🙏అల్లసాని వారి ఆశీర్వాదం!
పె ద్ద న గా రు
ఆంధ్రభోజుడని ప్రసిధ్ధిగాంచిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి.రాయల అష్టదిగ్గజ కవులలో ఐరావతమై"ఆంధ్రకవితాపితామహునిగా ప్రణుతిగన్నమహాకవి.
మార్కండేయపురాణాంతర్గతమైన
మనుసంభవంబను చిన్నకథను ఆధారముగాగొని దానిని అష్టాదశవర్ణనలతో విస్తరించి మనుచరిత్రమను మనోహరమైన ప్రబంధమునునిర్మించెను.ఆ మనుచరిత్రమే
మనతెలుగుసాహిత్యమున తొలిప్రబంధము.
నన్నయను బోలిన కథానిర్మాణదక్షత
తిక్కన వంటి రసోచిత చిత్రణము.
శ్రీనాధుని వంటి నిరాటంకమైనకవితాధార,కథాకథనమున నేర్పు.నర్ణనలో నల్లికజిగిబిగి, పెద్దన ప్రత్యేకతలు.
కావ్యారంభమున మంగళాచరణమును సేయుచు నతడు చెప్పినపద్యమిది.
"శ్రీ వక్షోజకురంగనాభమెదపైఁజెన్నొందవిశ్వంభరా
దేవిన్దత్కమలా సమీపమున బ్రీతిన్నిల్పినాడోయనం
గావందారు సనందనాది నిజభక్తశ్రేణికిన్దోచు రా
జీవాక్షుండుగృతార్ధుసేయు శుభదృష్టిం గృష్ణరాయాధిపున్.
మనుచరిత్రము-అవతారిక-పెద్దన,!
భావము:పాలసంద్రమున పవ్వళించిన పరమాత్ముడు విష్ణుమూర్తి
నిద్రనుండి మేల్కకొనినాడు.దర్శనమునకై సనందనాదులు కాచుకొనియున్నారు.ఎట్టకేలకు జయవిజయులు వారిననుగ్రహించినారు.వారికి పరమాత్మదర్శనమైనది.
ఆవిష్ణుదేవుని యురమున కస్తురియంటియున్నది.అదిశ్రీరమవక్షోజ
సంస్పర్ళాలబ్ధమైనది.దానిని గాంచినంత మ్రొక్కుటకువచ్చిన
సనందనాదులకు.పరమాత్ముడు శ్రీదేవి,భూదేవులను తనవక్షస్సీమనలంకరించినాడా యనుభ్రమగలిగినదట!
అట్టి రాజీవాక్షుడు కృఆష్ణరాయనిశుభదృష్టితో కృపజూచునుగాక!
అని యాశీర్వచనము.
ఆలంకారిక మర్యాద ననుసరించి కావ్యారంభము నాశీర్వాదపురస్సరముగాజరిగినది.
అలంకారము భ్రాంతిమంతము.
రాయలకు తిరుమలదేవి,చిన్నాదేవి
యనురాణులిరువురుగలరు.అతడు దక్షిణనాయకుడు.కావున వరదాయియైన విష్ణువునుగూడ దక్షిణ నాయకునిగా పెద్దనచిత్రించినాడు.
మనుచరిత్రమున కథయంతయు
భ్రాంతితోనే నడచును,మాయాప్రవరుడు వరూధునుల ప్రణయము, సంసారాదులు భ్రాంతిలోనేజరుపబడనున్నవి.తత్సూచనకై భ్రాంతి మంతమను నలంకారముతో
కావ్యార్ధసూచన చేయుచు పెద్దన తన కావ్య నిర్మాణ దక్షతనుగూడ, వెల్లడించి నాడని విజ్ఞులయభిప్రాయము.
స్వస్తి!
🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి