శు భో ద యం🙏
గోపబాలునిగా కృష్ణయ్య
మ: "శ్రవణోదంచిత కర్ణికారములతో స్వర్ణాభ చేలంబుతో
నవతంసాయిత కేకి పింఛకముతో నంభోజదామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబుఁ బూరించుచు
న్నువిదా ! మాధవుఁ డాలవెంట నవమందొప్పారెడిం జూచితే.
భాగవతము:దశ:స్కం- 769 పద్యము: బమ్మెర పాతన !
సాహిత్య పిపాస గల భావుకులను తన్మయ పరచే సన్నివేశాలు భాగవతంలో కోకొల్లలు. అందులో నొకటి
బాలగోపాలుని బృందావిహారం. గోపాలునిగా మోహన వంశీధరునిగా విలసిల్లే గోపాలకృష్ణుని ముగ్ధమనోహర రూపం ఈపద్యంలో
పోతన కవితాచిత్రంగా చిత్రించి మనకళ్ళకు కట్టించాడు.
.
కర్ణికారమంటే కొండగోగు పూవు . చెవిలో కొండగోగుపూవు నలంకరించుకున్నాడట. అప్పటి షోకది. ఇప్పుడైతే అది వెక్కిరింపు. బంగరుచేలం ధరించాడట.కలవారిబిడ్డ .యెంత డాబుగా ఉంటాడో అంతగానూ ఉన్నాడు. శిరస్సు పైన తురాయిగా
నెమలి పిఛాన్ని ధరించాడట. మెడలో తామరపూలమాల. చేతిలో మోహన మురళి . దాన్ని పెదవులకాన్చి వేణుగానం చేయుచున్నాడట. ఆవులు తన్మయంతో వింటూ మోరలెత్తి చూస్తున్నాయట.
చూడవే చూడు. కిష్ఠయ్య యెంత అందంగా ఉన్నాడో! అంటూ గోపికలు ఆనందాశ్చర్యములతో
బాలగోపాలుని చూచి ముచ్చట పడుచున్నారట. వింటున్న మనకే యెంతో ముచ్చటగా ఉంటే మరివారు ముచ్చట
పడటంలో వింతేముంది?
లీలా శుకులవారు శ్రీకృష్ణకర్ణామృతంలో ఈఘట్టాన్ని చాలామనోహరంగా వర్ణించారు. అదికూడా విందాం.
శ్లో: మన్దం మన్దం మధుర నినదైః వేణు మాపూరయంతం /
బృందం బృందావనభువి గవాం చారయంతం చరతం /
ఛందోభాగే శతమఖ మఖ ధ్వంసినాం దానవాణాం /
హంతారమ్ తం కథయ రసనే! గోపకన్యా భుజంగం//
మెల్ల మెల్లగా వేణువు నూదుతూ మంద మందలుగానున్న గోవులను ముందుకు తోలుతూ తాను వాటివెనుక అడుగులు వేయుచు (యజ్ఙభాగాలు సరిపోక )దేవతల యజ్ఙాలను నష్టపరచు,రాక్షసుల సంహారి మురారి యెంత మనోహరంగా ఉన్నాడో! వర్ణించరాదటే ఓనాలుకా! ఆగోపకన్యావిటుని యందాన్ని వర్ణించు, అంటున్నాడు కవి.
ఇంత మనోహరమైన యీదృశ్యాన్ని అక్షరాలలో చదివిన మీరు కనులు మూసి తలపుల తలుపులు తీసి
మరోసారి దర్శించటానికి ప్రయత్నంచేయండి. అదే రసానందం!!!
స్వస్తి!🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి