*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*
*225 వ రోజు*
ధృతరాష్టుడు సంజయుని జయాపజయాలు వివరించమని కోరుట
ఆ పై ధృతరాష్ట్రుడు " సభ ముగించాడు. అందరూ వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న సంజయుని చూసి ధృతరాష్ట్రుడు " సంజయా ! నీకు ఇరు పక్షాలలో ఉన్న వీరు లందరూ తెలుసు. యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో చెప్పగలవా " అని అడిగాడు. సంజయుడు " దేవా! ఈ విషయం నన్ను అడగడం కన్నా గాంధారిని, మీ తండ్రి వ్యాసుని పిలిపించి అడగడం మంచిది " అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు " తన తండ్రి వ్యాసుని ధ్యానించాడు. గాంధారిని పిలిపించాడు. వ్యాసుడు సంజయుని ఛూసి " సంజయా! నీకు అన్నీ తెలుసు. నేను వినేలా ధృతరాష్టుని ప్రశ్నకు సమాధానం చెప్పు " అన్నాడు. సంజయుడు " ధృతరాష్టా ! నీవు కౌరవ పండవ సేనకు కల తారతమ్యం గురించి అడిగావు. పాండవ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు. మీ పక్షాన ఎవరున్నారు చెప్పు. పాండవుల బలం శ్రీకృష్ణుడే . సమస్త లోకాలు ఒక పక్కన శ్రీకృష్ణుడు ఒక పక్కన నిలిచినా శ్రీకృష్ణుడు గెలుస్తాడు. సత్యం, ధర్మం, న్యాయం ఎక్కడ ఉన్నాయో శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు. శ్రీకృష్ణుని ఆశ్రయించిన వారికి జయం తప్పదు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " సంజయా! కృష్ణుని గురించి నాకు తెలియక పోవడానికి నీకు తెలియడానికి ఏమి కారణం " అన్నాడు. సంజయుడు " లోకంలో విద్య అవిద్య అని రెండు ఉన్నాయి. అవిద్యతో అలమటిస్తున్న వారు తమో గుణంతో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని తెలుసుకో లేరు. విద్యా వినయ భూషితుడు తెలుసు కొనగలడు. ధృతరాష్ట్రుడు " విద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి వివరించు " అన్నాడు. సంజయుడు " దేవా ! ప్రతి మనిషికి సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. నేను వాటికి లోబడక పక్షపాత రహితంగా నిర్వికారంగా ఉండి పవిత్ర భావంతో ధర్మంగా ఉంటాను. అందువలన నేను విష్ణువును తెలుసు కున్నాను. నీకు గాని వేరెవరికైనా విష్ణువును తెసుకోవడానికి ఇది తక్క వేరు మార్గం లేదు. ఇందుకు భిన్నమైన దానిని అవిద్య అంటారు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " పక్కనే ఉన్న సుయోధనుని చూసి " నాయనా సుయోధనా ! సంజయుడు మన శ్రేయోభిలాషి. అతని మాట విని శ్రీకృష్ణుని ఆశ్రయించి నీవు నీ తమ్ములతో క్షేమంగా ఉండండి " అన్నాడు. సుయోధనుడు " తండ్రీ ! ఈ లోకాలు సర్వ నాశనం అయినా నేను ధైర్యం వదలను శ్రీకృష్ణుని శరణు వేడను " అన్నాడు. ధృతరాష్ట్రుడు నిర్వేదంగా " గాంధారి ! విన్నావా నీ కుమారుని మాటలు. వీడు దుర్మార్గుడు, నీతి బాహ్యుడు, గర్విష్టి, అసూయాద్వేహాలు కలవాడు నా మాట వినడు. వీడు చెడి పోతాడు. వీడికిక బ్రతుకు లేదు " అన్నాడు. గాంధారి " సుయోధనునితో " కుమారా సుయోధనా ! ఈ ఐశ్వర్యం, సంపద, రాజ్యం, నీ ఆయుషు ఎందుకు వదులు కుంటావు. దైవం భీముని రూపంలో నిన్ను చంపుతుంది. నీ లాంటి అవినీతిపరుడు ఎక్కడైనా ఉంటాడా ? " అన్నది. వ్యాసుడు " ధృతరాష్టు నితో " నీకు శ్రీకృష్ణుడంటే భక్తి అందుకే సంజయుని రాయబారిగా పంపావు. సంజయుని మాట విని శ్రీకృషుని ఆశ్రయించు. రాగ ద్వేషాలు వదిలి ఏకాగ్రతతో ఆరాధించిన వారికి శ్రీకృష్ణుడు చేరువ ఔతాడు. కామక్రోధాలతో అలమటించే వారికి అతను దూరంగా ఉంటాడు.అన్నాడు. ధృతరాష్ట్రుడు " మీరు చెప్పినట్లే చేస్తాను " అన్నాడు. ధృతరాష్ట్రుడు " శ్రీకృష్ణునికి వాసు దేవుడనే పేరు ఎలా వచ్చింది. సంజయుడు " శ్రీకృష్ణుడు అంతటా ఉంటాడు. సకల జగము అతనిలో ఉంటాయి కనుక అతనిని వాసుదే వుడంటారు. ఇందియ నిగ్రహంతో అతనిని ధ్యానిస్తే అతని వశం ఔతాడు. నీవు కూడా అన్ని చింతలు వదిలి అతనిని ధ్యానించు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " వ్యాసమహర్షీ ! నేను శ్రీకృష్ణుని శరణు వేడుతాను . శ్రీకృష్ణుని దివ్య మంగళ రూపాన్ని దర్శింప లేను. నిరంతరం కృష్ణుని సన్నిధిలో ఉండే వారు ఎంతటి పుణ్యాత్ములో కదా " అని విచారించాడు. అంతట వ్యాసుడు నిష్క్రమించాడు. దుర్యోధనుడు, గాంధారి, సంజయుడు తమ తమ నివాసములకు వెళ్ళారు.
*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము సమాప్తం*
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి