14, డిసెంబర్ 2024, శనివారం

తిరుమల సర్వస్వం -87*

 *తిరుమల సర్వస్వం -87* 

*శ్రీ భగవద్రామానుజాచార్యులు-4*

విమానప్రదక్షిణ మార్గంలో ఈశాన్యదిక్కున యోగానరసింహస్వామి విగ్రహప్రతిష్ట చేయించి, నిత్యపూజా నివేదన కట్టడి చేశారు. వ్యాఖ్యానముద్రలో ఉన్న తన శిలావిగ్రహాన్ని స్వయంగా ఆలింగనం చేసుకొని, దానిని అనంతాళ్వార్ కు బహూకరించారు. ఈ విగ్రహం విమాన ప్రాకారంలోనే ఉన్న భాష్యకార్లసన్నిధిలో ప్రతిష్ఠించబడింది. ఈ మందిరంలో ఉన్న రామానుజులవారి పాదుకలు కల్గిన "శెఠారి" కి తన పేరు పెట్టుకొని రామానుజుల పట్ల తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నాడు ధన్యజీవి "అనంతాళ్వార్". 

*ఇతర సాంప్రదాయాలు* 

నమ్మాళ్వార్ విరచిత పాశురాల ద్వారా స్వామివారు పుష్పప్రియుడని తెలుసుకుని, తన శిష్యుడైన అనంతాళ్వార్ ను ప్రేరేపించి తిరుమలలో పుష్పకైంకర్యం కొనసాగింపు చేశారు. పుష్పమండపంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రంలో పుష్పాలన్నీ స్వామివారికి మాత్రమే చెందాలనే మహత్తరలక్ష్యంతో, కొండపై ఎవ్వరూ పువ్వులు ధరింపరాదని, పూజానంతరం కూడా ఆ నిర్మాల్యాన్ని ఎవ్వరికి ప్రసాదించకుండా, పూలబావిలో నిక్షిప్తమైవున్న భూదేవికి సమర్పించాలనే కట్టడి చేశారు. శ్రీవారి మరోభక్తుడు తిరుమలనంబిని శ్రీనివాసుడు *"తాతా"* అని పిలిచిన రోజుకు గుర్తుగా, ప్రతిసంవత్సరం జరిగే *"తన్నీరుముదు”* ఉత్సవానికి కూడా రామానుజులవారే శ్రీకారం చుట్టారు. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా *"తిరుప్పావై"* పఠనాన్ని, తోమాలసేవలో *"దివ్యప్రబంధ"* పారాయణాన్ని, ఇతర ఉత్సవ సమయాల్లో *"శాత్తుమురై"* గానాన్ని సైతం రామానుజులవారే ప్రవేశపెట్టారు.


అంతకు పూర్వం, బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగేవి కాదు. మొదటి రోజు ధ్వజారోహణ మాత్రం తిరుమలలో జరిపి, మిగతా ఉత్సవాలన్నీ తిరుచానూరులో జరిపించేవారు. కీకారణ్యంతో కూడుకున్న తిరుమలలో ఆ ఉత్సవాలకు కావలసిన సాధన-సంపత్తులు, వసతులు లేకపోవడమే దానికి కారణం. స్వామివారికి చెందిన ఉత్సవాలన్నీ తిరుమలలోనే జరగాలనే లక్ష్యంతో తిరుమల మాడవీధులను విశాలంగా తీర్చిదిద్ది, అర్చకులకు, జియ్యంగార్లకు ఆలయసమీపంలోనే నివాసగృహాలు ఏర్పరిచి, అప్పటినుండి తిరుమలలోనే బ్రహ్మోత్సవాలన్నీ జరిగేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల క్షేత్రం అంతా పూదోటలు ఏర్పాటుచేసి స్వామివారి నిత్యకైంకర్యాలకు పూలను విరివిగా ఉపయోగించే సాంప్రదాయాన్ని అమల్లోకి తెచ్చారు. ఆలయనిర్వహణ, కైంకర్యాదులు సజావుగా సాగడం కోసం రామానుజులవారు ప్రవేశపెట్టిన ఏకాంగివ్యవస్థ గురించి, తదనంతర కాలంలో అదే జియ్యంగార్ల వ్యవస్థగా మార్పు చెందటం గురించి ఇంతకుముందే తెలుసుకున్నాం. 

*రామానుజుల పేరిట ఉత్సవాలు* 

శ్రీనివాసునికి, ఆనందనిలయానికి, తిరుమల క్షేత్రానికి రామానుజుల వారందించిన అనిర్వచనీయమైన సేవలకు గుర్తుగా, ఈనాటికీ ఆనందనిలయంలో రామానుజుల వారి పేరున కొన్ని ఉత్సవాలు జరుగుతాయి. రామానుజుల జన్మనక్షత్రమైన "ఆర్ధ్రానక్షత్రం" నాడు జరిగే మాసోత్సవం గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. వైశాఖమాసంలో శ్రీరామానుజ జయంతి సందర్భంగా జరిగే పదిరోజుల ఉత్సవాల యందు, భాష్యకార్లసన్నిధిలో ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. స్వామివారి శేషహారతి, తీర్థ-చందనాలు రామానుజులవారికి ప్రసాదిస్తారు. 

*సంస్కరణలు* 

‌ అప్పట్లో కొందరికి మాత్రమే పరిమితమై ఉన్న వైష్ణవమతాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేస్తూ, సమాజంలోని అత్యున్నతస్థాయి నుండి అట్టడుగున ఉన్న వారందరికీ వైష్ణవమతాన్ని స్వీకరించే అర్హత కల్పించారు. హైందవ సంస్కృతికి గుళ్ళూ గోపురాలు ఆయువుపట్లని విశ్వసించిన శ్రీరామానుజులు, దేశం నలుమూలలా సంచరించి ఎన్నో వైష్ణవాలయాలను పునరుద్ధరించి వాటిలో నిత్యకైంకర్యాలకు శాశ్వత ఏర్పాట్లు చేశారు. అప్పటివరకు అస్తవ్యస్తంగా ఉన్న అర్చారీతులన్నింటినీ తీర్చిదిద్ది సక్రమమైన ఆలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అటువంటి క్షేత్రాల్లో శ్రీవేంకటాచలక్షేత్రం ప్రధానమైనది. 

మధ్వాచార్యులు ద్వైతమతానికి, ఆదిశంకరులు అద్వైతమతానికి కృషి చేసినట్లే, విశిష్టాద్వైత వ్యాప్తికి ఎంతగానో కృషి చేసిన రామానుజాచార్యులు, అనేకానేక ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా రచించారు. వాటిలో *శ్రీభాష్యం, గీతా భాష్యం, వేదాంతదీపం, వేదాంతసారం, శ్రీరంగగద్యం, శరణాగతిగద్యం, వైకుంఠగద్యం* ముఖ్యమైనవి. 

కలియుగ సంవత్సరం 4118, పింగళవర్షం, చైత్రమాసం, ఆర్ధానక్షత్రం, శుక్లపంచమి తిథి నాడు (ఏప్రిల్ 13, 1017 సం.), తమిళనాడులోని భూతపురంలో (నేటి శ్రీపెరంబుదూరు), ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి పుణ్యదంపతులకు జన్మించిన శ్రీమద్రామానుజులు, 120 వసంతాలు జీవించి; 1237 సం. లో, శ్రీరంగం నందు తుదిశ్వాస విడిచారు. (ఈ లెక్క ప్రకారం, క్రీ. పూ. 3101 సం. లో కలియుగం ప్రారంభమైనట్లు). అన్నమయ్య, రామానుజులను *"పలికేదైవం"* గా కీర్తించాడు: *గతులన్ని ఖిలమైన కలియుగమందును* *గతి యితడే చూపె ఘన గురు దైవము.* *వెలయించె నీతడె కా వేదపురహస్యము* *చలిమి నీతడే చూపె శరణాగతి* *నిలిపి నా డీతడె కా నిజముద్రాధారణము* *మలసి రామానుజులే మాటలాడే దైవము.*

 [ రేపటి భాగంలో... *పద్మావతీ - శ్రీనివాసుల పరిణయం* గురించి తెలుసుకుందాం] 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

కామెంట్‌లు లేవు: