8, ఆగస్టు 2021, ఆదివారం

అటుపుటు రటుం భణంతే !

 అటుపుటు రటుం భణంతే !

........................... .............................


అటుపుటు రటుం భణంతే ! ఈ పాదం తెలుగువాడిని కీర్తించిన శ్లోకంలోనిది. అటుపుటు రటుం అనే పదాలకు ప్రాకృత భాషలో అర్థవంతమైన భావముంది. తెలుగోడి గొప్పతనం గురించి ఉదాహరించుకొన్నాం కాబట్టి తెలుగుభాషను గురించి కూడా కొద్దిగా తెలుసుకొని అటుపుటు రటుం అంటే ఏమిటో తరువాత తెలుసుకొందాం.


జనని సంస్కృతంబు ఎల్లభాషలకు అని మననమ్మకం. అంటే మనం మాట్లాడుతున్న భారతీయభాషలన్ని సంస్కృతం నుండే పుట్టాయని ఆర్యోక్తి. నిజమే తెలుగులాంటి భాషలు సంస్కృతం నుండి పుట్టకపోయినా తమభాషలో మాటలో నుడికారంలో కావ్యంలో ఆ దేవభాషను జీర్ణం చేసుకొని పరిపుష్టమైనాయి.


కాకపోతే భాషా శాస్త్రజ్ఞులు మాత్రం దక్షిణాది భారతదేశంలో దాదాపుగా అన్ని భాషలుకూడా మూలద్రావిడము నుండే పుట్టాయని అభిప్రాయపడ్డారు.ఈ ద్రావిడాన్ని కాలానుగుణంగా ఉత్తర,మధ్య, దక్షిణ కుటుంబాలుగా విభజించారు.


ఉత్తర ద్రావిడంనుండి (1) బ్రాహుయి (2) మాల్‌తో (3) కూరుఖ్ భాషలు ఉద్భవించాయి. విచిత్రమేమిటంటే ఇప్పటికి అఫ్ఘనిస్థాన్ లోని బెలూచిస్థాన్ లో ఇంకా బ్రతికిబట్టకట్టేవుంది.


మధ్య ద్రావిడ భాషా కుటుంబంలో (1) గోండి(2) కొండ (3) కూయి (4) మండ (5) పర్జి (6) గదబ (7) కోలామీ (8) పెంగో (9) నాయకీ (10) కువి (11) తెలుగు భాషలను పేర్కొన్నారు.


దక్షిణ ద్రావిడం నుండి (1)తుళు (2) కన్నడం (3) కొడగు (4) తొద (5) కోత(6) మలయాళం (7) తమిళం ఏర్పడ్డాయని సూత్రీకరించారు.


కాబట్టి తెలుగుభాష కూడా ఇతర భాషలలాగా పాతదే. కాకపోతే తెలుగుభాష బాగా ఆర్వాచీనమని నిరూపించటానికి అక్షరరూప ఆధారాలు కొరవడ్డాయి.

అలా అక్షరరూపంలోనున్న తెలుగు కళమల్ల రాతిశాసనంలోనే మనం గుర్తించాం. 


కలమళ్ళ శిలాశాసనము కడప జిల్లా యర్రగుంట్ల మండలంలోని కలమళ్ళ గ్రామంలో ఉండేది. దీన్ని క్రీ.శ. 575లో రేనాటిచోళరాజు ధనంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించాడు. ఇందులో వారు అనే బహువచనం కనిపిస్తుంది. తొలి తెలుగు శాసనాలలో ఇది ఒకటి.


ఎరికల్ ముతురాజు అనేబిరుదుగల ధనంజయుడనే రాజు అంటూ ఈ శాసనం మొదలౌతుంది. మధ్యలో కొంత భాగం అసంపూర్ణంగా ఉంది. పంచమహాపాతకుడు అవుతారని చెబుతూ ఈ శాసనం ముగుస్తుంది. ఇందులో శకటరేఫను వాడారు.


మహారాజు, మహా రాజాధిరాజు, యువరాజు (దుగరాజు) అనే పదాలు రాజపదవులలో ఉండే వివిధ స్థాయీ భేదాలను తెలుపుతాయి. అలాగే ఈ శాసనంలో వాడిన ముత్తురాజు అనే పదం కూడా రాజు యొక్క స్థాయిని సూచిస్తుందని ఈ శాసనాన్ని పరిష్కరించిన ముట్లూరి వెంకటరామయ్య, ప్రొఫెసరు కె.ఎ.నీలకంఠ శాస్త్రి అన్నారు.


అయితే అమరావతి స్థూపంలో దొరికిన ఒక శాసనభాగంలో నాగబు అనే తెలుగుమాటను పెర్కొనడం జరిగిందని ఇదే మొదటి తెలుగుపదమని వేటూరి ప్రభాకరశాస్త్రి, ఆరుద్రగారలు అభిప్రాయపడ్డారు. అది నాగ - బు అనే తెలుగు మాట కాదు, నాగబుద్ధ అనే పేరని పేర్కొన్న ప్రబుద్ధులు కూడా వున్నారు.


కాని 

క్రీ.పూ.3000-2500 ఏళ్లనాటి శాసనాన్ని ఒకదానిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కన్నమడకలలో కనుగొన్నారు. ఈ శాసనంలో "అంధిర లోకము" అనే పదం ఉంది. దీని అర్థం "ఆంధ్ర లోకము". ఇదే మొదటి తెలుగు పదంగా పరిశోధకులు గుర్తించారు.


నాగబు(నాగంబు > నాగం > నాగుపాము) పదమా లేక అంధిరలోకమా? ఏది పాతదనే మాటను భాషాశాస్త్ర కోవిదులు తేల్చాలి.


తెలుగుభాష ఉనికికే పెనుప్రమాదం ఏర్పడిన ప్రస్తుతపరిస్థితులలో ఈ నిరూపణా కార్యాలు ఎంత వరకు సాధ్యం ! తెలుగుతల్లి నిను ఆ దేవుడే రక్షించాలి.


సాహిత్యరూపంలో నన్నయ వ్రాసిన మహభారత భాగాలే తెలుగులో మొదటివని మన ప్రగాఢవిశ్వాసం.


ఏదిముందో ఏదివెనుకో ఏది తలో ఏది తోకో తెలుసుకోవాటానికి నిధులు (Budget) కేటాయింపు జరిగేనా ?


పైన తెలుగువాడి అటుపుటుం రటుం గురించి చెప్పుకొన్నాం కదా ! అదేమిటో చూద్దాం.


తెలుగువారి పౌరుషం వ్యవహారం గురించి 892 ACE కాలానికి చెందిన ఉద్యోతనుడనే ప్రాకృతకవి పెర్కోవడం జరిగింది.

ఈయన వ్రాసిన కువలయమాల కథలో తనకాలంలోనున్న 18 దేశాలవారిని, వాళ్ళ భాషలను పెర్కొనడం జరిగింది. అందులో క్రింది శ్లోకంలో ఆంధ్రులగురించి ప్రస్తావించడం జరిగింది.


"పియ మహిళా సంగామే సుందరగత్తేయ భోయణే రోద్దే

అటుపుటు రటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి"


ఆంధ్రులు అందగత్తెలను యుద్ధరంగాన్ని కూడా సమానంగా ప్రేమిస్తారు. వీరు అందమైన శరీరాలు కలవారు. అటువంటి ఆంధ్రులు అటూ పుటు రటుం (అందరికి పెట్టండి, బహుశా భోజనం వడ్డించండి) అనుకొంటూ ఊరిలోనికి వస్తున్నారని పంచాజ్ఞుల ఆదినారాయణశాస్త్రిగారు తెనిగించారు.


(సేకరణ)

...............................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: