12-03,04-గీతా మకరందము
భక్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ|| నిర్గుణోపాసకులను గుఱించి ఒకింత చెప్పుచున్నారు -
యే త్వక్షరమనిర్దేశ్యం
అవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచిన్త్యం చ
కూటస్థమచలం ధ్రువమ్ ||
సంనియమ్యేన్ద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయః |
తే ప్రాప్నువన్తి మామేవ
సర్వభూతహితే రతాః ||
తా:- ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ నిగ్రహించి (స్వాధీనపఱచుకొని) ఎల్లెడల సమభావముగలవారై, సమస్తప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తిగలవారై, ఇట్టిదని నిర్దేశింప శక్యముకానిదియు, ఇంద్రియములకు గోచరముకానిదియు, చింతింపనలవికానిదియు, నిర్వికారమైనదియు, చలించనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించియున్నదియు నగు అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో, వారు నన్ను పొందుచున్నారు.
వ్యాఖ్య:- ఒకే పరమాత్మ సాకారముగను, నిరాకారముగను ఉండుటవలన, సగుణధ్యానమునకుగాని, నిర్గుణధ్యానమునకుగాని లక్ష్యము ఒకటియే అయియున్నది. శ్రద్ధతోను, నిర్మలభక్తితోను ఏ ప్రకారము ధ్యానించినను జనులు పరమాత్మనే చేరుదురు. ఈ రెండు శ్లోకములందును నిర్గుణపరబ్రహ్మమును ధ్యానించువారిని గుఱించి చెప్పబడినది. ఇందు మొదటి శ్లోకమున బ్రహ్మమును గూర్చిన విశేషణములున్ను, రెండవ శ్లోకమున బ్రహ్మప్రాప్తికి వలసిన శీలసంపత్తియు తెలుపబడినది. సాధకుడు సాధ్యవస్తువగు పరమాత్మను ధ్యానించుచున్నప్పటికిని, హృదయశుద్ధిలేనిచో, ఇంద్రియనిగ్రహము గల్గియుండనిచో, ప్రాణికోట్ల యెడల దయలేనిచో ఆ ధ్యానము చక్కని ఫలితము నొసంగజాలదు. అట్టి వానికి బ్రహ్మానుభూతి కలుగుట దుస్తరము. ఆతని ఉపాసన కళాయిలేని పాత్రలోవండిన పప్పుపులుసువలె నుండును. వస్తువులన్నియు మంచివి అయినను పాత్ర శుద్ధముగా లేనిచో ఆ పులుసెట్లు చిలుమెక్కిపోయి నిరుపయోగమగునో, అట్లే హృదయశుద్ధి, ఇంద్రియనిగ్రహము, భూతదయ మున్నగు పవిత్రగుణములులేక భగవంతుని నిరాకారముగగాని, సాకారముగగాని యెట్లు ఉపాసించినను పూర్ణఫలితము కలుగదు. కనుకనే గీతాచార్యులు ధ్యానశీలురను హెచ్చరించుటకు కాబోలు, ధ్యాతకు వలసిన మూడు గొప్ప సుగుణములను ఇచట నిర్గుణబ్రహ్మోపాసనాఘట్టమున పేర్కొనిరి. అవి ఏవియనిన -
(1) ఇంద్రియ సమూహమును లెస్సగ అరికట్టుట (సంనియమ్యేన్ద్రియగ్రామం)
(2) ఎల్లెడల సమభావము గలిగియుండుట (సర్వత్రసమబుద్ధయః)
(3) సమస్తప్రాణులకు హితమునాచరించుట (సర్వభూతహితేరతాః)
కాబట్టి ముముక్షువులు ధ్యానాదులను సల్పుచు ఈ సుగుణత్రయమును బాగుగ అలవఱచుకొనవలెను. ఇచట ‘నియమ్య’ అని చెప్పక ‘సంనియమ్య’ అని చెప్పుటవలన ఇంద్రియములను ఒకింత నిగ్రహించిన చాలదనియు, లెస్సగ నిగ్రహించవలెననియు, ‘సర్వత్ర’ అని పేర్కొనుటవలన సమస్తప్రాణులందును, లేక ఎల్లకాలమందును సమభావము గలిగియుండవలెననియు, ‘సర్వభూతహితేరతాః’ అని చెప్పుటచే ఏ ఒకానొక ప్రాణియెడల దయగలిగియుండుట చాలదనియు, సమస్త ప్రాణికోట్లయెడల ప్రేమ, దయ, ఉపకారబుద్ధి గలిగియుండవలెననియు స్పష్టమగుచున్నది. ఈ ప్రకారములగు సుగుణములుగల్గి పరమాత్మను ధ్యానించుచో వారు తప్పక ఆ పరమాత్మను జేరగలరని ‘తే ప్రాప్నువన్తి’ అను వాక్యముచే భగవానుడు నిశ్చయపూర్వకముగ తెలుపుచు సర్వులకును అభయమొసంగుచున్నారు. కావున భగవద్ధ్యానపరుడు పైమూడు సుగుణములలు తనయందున్నవా, లేవా యని పరీక్షించుకొనవలయును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి