15, జనవరి 2025, బుధవారం

సంస్కృత భాష స్థానం 🙏 నాల్గవ భాగము

 🙏ప్రపంచ భాషలలో సంస్కృత భాష స్థానం 🙏

                    నాల్గవ భాగము 

భారతదేశములోని యే ప్రాంతీయ భాషాసాహిత్యములోనైనను ప్రవేశించుటకు గాని గ్రంథరచనగావించుటకుగాని సంస్కృతభాషాజ్ఞానము తప్పనిసరిగా నుండదగినది. ఈ సంస్కృతప్రభావము ప్రాచీనరచనలలోను, అర్వాచీనరచనలలోను సమానముగానే యున్నది. ప్రాంతీయభాషాప్రత్యయములను తొలగించి సంస్కృత ప్రత్యయములను చేర్చుచో సంస్కృతభాషగానే మారిపోవు రచనలు నాడును నేడును గూడ సర్వ ప్రాంతీయభాషలలోను ఉన్నాయి. సంస్కృతపద భూయిష్టములైన రచనలే అన్ని ప్రాంతీయ భాషలలోను జనసామాన్యముచే ఆదరింప బడుచున్నవి. ఏగ్రంథములు సంస్కృత పదములను వాడరాదను అభిప్రాయముతో కవులచే రచింపబడినవో ఆ గ్రంథములే కృతిమములు గాను, కఠినములు గాను గన్పట్టుచున్నవి. ధారాళముగా సంస్కృత పదములు ప్రయోగింపబడిన గ్రంథములు జనసామాన్యమున కర్థమగుచున్నవి. కొన్నిపట్ల సంస్కృతపదభూయిష్ఠ రచనయు కఠినముగా నుండవచ్చును. కాని యా కాఠిన్యతనకు కారణము ఆపదములు సంస్కృత పదములై యుండుటకాదు. అట్టిపదములు సంస్కృతగ్రంథములలో నున్నను ఆ గ్రంథములు సంస్కృత పండితులకు కఠినముగానే యుండును. వానికి బదులుగా తేలికయైన సంస్కృతపదములు వాడబడుచో ఆ రచన తెలుగు గ్రంథములోనున్నను తేలికగనే యుండును. సంస్కృతగ్రంథములలోనున్నను తేలికగానే యుండును. కావున కాఠిన్య, సౌలభ్యములు ఆ ప్రయుక్తపదములకు సంబంధించినవే కాని భాషకు సంబంధించినవి కావు.


నేటి భారతీయ భాషాసాహిత్యములతో సంస్కృతమునకు గల గాఢసంబంధము గట్టిగా మనస్సునకు తట్టవలయునన్నచో అప్పుడప్పుడు జరుగుచుండు సర్వప్రాంతీయ కవిసమ్మేళనమములలో పద్యములను మనము వినవచ్చును. ఇంచుమించు అన్ని ప్రాంతీయభాషలలోను అవే సంస్కృత పదములు విననగును; భిన్నభారతీయ భాషలనడుమ ఎంత ఐక్యతకలదో స్పష్టముగ గోచరించును.


నేటి మన వ్యవహారరంగములోను, సాహిత్యరంగములోను సంస్కృతమెంత సన్నిహిత సంబంధమును గల్గియున్నదో, సంస్కృతాభ్యాసము పెరిగినచో ఈ ఉభయరంగములలోను మన భాషాపాటవ మెంతగా పెరుగునో, జాతీయజీవన మెంత సౌభాగ్య వంతముగానుండునో పై విచారణమువలన తెలియగలదు. నవయుగములో సంస్కృత పునరుజ్జీవము ప్రాంతీయభాషా పునరుజ్జీవములో నొక ముఖ్యభాగముగా భావింపవలయుననియు, సర్వప్రాంతీయ భాషలలోను సంస్కృతపదజాలము పెరుగుచున్న కొలదియు భిన్నభిన్న ప్రాంతములవారు పరస్పరము దగ్గరకు చేరుకొనుటకును, భారతీయులలో ఏకజాతీయభావము ఇతోధికముగా సునిరూఢమగుటకును దోహదమేర్పడుననియుకూడ దీనివలన స్పష్టమగుచున్నది.


మరొక విషయమేమనిన సంస్కృతము అత్యంత ప్రాచీన భాష యే కాదు. ఆ ప్రాచీనకాలము నుండి నేటివరకు నవనవోన్మేషముగా నిలబడియున్న భాష. ఉదాహరణకు షేక్స్ పియర్ మహానుభావుడు వ్రాసిన ఆంగ్ల నాటకము లో వాడబడిన భాష ఈరోజు వాడబడు ఆంగ్లభాష చాలావరకు మార్పు చెందినది., కానీ సంస్కృత భాష విషయములో చూచినచో క్రీస్తు శకం 5 వ శతాబ్దమున కాళిదాసు వ్రాసిన రఘు వంశము, కుమారసంభవాదులను ఈరోజు సంస్కృత అభ్యాస వ్యాసంగమున 1 వ తరగతి యని చెప్పదగిన శబ్దమంజరి యందలి ఒక ఇరువది శబ్దములను, ఒక పది సంధి సూత్రములను ఒక నాలుగు సమాసములను నేర్చిన ఎవరైనను తెలిసి కొన వచ్చును. "వాగర్థావివ సమ్ప్రుక్తౌ వాగర్థ ప్రతిపత్తయే" మొదలైన శ్లోకములను మనమందరమూ తెలిసి కొని యుండుట మన యనుభవము లోనిదే. ఆదికవి వాల్మీకి రామాయణమును కొద్ది పాటి శబ్ద జ్ఞానము సంధి జ్ఞానము లతో మనము తెలిసికొనుట అత్యంతము అద్భుతమైన విషయము. ఆంధ్ర సాహిత్యమున మనము చదువుకొను నన్నయ భారత కాలమే క్రీస్తు అనంతర 10 యవ శతాబ్ది. 1300 సంవత్సరముల పూర్వము వ్రాసిన "నుత జల పూరితమ్ములగు నూతులు నూరిటి కంటె ఒక్క బావి మేలు" అను పద్యము ను మనము ఏ సహాయము లేకనే అర్థము చేసికొనుచున్నాము అన్నచో ఈ 1300 సంవత్సరములనుండి లేదా 1800 సంవత్సరములనుండి మనవరకు తెచ్చిన గురువులకు ఋణ పడి యుందుము. ఎదర రాబోవు 2000 సంవత్సరములు లేదా అనంత కాలము వరకు ఈ సంస్కృత భాషా ప్రవాహమును నిరంతరాయముగా తీసుకొని పోవుట అందు కొరకు సంస్కృతమును తెలిసికొని ముందు తరములకు బోధించుట మన కర్తవ్యమయి ఉన్నది.

                          సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: