15, జనవరి 2025, బుధవారం

తిరుమల సర్వస్వం 119-*

 *తిరుమల సర్వస్వం 119-*

*తాళ్ళపాక అన్నమాచార్యుడు 7*


 *రచనాశైలి* 


 అన్నమయ్య లెక్కకు మిక్కిలిగా రచించి, గానం చేసిన సంకీర్తనల లోని పదాలను పరిశీలిస్తే - స్వచ్ఛమైన, సంస్కృతంతో మిళితం కాని, రాయలసీమ యాసలోని తెలుగుభాష కానవస్తుంది. ఆ ప్రాంత ప్రజల్లో ఆనాడు వాడుకలో ఉన్న సామెతలు, జాతీయాలు, పలుకుబడులు, ఊతపదాలు, నుడికారాలు - వీటన్నింటిని గమనించి వాటిని తన రచనల్లో ఒద్దికగా పొందుపరిచాడు. 


 అన్నమయ్య తన కృతుల్లో తరచూ వాడిన కొన్ని పదాలను వర్గీకరించి విశ్లేషించుదాం :


 తిండి పదార్థాలు - కంచం, కూడు, అంబలి, గంజి, చింతకాయ పచ్చడి, ఆవకాయ, కారం, పెరుగు, చద్ది, నూనెలు, వెన్న, ఉప్పు, అన్నం, చద్దన్నం వంటి పదాలను ఉపయోగించి ఆనాటి రాయలసీమ లోని గ్రామీణ జీవితానికి అద్దం పట్టాడు.


 ఆర్థిక, సామాజిక స్థితిగతులను – ఇల్లు, కొట్టం, చావిడి, మేడ, గుడిసె, వంటగది, చెంబు, గొడుగు, రోలు, రోకలీ, గడ్డపార - వంటి పదాలను ఉపయోగించడం ద్వారా తేటతెల్లం చేశాడు.


 వివాహవ్యవస్థ - బొమ్మలపెళ్లిళ్లు, పెండ్లికొడుకు, పెండ్లికూతురు, విడిదిఇల్లు, బాసికం, తాళిబొట్టు, పెళ్లిపీటలు, మంగళసూత్రం, తలంబ్రాలు, అక్షింతలు, హారతులు, కొంగుముడి; - నిశితంగా గమనిస్తే, నాడు అన్నమయ్య గ్రంథస్థం చేసిన వివాహ ఆచార వ్యవహారాలు; ఆరువందల సంవత్సరాల తరువాత ఈనాడు కూడా, అతికొద్ది మార్పులతో సజీవంగా ఉన్నాయి.


 కుటుంబవ్యవస్థ - మగువ-మగడు, భార్య-భర్త, అత్తా-కోడలు, బావ-మరదలు, తల్లిదండ్రులు, కొడుకు - కూతురు; ఇలా, - ఈనాడు ఎన్నెతే బంధుత్వాలను మనం కలిగివుంటామో, ఆనాడు కూడా అవే చుట్టరికాలు అంతకుమించి ఆప్యాయతాభిమానాలు వ్యక్తం చేయబడ్డాయి.


 మూగజీవాలు - గుర్రం, ఆవు, చిలుక, నెమలి, హంస, చీమ, తేలు, జింక, ఎద్దు - వంటి వన్యప్రాణులను తరచూ ఉటంకిస్తూ తన జంతు ప్రేమను తేటతెల్లం చేశాడు అన్నమయ్య.


 జానపదాలు - ఉయ్యాల, నలుగు, జోల, కోలాటం, గుజ్జనగూళ్ళు, తందనాలు, లాలిపాటలు, చందమామ, వెన్నెల, అలా అన్నమయ్య తన రచనల్లో ఆనాటి రాయలసీమ పల్లెటూరి సొగసులను ఒద్దికగా పొందుపరిచాడు.


 అన్నమయ్య - పామరులకు సైతం సరళంగా ఆకళింపు అయ్యే సాధారణ భాషతో కూడుకున్న రచనలనే కాకుండా, విద్వాంసుల కోసం ఛందోబద్ధ, వ్యాకరణ సహిత, క్లిష్టతరమైన పెక్కు గ్రంథాలను సైతం అలవోకగా రచించి తన పాండిత్య ప్రకర్షను చాటుకున్నాడు. వారి సంకీర్తనలతో పాటుగా ద్విపదలు, శతకాలు, దండకాలు, రగడలు, భజనలు, గీతాలు, వ్యాఖ్యానాలు; ఎన్నో, మరెన్నో కూడా ఉన్నాయి. అయితే భాష ఎటువంటిదైనా, ఏ పదం ఉపయోగించినా, స్థూలంగా దాని అర్థం ఏమైనా అంతర్లీనంగా ఉన్న ఇతివృత్తం మాత్రం శ్రీవేంకటేశ్వరుడే!


 ఇలా తన సాహిత్యసంపద నంతా ఆ శ్రీనివాసుణ్ణి వేనోళ్ళ కీర్తించడానికే వినియోగించాడు.


 1424వ సంవత్సరంలో ప్రారంభించి, 1503వ సంవత్సరం వరకు 80 సంవత్సరాల కాలం కొనసాగిన సాహితీప్రస్థానం ముగిసేనాటికి అన్నమయ్య 96 సంవత్సరాల వయోవృద్ధుడు. ఆ సుదీర్ఘకాలంలో సగటున ప్రతిరోజు - రెండు లేదా మూడు సంకీర్తనలను గానం చేశాడు. ఆయన చేసిన సాహితీసేవలను గుర్తించి ఆనాటి రాజాస్థానాలు, పౌరసంఘాలు ఆయనను – *సంకీర్తనాచార్య, ద్రావిడ ఆగమ సార్వభౌమ, పంచాగమచక్రవర్తి* - వంటి బిరుదులతో సత్కరించాయి. 


*నా నాలికపై నుండి నానా సంకీర్తనలు* 

*పూని నాచే నిన్ను పొగడించితివి* 

*వేనామాల విన్నుడా వినుతెంచ నెంతవాడ* 

*కానిమ్మని నీకే పుణ్యము గట్టితి వింతేయయ్యా!*


 అంటూ, తన పాండిత్యమంతా శ్రీనివాసుని కృపయే తప్ప తన స్వంతం కాదని వినమ్రంగా, కవితాధోరణిలో చాటిచెప్పాడు.



*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 

*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*



 *అన్నమాచార్యుని లోని సంఘ సంస్కర్త* 


 అన్నమాచార్యుని పేరు లేదా వారి కీర్తన వినగానే మనకు మొట్టమొదటగా స్ఫురణకు వచ్చేది శ్రీవేంకటేశ్వరుని పట్ల ఆయనకు ఉన్న అపారమైన భక్తి తత్పరతలు! అయితే అన్నమయ్య తన అసంఖ్యాకమైన కృతులలో స్వామివారిని అచంచలమైన భక్తితో కీర్తించడము సామాజిక స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించడమే గాకుండా; ఆనాడు సమాజంలో ప్రబలి ఉన్న సాంఘిక దురాచారాలను, అంధవిశ్వాసాలను, కులమత బేధాలను, జంతుబలులను, అంటరానితనాన్ని, స్త్రీ-పురుష వ్యత్యాసాలను, మూఢనమ్మకాలను నిర్ద్వందంగా తిరస్కరించాడు. శ్రీవేంకటేశ్వరుడు తన ఖడ్గంతో అసురులను దునుమాడి నట్లుగానే; వారి నందకఖడ్గ అంశతో జన్మించిన అన్నమాచార్యుడు, నాడు జనబాహుళ్యంలో వ్రేళ్ళూనుకుని ఉన్న సామాజిక రుగ్మతలను తన సమకాలీన స్పృహతో కూడిన సాహితీ ప్రకర్ష అనే పదునైన ఖడ్గంతో నిష్కర్షగా ఖండించాడు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: