును అర్జునుడు ‘మోహోఽయం విగతోమమ’ (నా అజ్ఞానము అంతరించినది) - అను వాక్యముద్వారా స్పష్టముగ ఒప్పుకొనెను.
అర్జునుడు భవరోగముచే పీడితుడగుచుండెను. శ్రీకృష్ణపరమాత్మయను వైద్యుడు గీతామృతమను ఔషధము నొసంగిరి. అద్దాని నొకింతమాత్రమే అర్జునుడు సేవించెను. పూర్తిగాకాదు. అయినను ఆ రవ్వంతమందుతోనే అర్జునుని రోగము (మోహమను వ్యాధి) పూర్తిగ నయమయ్యెను. దీనినిబట్టి ఆ వైద్యుడెంతగొప్పవాడో, ఆతడిచ్చిన ఆ మందు ఎంతపటుతరమైనదో స్పష్టమగుచున్నది. ఔషధముయొక్క శ్రేష్ఠత్వము వ్యాధినివారణపై ఆధారపడియుండును. వ్యాధి తొలగనిచో ఆ ఔషధము శ్రేష్ఠమైనది కాదని యర్థము. ఇచట గీతామృతభేషజమును దాదాపు సగముసేవించినంతనే ఫలితము వెంటనే అర్జునునియందు కానబడినది. ఆతని అజ్ఞానరోగము, భవరోగము పటాపంచలైపోయినది. శ్రీకృష్ణ పరమాత్మ సామాన్యులుకారు. యోగిరాట్, యోగీశ్వరులు. వారు బోధించిన అధ్యాత్మబోధయు సామాన్యమైనదికాదు. అది
(1)మహాశ్రేష్ఠమైనది (పరమం),
(2) అతిరహస్యమైనది (గుహ్యమ్) - అని అర్జును డిచట దానిని గూర్చి పలికెను. ఏలయనగా అద్దాని ప్రభావముచే ఆతని హృదయమందు ప్రత్యక్ష ఫలితము కానుపించినది. అంధకారము తొలగినది. ప్రకాశమావిర్భవించినది.
ప్రపంచములో ఎన్నియో విద్యలు కలవు. కాని అవియన్నియు హృదయాంధకారవినాశమందు సమర్థములుకావు. భవరోగనివారణమందు శక్తివంతములు కావు. కాని ఈ అధ్యాత్మబోధ అట్టిది కాదు. ఇది జననమరణ దుఃఖప్రవాహము నుండి జీవుని ఉద్ధరించి దరికి జేర్చునది. కనుకనే అర్జును డిద్దానిని ‘పరమమ్’ (మిగుల శ్రేష్ఠమైనది) అనియు,‘గుహ్యమ్’ (అతిరహస్యమైనది) అనియు పేర్కొనెను. అయితే యిట్టి మహత్తరమైన విద్యను గురువులు అందఱికిని చెప్పరు. ఎవరు అధికారులో,అర్హులో, ఎవరియందు వారికి అనుగ్రహము కలుగునో (‘మదనుగ్రహాయ’), ఎవరు నిర్మలభక్తితో గూడియుందురో- అట్టివారికి మాత్రమే గురువులు బోధించుదురు. ఇట అర్జునుడట్టి యోగ్యతలు గలిగియుండెను. కావున ఆతనిపై భగవానునకు అనుగ్రహముగలిగి అతనికీ పరమపావనమగు అధ్యాత్మవిద్యను ఉపదేశించిరి. ‘మదనుగ్రహాయ’ అను పదముచే అధ్యాత్మవిద్యాపరిగ్రహణమున గురువుయొక్క అనుగ్రహము శిష్యునకు అత్యావశ్యకమని తేలుచున్నది.
భుజించువానికి త్రేపువచ్చినచో కడుపునిండినట్లు గ్రహించుకొనవచ్చును. అనగా అతనికి తృప్తికలిగినదని యర్థము. అదియే దానికి గురుతు. అర్జునుడు గీతామృతమును తనివితీర పానము చేయుచుండెను. 10 అధ్యాయములు వినినంతనే అతనికొక త్రేపువచ్చెను. “మోహోఽయం విగతోమమ” (నా అజ్ఞానము శమించినది) అను వాక్యమే ఆ త్రేపు. మఱల 18వ అధ్యాయమున ‘నష్టోమోహః స్మృతిర్లబ్ధా’ అను వాక్యమును పలుకుటద్వారా తన పరిపూర్ణసంతృప్తిని ఈ ప్రకారమే మఱియొకసారి వెల్లడింపగలడు.
ప్ర:- అధ్యాత్మవిద్య యెట్టిది?
ఉ:- (1) సర్వోత్కృష్టమైనది
(2) అతిరహస్యమైనది.
ప్ర:- దాని ప్రభావమెట్టిది?
ఉ:- అది జీవుల అజ్ఞానమును, సంసారవ్యామోహమును నశింపజేయును.
ప్ర:- శ్రీకృష్ణమూర్తి అద్దానిని అర్జునుని కేల బోధించెను?
ఉ:- అతడు సర్వవిధముల తచ్ఛ్రవణమునకు భక్త్యాదులచే యోగ్యతను బడసెను. కనుక అతనిపై అనుగ్రహముకలిగి దానిని బోధించెను.
ప్ర:- ఆ బోధ అర్జునునకు ఫలించెననుట గురుతేమి?
ఉ:- దానిని వినిన వెంటనే ‘నా అజ్ఞానము శమించినది’ అని యతడు పలికెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి