10, జులై 2021, శనివారం

మందార మకరంద

 

మందార మకరంద మాధుర్యము 

భాషావగాహన, భాషాభిమానం, పాండితీ గరిమ వున్న ప్రతి తెలుగు వాడి హృదయంలో ముద్రవేసుకున్న పద్యం అంటే పోతనామాత్యుని మందార మకరంద పద్య కుసుమమే అనుటలో లేశమైయినా అతిశయోక్తి లేదు.

 

మందార కుసుమాలలో మాధుర్యం ఉంటుందో లేదో మదుపాలకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ మన సాహితీ మదుపాలకు మాత్రం మాధుర్యాన్ని అందించిన మహానుభావుడు పోతనగారు.

 

మందారకుసుమం ఒక కంటికి ఇంపైన పుష్పం అందులో సందేహం లేదు నిజానికి మందారానికన్నా ఎన్నోరెట్లు అందమైన, సువాసనా భరిత, సుకుమారమైన  సుమములు ఎన్నో వున్నాయి కానీ పోతరాజు మందారాన్నే ఎంచుకున్నారు మాధుర్యాన్ని మనకు పంచారు. ఒక్క సారి సీస పద్యాన్ని అవలోకిద్దాము 

 

మందార మకరంద మాధుర్యమునఁ దేలు

మధుపంబు వోవునే మదనములకు?      

నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు

రాయంచ సనునె తరంగిణులకు

లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు

కోయిల చేరునే కుటజములకుఁ

బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక

మరుగునే సాంద్ర నీహారములకు

 

నంబుజోదర దివ్యపాదారవింద 

చింతనామృతపానవిశేషమత్త 

చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు

వినుతగుణశీల! మాటలు వేయు నేల?” 

ప్రతి పదార్ధము 

మందార = మందారము యొక్క; మకరంద = పూతేనె యొక్క; మాధుర్యమునన్ = తీయదనము నందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు = తుమ్మెద; పోవునే = వెళుతుందా; మదనముల = ఉమ్మెత్తపూల; కున్ = కు; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగము లందు; తూగు = ఊగెడి; రాయంచ = రాజ హంస; చనునె = పోవునా; తరంగిణుల్ = (సాధారణ) ఏరుల; కున్ = కు; లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాది = తినునది; = అయ్యుండి; చొక్కు = మైమరచెడి; కోయిల = కోయిల; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కుటజముల = కొండమల్లె, కొడిసెచెట్ల; కున్ = కు; పూర్ణేందు = నిండుజాబిల్లి; చంద్రికా = వెన్నల; స్పురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్లునా ఏమి; సాంద్ర = దట్టమైన; నీహారముల్ = మంచుతెరల; కున్ = కు; అంబుజోదర = నారాయణుని {అంబుజోదరుడుఅంబుజము (పద్మము) ఉదరుడు (పొట్టన గలవాడు), విష్ణువు}.

దివ్య = దివ్యమైన; పాద = పాదము లనెడి; అరవింద = పద్మముల; చింతనా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; పాన = తాగుటచే; విశేష = మిక్కిలిగా; మత్త = మత్తెక్కిన; చిత్తము = మనసు; = ; రీతిన్ = విధముగ; ఇతరము = వేరొంటిని; చేరన్ = చేరుటను; నేర్చున్ = చేయగలదా ఏమి; వినుత = స్తుతింపదగిన; గుణ = సుగుణములు గల; శీల = వర్తన గలవాడ; మాటలు = మాటలు చెప్పుట; వేయున్ = అనేకము; ఏలన్ = ఎందులకు.

 

భావము:

 

సుగుణాలతో సంచరించే గురూత్తమా! మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఎందుకు లెండి, హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు.”

 

 

 

కవిపుంగవుడైన చక్కటి కవిత చెప్పాలంటే ఒక మంచి ఉపమానం నుడవటం సర్వ సాధారణం. కానీ బహు ఉపమానాలు ఒక వస్తువిశేషాన్ని ప్రకటించటానికి చేయటం కేవలం పోతనగారికే చెందింది. అటు శబ్దాలంకారాలు, ఇటు అర్దాలంకారాలను గుప్పించి మెప్పించగల నేర్పరి, అతను పద్య శర ప్రయోగంలో నిష్ట్నాతుడైన కవి సవ్యసాచి అనదగునేమో 

సందర్భం:-

 

తండ్రి హిరణ్యాక్షుడుహరి గిరి అనకుఅన్నాడు. ప్రహ్లాదుడు నీతిశాలి కదా. గురువు చండామార్కులవారికి సమాధానం చెప్పాడు. వినుతగుణశీల అని సంబోధించాడు. సందర్భంలోది అమృత గుళిక. మాధుర్యానికే మాధుర్యం చేర్చే మధురాతి మధురమైన పద్యరత్న మిది మనసును మైమరిపింప జేసెడి మనందరి పోతన్న ఉత్తమోత్తమైన సీస పద్యం.   ప్రహ్లాదుడు తన తండ్రిని ఇలా సంబోధిస్తూ చెపుతున్నాడు. ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో విష్ణుదేవుని దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశించిపోతూ  ఉంటుంది నా మనస్సు. మరి మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్తపూల వైపు పోదుగదా. స్వచ్చమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగులు, వంకల దరి చేరదు కదా. తియ్య మామిడి లేత చిగుర్లు తిని పులకించి పాటలుపాడే కోకిల కొడిసిచెట్ల పైకి వెళ్ళదు కదా. నిండు పున్నమి వెన్నెలలో విహారాలు చేసే చకోర పక్షి దట్టమైన మంచు తెరల మాటుకి పోదుకదా. అలాగే ఇతర విషయాల పైకి నా చిత్తం వెళ్ళదు సుమా.


కామెంట్‌లు లేవు: