సంక్రాంతిపండుగ శుభాకాంక్షలతో...
సీ॥
మకరాన పదమూని మాన్యతేజోమూర్తి
కాశ్యపేయుడు వెల్గ ఖ్యాతితోడ
ఉత్తరాయణకాల ముప్పతిల్లెననుట
శాస్త్రసమ్మతమయ్యె సన్నుతించ
పితృదేవతలగూర్చి పిండప్రదానముల్
తిలలుదకమ్ములు తీర్చిగూర్చ
కూష్మాండములదెచ్చి కూరగాయలతోడ
పప్పుసంబారముల్ బ్రాహ్మణునకు
గీ॥ పోషణాదికద్రవ్యాల పొత్తరీయ
పుణ్యదినమయ్యె వెలలేని పుణ్యమమరె
భావితరములకాదర్శపథమునయ్యె
ఠీవి సంక్రాంతిపర్వమ్ము ఠేవనలరె
సీ॥
ఆరుగాలముపడ్డ హాలికుకష్టమ్ము
ఫలితమిచ్చెను నేడు పంటయౌచు
హలము లాగినయెడ్లు ఫలముజూచుకదృప్తి
శ్రాంతిబొందెను నేడు సంతసించి
క్రొత్తపంటలతోడ కోరివంటలజేయ
క్రొత్తయల్లుళ్ళతో కూతులలరె
బావలు మరదళ్ళు బంధుసందోహాల
సరసభాషలతోడ సందడించ
గీ॥ పొంగె హృదయాలు క్షీరమ్ము పొంగినట్లు
చెంగుచెంగున గోవత్స చెలగినట్లు
వానకాలాన చాతకపక్షులట్లు
నిండుపండువ సంక్రాంతి నృత్యమాడె
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి