*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*
*257 వ రోజు*
*దుర్యోధన ధృష్టద్యుమ్నుల పోరు*
ధృష్టద్యుమ్నుడు సుయోధనునిపై శరవర్షం కురిపించాడు. సుయోధనుడు వాటినిమధ్యలోనే త్రుంచి ధృష్టద్యుమ్నునిపై అతి క్రూరమైన బాణప్రయోగం చేసాడు. ధృష్టద్యుమ్నుడు కోపించి సుయోధనుని విల్లు విరిచాడు అతడు మరొక విల్లు తీసుకునే లోపే దానిని కూడా త్రుంచి వేసి అతడి రథాశ్వములను చంపి, రథం విరుగ కొట్టాడు. సుయోధనుడు తన కరవాలము తీసుకుని నేలపై దుముకి ధృష్టద్యుమ్నిపై దూకాడు. అంతలో శకుని వచ్చి సుయోధనుని తన రథం పై ఎక్కించుకుని వెళ్ళాడు. సాత్యకి అలంబసునిపై అతి క్రూర బాణ ప్రయోగం చేసాడు. అలంబసుడు సాత్యకిపై అర్ధ చంద్రాకార బాణ ప్రయోగం చేసి సాత్యకి విల్లు విరిచి, అతడి శరీరాన్ని శరములతో తూట్లు చేసాడు. అప్పుడు సాత్యకి ఇంద్రాస్త్రం ప్రయోగించి అలంబసుని మాయలు మటుమాయం చేసి అలంబసుని ముప్పతిప్పలు పెట్టి సింహ నాదం చేసాడు. అలంబసుడు అక్కడి నుండి పారి పోయాడు. సాత్యకి కురు సేనలపై విరుచుకు పడ్డాడు. కృతవర్మ భీమసేనునితో పోరు సల్ప సాగాడు. భీముడు కృతవర్మ రథాశ్వములను చంపి, సారథిని చంపి, రథమును విరుగకొట్టి కృతవర్మ శరీరమంతా బాణములతో ముంచెత్తాడు. కృతవర్మ వృషకుని రథం ఎక్కి అక్కడి నుండి వెళ్ళాడు. భీమసేనుడు కృతవర్మను వదిలి కురు సేలపై విరుచుకుబడ్డాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు " సంజయా ! నువ్వు ఎప్పుడూ కౌరవ సేనల రధములు విరిగాయి, కౌరవులు చచ్చారు అని మన వారి వినాశనం గురించి చెప్తావు పాండవ సేనలో వినాశనం జరగ లేదా ? ఎప్పుడూ వారి విజయులైనట్లు చెబుతావేమి ఇదేమి మాయ " అని వాపోయాడు. సంజయుడు " మహారాజా ! కౌరవ సేనలు కూడా వారి శక్తివంచన లేకుండా పోరుతున్నాయి. కాని సముద్రంలో కలసిన నదుల వలె దాని స్వరూపం మారి పోతుంది పాండవ బలమునకు తాళ లేక పోతున్నారు. అది వారి తప్పు కాదు నువ్వు నీ కుమారుడు చేసిన తప్పుకు వారిని నిందించి ప్రయోజనం లేదు " అన్నాడు. అవంతీ దేశాధీసులగు విందాను విందులను యుధామన్యుడు శరపరంపరతో కప్పేసాడు. అనువిందుడు విందుని రథం ఎక్కాడు. యుధామన్యుడు అనువిందుని రథ సారథిని చంపాడు. రథాశ్వములు చెదిరి పోగా వారి సైన్యాలు కకావికలు అయ్యాయి. మరొక చోట భగదత్తుని ధాటికి పాండవ సేనలు చెదిరి పోగా ఘటోత్కచుడు అడ్డుకుని సేనలకు ధైర్యం చెప్పి యుద్ధోన్ముఖులను చేసాడు. ఘతోత్కచుడు భగదత్తునిపై శరవర్షం కురిపించాడు. భగదత్తుడు వాటిని మధ్యలోనే త్రుంచి వేసి పదు నాలుగు బాణములను ఘతోత్కచునిపై ప్రయోగించాడు. ఘటోత్కచుడు శక్తి ఆయుధమును ప్రయోగించగా భగదత్తుడు దానిని మధ్యలోనే త్రుంచి ఘతోత్కచునిపై బాణపరంపరతో నొపించాడు. భగదత్తుని ధాటికి ఆగలేని ఘతోత్కచుడు పారిపోగా భగదత్తుడు పాండవ సేనపై విరుచుకు పడ్డాడు. శల్యునిపై నకులసహదేవులు శరములు గుప్పించారు. శల్యుడు బెదరక నకులుని రథం విరిచాడు. నకులుడు సహదేవుని రథం ఎక్కి శల్యునిపై ఒక క్రూర బాణం వేసి అతడిని మూర్చిల్ల చేసాడు. శల్యుడు రథంపై పడి పోగానే సారథి రథాన్ని పక్కకు తీసుకు వెళ్ళాడు. నకుల సహదేవులు సింహనాదం చేసి శంఖనాదం చేసారు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి