12, డిసెంబర్ 2024, గురువారం

తిరుమల సర్వస్వం -85*

 *తిరుమల సర్వస్వం -85* 

*శ్రీ భగవద్రామానుజాచార్యులు-2*

రామాయణ పారాయణం ఇలా కొనసాగుతున్న తరుణంలో, ఒకసారి తిరుమలనంబి తాను ఉభయ సంధ్యలలో మాత్రమే శ్రీవారిని దర్శించుకో గలుగుతున్నానని, అలిపిరిలో ఉండిపోవడం వల్ల మధ్యాహ్న సమయంలో శ్రీవారి దర్శనభాగ్యం కలగడం లేదని వాపోయారు. భక్తుని యొక్క ఆర్తిని అర్థం చేసుకున్న శ్రీనివాసుడు, రామాయణ ఉపదేశం జరుగుతున్న ప్రదేశం లోనే తన పాదపద్మాలు ప్రత్యక్షమయ్యేట్లు చేశారు. అప్పటినుండి అపరాహ్ణసమయంలో కూడా, రామాయణ ప్రసంగం మధ్యలో తిరుమలనంబి, రామానుజులు వార్లు శ్రీవారి పాదదర్శనం చేసుకుంటూ ఉండేవారు. అలిపిరి నడక మార్గం ప్రారంభంలో ఈనాడు మనం *"శ్రీవారి పాదమండపం"* గా చెప్పుకునే దేవాలయంలో విరాజిల్లుతున్న పాదపద్మాలు అవే. ఆ దేవాలయాన్ని సందర్శించుకునే భక్తులను శ్రీవారి లోహపాదుకలతో అర్చకులు ఆశీర్వదించే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. 

*త్రోవభాష్యకార్లనన్నిథి* 

రామానుజుల కలం నుంచి వెలువడిన ఆణిముత్యాలలో, *శ్రీభాష్యం* విశిష్టమైంది. అందువల్లనే రామానుజులవారు *"భాష్యకారులుగా"* ప్రసిద్ధికెక్కారు. వైష్ణవాలయాలన్నింటిలో, *"భాష్యకార్లసన్నిధి"* యందు కొలువై ఉండే రామానుజులవారిని మనం దర్శించుకోవచ్చు.

 ఒకసారి రామానుజులవారు తిరుమల క్షేత్రానికి పయనమై తన పాదాలతో వేంకటాచలాన్ని అపవిత్రం చేయడానికి మనస్కరించక, మార్గ మధ్యలో ఉన్న వేంకటాద్రిగా భావింపబడే మోకాళ్ళపర్వతాన్ని తన మోకాళ్ళతో అధిరోహించ సాగారు. మోకాలి చిప్పలు గాయ పడడంతో, మోకాళ్ళపర్వతం మధ్యభాగంలో కొంత సేపు విశ్రమించారు. విషయాన్ని తెలుసుకున్న అనంతాళ్వార్, తిరుమలనంబి, కొండపై నుండి కొంత దూరం దిగి వచ్చి, రామానుజుల వారి కెదురేగి, స్వామివారి ప్రసాదం అయిన మామిడి పండ్లను రామానుజులకు సమర్పించారు. వారు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించగా, క్రిందపడిన ఉచ్ఛిష్టం (ఫలాలను తినగా మిగిలన టెంకలు) మొలకెత్తి కొన్నాళ్లకు పెద్దవయ్యాయి. తరువాతి కాలంలో, ఆ పవిత్రస్థలంలో ఓ మందిర నిర్మాణం జరిగి, అందులో భగవద్రామానుజుల మూర్తి ప్రతిష్ఠించబడింది. ఆ ఆలయాన్ని, తిరుపతి-తిరుమల "త్రోవలో" ఉన్న కారణం చేత, *"త్రోవభాష్యకార్లసన్నిధిగా"* పిలుస్తారు. అలిపిరి నడకమార్గంలో, దాదాపు మూడొంతులు ప్రయాణం చేసిన తర్వాత వచ్చే "మోకాళ్ళపర్వతం" మధ్యభాగంలో ఈ ఆలయాన్ని నేడు కూడా చూసి తరించవచ్చు. ]

*తిరుమల క్షేత్ర ఆగమనం* 

మోకాళ్ళపర్వతం మెట్లన్నీ మోకాళ్ళపై అధిరోహించి తిరుమల చేరుకున్న రామానుజాచార్యులు, తదనంతర కాలంలో ఆలయాభివృద్ధికి అవిరళ కృషిచేశారు. శ్రీకృష్ణరాయలు ఆలయాన్ని భౌతికంగా అభివృద్ధి చేస్తే, అంతకు ఐదు శతాబ్దాల క్రితమే రామానుజులు శ్రీవారి ఆనందనిలయానికి ఆధ్యాత్మిక సొబగులు చేకూర్చి, నిర్జనారణ్యంలా ఉండే దేవాలయ పరిసరాల్ని ఆవాసయోగ్యంగా అభివృద్ధి పరచి, ఆలయనిర్వహణను, వైదిక కైంకర్యాలను క్రమబద్ధీకరించి, భక్తుల కొంగుబంగారమైన శ్రీవారి ఆలయాన్ని భద్రంగా భావితరాల కందించారు. 

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

కామెంట్‌లు లేవు: