15, జనవరి 2025, బుధవారం

శ్రీ దత్త ప్రసాదం - 27

 శ్రీ దత్త ప్రసాదం - 27 - చిత్రపటాల మార్పు - రెండవ భాగము 



పాఠకులకు నమస్కారం! పోయిన భాగములో చెప్పిన విధంగా మన మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము గర్భగుడికి ఇరువైపుల ఉన్న పాత పటాలను మార్చే పనిని ఎందుకనో ఆ దత్తుని కృప వలన నేను సమర్ధవంతంగా నిర్వర్తించగలను అనే నమ్మకం నాకు ఏర్పడింది. అదే విషయాన్ని నాగేంద్రప్రసాద్ గారితో నేను చెప్పగానే, నాగేంద్రప్రసాద్ గారు , "మళ్ళీ అంత సహజంగా రాకపోవచ్చు అని నా ఆందోళన, అందుకనే ఇన్నినాళ్ళు వాటిని అలానే ఉంచాను" అని అన్నారు. అప్పుడు నేను, "సరే, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, ఇవే చిత్రపటాలను మరమ్మత్తు చేయడమో లేక కొత్తవి చేయించడమో చేస్తాను, కానీ నాది ఒక్క హామీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా, ప్రస్తుతం ఉన్న చిత్రపటాలలో ఉన్న సహజత్వాన్ని తీసుకొని రాలేకపోతే, ఉన్న వాటిని కదిలించను. అలానే, మీరు పూర్తిగా ఇష్టపడిన తరువాతే కొత్తవాటిని అక్కడ బిగిస్తాము" అని అన్నాను. దానికి నాగేంద్రప్రసాద్ గారు, "సరే నీ ఇష్టం" అని మాత్రం అన్నారు. 


ఇక అక్కడినుంచి నా పని మొదలయ్యింది, మొదట ఉన్న చిత్రపటాన్ని బాగు చేయించగలనేమో అని చాలా మందిని సంప్రదించాను. యతిరాజు గారు చిత్రాలను గీసింది ఒక చెక్క పలక మీద, ఇప్పుడు దాని మీద ఉన్న మచ్చలను చేరపలేము అని చేరిపేస్తే చిత్రం రూపు కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని, అనుభవమున్న వాళ్ళు తేల్చేశారు. అప్పుడు నా ముందు ఉన్న ఒకేఒక్క దారి, ఇవే చిత్రాలను డిజిటల్ పద్ధతిని ఉపయోగించి మళ్ళీ కొత్త చిత్రాల్లా తయారు చేయటం. దానికోసమని ఇద్దరు ముగ్గురు అనుభవమున్న డిజిటల్ చిత్రకారులను కలిసి, వారికి పాత చిత్రపటాల డిజిటల్ కాపీని ఇచ్చి, వాటి మీద వున్న మచ్చలను తొలగించి, శ్రీ స్వామి వారి రూపుని వెలికితీస్తే, వాటిని మళ్ళీ ప్రింట్ చేయించి ఫ్రేమ్ చేయిద్దము అని అప్పగించాను. 


మొదట గర్భగుడికి కుడి వైపున వుండే చిత్రపటం మీద మచ్చలను తీసేసి నాకు ఒక నమూనా పంపారు. ఫర్వాలేదు చిత్ర రూపు చెడిపోలేదు, కానీ కొన్ని చిన్న చిన్న మచ్చలు పోలేదు. నాగేంద్రప్రసాద్ ప్రసాద్ గారికి చూపగా, 'ఫర్వాలేదు, ప్రింట్కు వెళ్లొచ్చు, అయిన ఇది సులవే అని నాకు తెలుసు, అసలు పరీక్ష యతిరాజు గారు గీసిన చిత్రం దగ్గర ఉంది" అన్నారు. కానీ నేను ఆ చిత్రాన్ని ప్రింట్కు ఇవ్వలేదు. దానికి గల రెండు కారణాలు, ఒకటి, ఆ కుడివైపున ఉండే పాత చిత్రపటం మీద మచ్చలు కొన్ని ఇంకా అలానే ఉన్నాయి, అలానే రెండవది మచ్చలు తీసేసిన కొత్త చిత్రానికి కూడా నాగేంద్రప్రసాద్ గారు పూర్తిగా తృప్తి చెందలేదు అని నాకు అర్థమవ్వటం. నా లక్ష్యం పాత చిత్రపటాలు ఇన్నాళ్లు మనం మందిర గర్భగుడి ప్రాంగణానికి ఎంత శోభాని అయితే అందించాయో, అంతకు మించిన అందాన్ని ఈ కొత్త చిత్రపటాలు తీసుకురావాలి.


నా ప్రయత్నములో తదుపరి అడుగగా, ఒక డిజిటల్ పెయింట్ వేసే సంస్థను సంప్రదించాను, మొత్తము వివరం చెప్పి, వారు అడిగిన రేటుకు డబ్బులను సైతం పంపించాను. ఆ సంస్థ వారు కూడా మీకు నచ్చేవరకు మేము చిత్రాలలో ఎన్ని మార్పులైన చేస్తాము అని చెప్పారు. ఒక వారం గడించింది, ఆ సంస్థ వాళ్ళు రెండు చిత్రాలను మచ్చలు తీసేసాము అని చెప్పి నాకు మెయిల్ చేశారు. 


ఇక అటుపైన జరిగిన విశేషాలను వచ్చే భాగములో మీతో పంచుకుంటాను. అలానే, నమ్మిన భగవంతుని రూపుని భావించడములో కూడా ఎటువంటి రాజీ పడకూడదు అని భక్తులకు నేర్పగలిగిన మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని మీరందరూ, తప్పక దర్శించి తరించాలన్నది నా వ్యక్తిగత విన్నపము. 


సర్వం,

శ్రీ దత్త కృప 

రచన : పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)


----


-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632

కామెంట్‌లు లేవు: