15, జనవరి 2025, బుధవారం

సుఖాలలో పొంగిపోరు,

 5.20

*న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ ।*

*స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః ।। 20 ।।*

न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् |

स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थित: || 20||


న, ప్రహృష్యేత్ — పొంగిపోరు; ప్రియం — ప్రియమైనది; ప్రాప్య — పొందినప్పుడు; న, ఉద్విజేత్ — కలత నొందరు; ప్రాప్య — పొందినప్పుడు; చ — మరియు; అప్రియం — అప్రియమైనది; స్థిర-బుద్ధిః — నిశ్చలమైన బుద్ధి; అసమ్మూఢాః — ధృఢంగా ఉండి (భ్రమకు లోనుకాక); బ్రహ్మ-విత్ — దివ్య జ్ఞానము పై గట్టి అవగాహన తో; బ్రహ్మణి — భగవంతుని యందు; స్థితః — స్థితులై.


*BG 5.20 : భగవంతుని యందే స్థితులై, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోనుకాకుండా ఉన్నవారు, ప్రియమైనవి జరిగితే/లభిస్తే పొంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే క్రుంగిపోరు.*


*వ్యాఖ్యానం*


ఈ శ్లోకంలో ఉన్న ఈ భాగం - సుఖాలలో పొంగిపోరు, దుఃఖాలకు క్రుంగిపోరు - అనేది బౌద్ధ మతంలో ఉన్న 'విపాసన' ధ్యాన ఆచారంలో ఉన్న అత్యున్నత ఆదర్శం. ఈ రకమైన స్పష్టత మరియు ఖచ్చితత్వం కలిగిన స్థితికి చేరుకోవటానికి కఠినమైన శిక్షణ తీసుకుంటారు; ఇది అంతిమంగా, సమత్వ భావన స్థితికి చేర్చి, అహంకారాన్ని అంతం చేస్తుంది. కానీ, భక్తిలో, మన చిత్తమును శరణాగతిగా భగవత్ అర్పితము చేసినప్పుడు, ఇదే స్థితిని సహజంగానే చేరుకుంటాము. 5.17వ శ్లోకం ప్రకారం, మన చిత్తమును భగవంతుని చిత్తముతో ఐక్యం చేసినప్పుడు, సంతోషాన్ని, బాధని భగవంతుని అనుగ్రహంగా స్వీకరిస్తాము. 

 ఒక చక్కటి కథ ఈ వైఖరిని విశదీకరిస్తుంది.  

  ఒకసారి ఓ అడవి గుర్రం ఒక రైతు పొలంలోకి వచ్చింది. ఆ ఊరి జనులు ఆ రైతుని అభినందించారు. అతను అన్నాడు, ‘అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు? అంతా ఆ భగవంతుని సంకల్పం.’ 

  కొద్ది రోజులయిన తరువాత, ఆ గుర్రం మళ్లీ అడవిలోకి పారిపోయింది. చుట్టుపక్కల వాళ్లు అతని దురదృష్టానికి జాలి పడ్డారు. అతను అన్నాడు, ‘అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు? అంతా ఆ భగవంతుని సంకల్పం.’  

  మరికొద్ది రోజులు గడిచాయి, ఒకరోజు ఆ గుర్రం తనతో పాటు ఇంకా ఇరవై గుర్రాలను తీస్కొని వచ్చింది. మళ్లీ ఊరి జనులు అతని అదృష్టానికి అబ్బురపడి అభినందించారు, అతను వివేకముతో అనుకున్నాడు ‘అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు? ఇదంతా ఆ భగవంతుని సంకల్పం.’ 

  కొన్ని రోజుల తరువాత ఆ రైతు కొడుకు ఒక గుర్రంపై స్వారీ చేస్తూ కింద పడి కాలు విరగగొట్టుకున్నాడు. చుట్టుపక్కల వారు తమ సానుభూతి చెప్పటానికి వచ్చారు. తెలివైన రైతు ఇలా చెప్పాడు, ‘మంచో, చెడో - ఇది భగవత్ సంకల్పమే.’ 

  మరి కొన్ని రోజులు గడిచాయి, రాజుగారి సైనికులు వచ్చి, అప్పుడే మొదలైన యుద్ధం కోసం, ఆ ఊరిలో ఉన్న యువకులందరినీ సైన్యంలో చేర్చుకోవటానికి తీసుకెళ్ళిపొయారు. ఊరిలో ఉన్న యువకులందరినీ తీసుకెళ్ళారు కానీ, ఆ రైతు కొడుకుని మాత్రం, వాడి కాలు విరిగిందని వదిలేసి వెళ్ళిపోయారు. 

  ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కలిగించే అవగాహన ఎమిటంటే, భగవంతునికి ప్రీతి కలిగించటంలోనే మన స్వీయ-ప్రయోజనం ఉంది అని. ఇది ఈశ్వర శరణాగతి దిశగా తీసుకెళ్తుంది, ఎప్పుడైతే మన స్వీయ-చిత్తం, భగవంతుని చిత్తముతో ఏకమైపోతుందో, అప్పుడు, సంతోషాలని, దుఃఖాలని కూడా ఈశ్వర అనుగ్రహంలా ప్రశాంతంగా స్వీకరించే సమత్వబుద్ధి పెంపొందుతుంది. ఇదే సర్వోత్కృష్ట స్థితిలో ఉన్నవాని లక్షణం.


ఒరిజినల్ ఇంగ్లీష్ మూలం ఇక్కడ చూడండి: https://www.holy-bhagavad-gita.org//chapter/5/verse/20

కామెంట్‌లు లేవు: