10, జులై 2021, శనివారం

జాతకం కుదిరింది కథ*

 క్రమసంఖ్య 137/2021



*జాతకం కుదిరింది కథ*


రచన - విజయలక్ష్మి తెలికచెర్ల


“ఒరేయ్, చాల్లేరా ఆ చీకటం! ఎంతసేపని చీకుతావు, ఆ వేలుని? చీకి చీకి వేలు సన్నగా అయిపోయింది. మూతి చూస్తే వంకర పోయింది. ఈ సంగతి తెలిస్తే నీకు పిల్లని ఎవరు ఇస్తారురా? ఇంక ఆపు ఆ చీకుడు!” అంది బామ్మ.


“నేనేమీ పెళ్లి చూపుల్లో చీకటం లేదు కదా?” అన్నాడు పండు, సంతోషం వచ్చినా, బాధొచ్చినా, తోచకపోయినా వేలు చీకే పండు.


“పెళ్ళిచూపుల్లో చీకకపోయినా, మనకి తెలిసిన వాళ్ళందరూ, ‘ఆ అబ్బాయా వేలు చీకుతాడు ఇప్పటికీ’ అని వెక్కిరిస్తారురా” అంది బామ్మ.


“పోనీలే బామ్మా, వెక్కిరిస్తే వెక్కిరించనీ. వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంక పెట్టి, తప్పించేస్తున్నావు కదే?” అన్నాడు ఏడుపు గొంతుతో పండుగాడు.


“ఓరి నీఅసాధ్యం కూలా! నింద నామీద వేస్తావా? నేను ఎక్కడ తప్పిస్తున్నానురా?” అంటూ ముక్కున వేలేసుకుంది బామ్మ.


“కాకపోతే మరేంటి? అమలాపురం అమ్మాయి ఎంత బాగుందో, ఒద్దని రాగాలు తీసి మరీ ముక్కు చీదింది నువ్వే కదా!” అన్నాడు పండుగాడు కోపంగా.


“అవునురా, వద్దన్నాను. ఆ అమ్మాయిది మఖ నక్షత్రం. మావగారి గండంరా. నా కొడుకు ప్రాణం మీద కొస్తుందంటే నేనెందుకు ఒప్పుకుంటాను?” అంది బామ్మ.


“నా స్నేహితులందరికీ పెళ్ళిళ్ళయి, పిల్లల తండ్రులు కూడా అయ్యారు. ఇంకా నాకే ఏదీ లేదు. అవును కానీ, విజయనగరం అమ్మాయికి ఎందుకు వద్దన్నావే బామ్మా?” అన్నాడు పండు.


“ఆ అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం. నాకయితే ఒకే, మరి నీ యిష్టం అని మీ అమ్మ తో అనగానే,


‘ఆశ్లేష అత్తగారి గండం. నేను ఛస్తే పీడ విరగడ అవుతుందని, మీరు ఆ సంబంధానికి ఒకే అంటున్నారు’ అంటూ మీ అమ్మ రాద్ధాంతం చేసిందిరా!” అంది బామ్మ.


“మరి మున్నంగి పిల్లని ఎందుకు వద్దన్నావు?” అంటూ మూలిగేడు పండు.


“మూలా నక్షత్రం ఆ పిల్లది. మూల మూలలా కొడుతుందనిరా” అంటూ మనవడిని బుజ్జగించింది బామ్మ.


“జగిత్యాల పిల్ల ఎంత బాగుంది. పెద్ద కళ్ళు, సొట్ట బుగ్గలతో జాంపండులా ఉంది. ఆమెని వద్దన్నావెందుకు?” అన్నాడు పండు కోపంగా.


“ఆ పిల్లది జేష్ఠ నక్షత్రం, ఇంటికి పెద్దది జేష్టురాలు. నువ్వేమో ఇంటికి పెద్ద, జేష్టుడివి. మూడు జేష్టలు ఒక చూరు కిందన ఉండకూడదురా నాన్నా! అందుకే ఆఅమ్మాయిని వద్దన్నాను.” అంది బామ్మ.


“విశాఖపట్నం అమ్మాయిది విశాఖ నక్షత్రం, విసిరి విసిరి కొడుతుందని వద్దన్నావు. నక్షత్ర మండలంలో ఉండే నక్షత్రాలన్నిటితో, నా పెళ్లి ముడిపెట్టి ఫుట్బాల్ ఆట ఆడించుతున్నావు.” అంటూ గఁయ్య్ మన్నాడు బామ్మ మీద పండు.


“అదేంటిరా, అలా అంటావు? శాస్త్రాన్ని తప్పు పట్టకూడదురా!” అంటూ ఓదార్చింది బామ్మ.


“నెత్తి మీద జుట్టంతా పలచన అయిపోయింది. అక్కడక్కడా వెండి వెంట్రుకలు కూడా తొంగిచూస్తున్నాయి మేము ఉన్నాం అంటూ, నాకు ఈ జన్మకి పెళ్లి అయే యోగం ఉన్నట్టు లేదు” అని మనవడు బాధ పడుతుంటే,


మనవడి మీద జాలేసింది బామ్మకి. చిన్నప్పుడు పండు గాడి విపరీతమైన అల్లరి భరించలేక, నోట్లో వేలు అలవాటు చేయించింది బామ్మ. స్కూల్లో పాఠాలు వినకుండా అటూ ఇటూ తిరుగుతూంటే, నోట్లో వేలుంచితే ఒకే చోట కూర్చుంటాడని, వేలు తియ్యనియ్యద్దని మాస్టర్లకి చెప్పింది కూడా బామ్మే. నోట్లో వేలు తీస్తే లోంగేవాడు కాదు. అలా స్కూల్, కాలేజ్ పూర్తి అయి ఇప్పుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు మనవడు. పండు ఇప్పుడు కూడా వేలు చీకుతుంటే నచ్చక అప్పుడప్పుడూ కసురుతుంది బామ్మ.


“బాధ పడకురా! మొన్ననే పంతులుగారిని కలిసాను. కల్యాణ యోగం త్వరలోనే ఉంది. మంచి ఈడు జోడు అయిన అమ్మాయితో మీ మనవడికి పెళ్ళవుతుంది అని చెప్పేరు!” అంది మనవడితో ఓదార్పుగా బామ్మ.


****


“అత్తయ్యా, ఈ ఫోటో చూడండి. అమ్మాయిది పాలకొండట. చాలా మంచి వాళ్ళు అని మా వదిన చెప్పింది. పిల్ల బాగుంది కదా ?” అంటున్న కోడలితో,


“పిల్ల బాగుండే సరికి మనం మురిసిపోయి, వాడికి చూపిస్తున్నాము. వాడు ఫోటో చూసి మనసులో ఫిక్స్ అయిపోయేక, మనం జాతకాలు పడలేదని, వద్దంటున్నాము. పాపం వాడి మనసు దెబ్బతింటోంది. ముందు జాతకాలు చూపించి, అన్నీ సరిపడ్డాకే వాడికి తెలియచేద్దాము.” అంది బామ్మ.


“మా వదిన పండు గాడి జాతక వివరాలన్నీ ఇచ్చిందిట ఆడపిల్ల వాళ్ళకు. జాతకం కూడా సరిపోయింది. మీకు ఇష్టమైతే ఎల్లుండి మాటలకి వస్తాము అన్నారత్తయ్యా వాళ్ళు.” అంది కోడలు.


అప్పుడే డ్యూటీ పూర్తి చేసుకొని లోపలకు వస్తున్న పండు బామ్మ చేతిలో ఫొటో చూసి,


“మళ్ళీ మరొక సంబంధమా?” అన్నాడు నిరుత్సాహంగా నోట్లో వేలేసుకొంటూ.


****


పండు గాడికి పెళ్ళి చూపులు అవటం, జాతకాలు పడటం జరిగింది. పిల్ల కాస్తా లావుగా ఉందని నీలిగేడు పండు.

“ఒళ్ళెక్కడ ఉందిరా? పిల్ల బొద్దుగా బంగిని పల్లి మామిడి పండులా ఉంది.” అని చెప్పి ఒప్పించింది బామ్మ.


పండుకి పెళ్ళి కుదిరింది. రోజూ డాబా ఎక్కి, నవారు మంచం మీద పడుకుని, నోట్లో వేలుపెట్టుకొని చీకుతూ, కాబోయే పెళ్ళాంతో కబుర్లు చెప్పుకుంటూ మురిసిపోయేవాడు.


“ఒరేయ్, పెళ్ళిలో మాత్రం నోట్లో వేలేసుకొని కూర్చోకు. నలుగురూ నవ్వుతారు” అని గట్టిగా మనవడికి ముందే హెచ్చరించింది బామ్మ.


ఆఖరికి అనుకున్న రోజు రానే వచ్చింది. ఆడ పెళ్ళివారు వాళ్ళ విశాలమైన సొంత ఇంట్లోనే పెళ్ళి ఏర్పాట్లు చేసేరు. పెళ్లి చక్కగా జరుగుతోంది. అందరూ అలిసిపోయారు. ఆ అలసటతో పండుకి వేలు చీకాలని మహా కోరికగా ఉంది. బామ్మవైపు ఒక్కసారి వేలు చూపించేడు రిక్వెస్ట్ గా. బామ్మ గుడ్లురుమి చూసేసరికి ఊరు కున్నాడు.


పెళ్ళి ఆఖరుకు వచ్చింది. అరుంధతిని చూపించేరు. పండుగాడి అవస్థ చూసి బామ్మ,


“మా మనవడు అలిసిపోయాడు కాసేపు రెస్ట్ తీసుకుంటాడు.” అని పంతులికి చెప్పింది.


“అలాగేనమ్మా! పెళ్ళి కొడుకూ పెళ్ళికూతురూ ఇద్దరూ కాసేపు రెస్ట్ తీసుకోండి, నేనూ చిన్న కునుకు తీస్తాను” అన్నాడు పంతులు.


బామ్మ పండుగాడితో పాటూ విడిది గదికి వచ్చింది. విడిది గది కాస్తా తాళం వేసి ఉంది. ఆ పక్కనే మరొక గది తలుపు కాస్తా తీసి ఉండేసరికి, అందులోకి తీసుకు వెళ్ళి,


“చీక్కొరా వెధవా, సైగలు చేసి చేసి చంపుతున్నావు నన్ను ” అంది మనవడిని. పండుగాడు తృప్తిగా రాజ్యాన్ని జయించినంత ఆనందంగా వేలు చీక్కుంటూ తన్మయత్వంలో మునిగి పోయాడు.


పండుగాడి పక్కన కూర్చున్న బామ్మకు ఏదో శబ్దం వినిపిస్తోంది. ‘ఏమిటా శబ్దం?’ అని జాగ్రత్తగా వినేసరికి, పిల్లి పాలు గబగబా తాగుతున్నట్టు ‘లప లప్ లప్’ మని శబ్దం. ‘పిల్లి ఎక్కడైనా వుందేమో?’ అని విశాలమైన గదిలో తలుపు పక్కకి వెళ్ళి, తొంగి చూసింది.


తలుపు వారగా కూర్చొని బొటకనవేలు గబ గబ చీకుతున్న పెళ్ళికూతుర్ని గుడ్లప్పగించి చూసి నవ్వుకుంటూ, జాతక రత్న, ‘జాతకం అమోఘం, గుణాలు అద్వితీయం’ అంటే మరీ ఇంతలా కలవాలా జాతకాలు అనుకొని,


“వేలు చీకింది చాల్లే అమ్మాయ్, రా వెళదాం!” అంటూ మనవడి పెళ్ళాన్ని నవ్వుకుంటూ దగ్గరకు తీసుకుంది బామ్మ.


🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: