8, ఆగస్టు 2021, ఆదివారం

హనుమంతుని దివ్య చరిత్ర

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁హనుమంతుని దివ్య చరిత్ర

        బ్రహదేవుడు దేవతలను వెంట దీసుకుని వాయుదేవుని గుహ వద్దకు వెళ్ళాడు. తన పుత్రుని మ్రుత్యువు కారణంగా వాయుదేవుడు వ్యాకులచిత్తుడై ఉన్నాడు. అప్పటికి శిశువు దేహాన్ని తన చేతుల్లోకి ఉంచుకుని ఉన్నాడు. వాయుదేవుడు తనకు ప్రణామాలు చేసిన మీదట బ్రహ్మదేవుడు వాత్సల్యముతో తన హస్తాన్ని వానరశిశువు శిరస్సుపై ఉంచి తక్షణమే అతణ్ణి పునరుజ్జీవుతుడిని చేశాడు.

        తన పుత్రుడు పునరుజ్జీవించగానే వాయుదేవుడు సకల ప్రాణుల్లోనూ తన సంచారాన్ని పునరుద్ధరించాడు. దానితో ప్రాణులంతా తిరిగి ఆనందభరితులైనారు. అంతట బ్రహ్మదేవుడు సమావేశమైన దేవతలతో 'భవిష్యత్తులో ఈ శిశువు మీ శ్రేయస్సు కోసం పనిచేస్తాడు. అందువల్ల మీరంతా అతనికి వరాలు ప్రసాదించాలి' అని చెప్పాడు.

           బ్రహ్మదేవుని ఆదేశాన్ని విన్న ఇంద్రుడు తన పద్మహారాన్ని తీసి హనుమంతుని మెడలో వేశాడు. 'తన హనువు(దవడ) భగ్నమైన కారణంగా ఈ శిశువును ఇక నుంచి హనుమంతుని గా పేరు గాంచుతాడు. ఇకమీదట ఇతను నా వజ్రాయుధానికి భయపడవలసిన పనిలేదు. ఎందుకంటే ఇతనిమీద దాని ప్రభావం పని చేయదు' అని ఇంద్రుడు ప్రకటించాడు.

         సూర్యుడు 'ఇందుమూలంగా నా తేజస్సులో ఒక శాతాన్ని హనుమంతునికి ప్రధానం చేస్తున్నాను. అంతేగాక ఇతనికి పరిపూర్ణమైన వేదశాస్త్ర పరిజ్ఞానాన్ని, అద్భుతమైన వాక్పటిమను కూడా ప్రసాదిస్తున్నాను'అని ప్రకటించాడు.

         అంతట యమధర్మరాజు' హనుమంతుణ్ణి నా మ్రుత్యుదండము ఏమీ చేయదని, ఏ వ్యాధిగాని అతనికి సోకదని ఇందుమూలంగా వరమిస్తున్నాను' అన్నాడు.

        కుబేరుడు' నా గద హనుమంతునిమీద ప్రభావం చూపకుండుగాక! అతను యుద్ధంలో ఎన్నటికీ అలసట చెందకుండుగాక'అని ప్రకటించాడు.

        పరమశివుడు హనుమంతునికి ఎన్నటికీ నావల్ల గానీ, నా ఆయుధాలు వలన గానీ మరణం లేకుండా వరమిస్తున్నాను' అన్నాడు.

        విశ్వకర్మ 'నాచేత రూపొందించిన ఏ ఆయుధం వల్ల గానీ మ్రుత్యువు కలుగకుండా హనుమంతునికి వరమిస్తున్నాను' అని ప్రకటించాడు.

        చివరగా బ్రహ్మదేవుడు' నేను హనుమంతునికి దీర్ఘాయువును, ఔదార్యాన్ని ప్రసాదిస్తున్నాను. బ్రహ్మాస్త్రంగాని, బ్రాహ్మణులు శాపాలుగాని అతనిమీద ప్రభావం చూపకుండా వరమిస్తున్నాను'అన్నాడు.

         అంతట బ్రహ్మదేవుడు వాయుదేవుని తో' ఈ బిడ్డ తాను కోరుకున్న విధంగా తన రూపాన్ని మార్చుకోగల కామరూపి మరియు అజేయుడు అవుతాడు. తాను కోరుకున్న ఏ చోటు కైనా తాను తలచుకున్న ఎంత వేగంతో నైనా ప్రయాణించగలుగుతాడు. భవిష్యత్తులో రావణుని వినాశనానికి దోహదం చేయగల మహిమాన్వితమైన కార్యాలను చేస్తాడు. అలా అతను శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు'అని చెప్పాడు.

శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: